వైభవంగా కడప రాయుడి కల్యాణం
కడప కల్చరల్ : కడప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి కల్యాణం బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై స్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా వధూవరులుగా అలంకరించి కొలువుదీర్చారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు మచ్చా శేషాచార్యులు, మయూరం కృష్ణమహన్, పార్థసారథి తదితరులు కల్యాణ క్రతువును నిర్వహించారు. మహా మంగళసూత్రాలను భక్తులకు దర్శింపజేసి స్వామి పక్షాన అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం లాజహోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. అనంతరం ఉభయదారులతో పూజలు చేయించి వారికి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. హాజరైన భక్తులందరికీ మంగళాక్షతలతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.