వైఎస్సార్, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిల చిత్రపటాలకు కనకాభిషేకం చేస్తున్న అర్చకులు
పట్నంబజారు (గుంటూరు): ‘శతమానం భవతి.. శతాయుః పురుషశ్శతేంద్రియ.. ఆయుష్యేవేంద్రియే.. ప్రతితిష్ఠతి..’ అంటూ వేదపండితులు, అర్చకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నిండు మనసుతో ఆశీర్వదించారు. వంశపారంపర్య అర్చకత్వానికి ప్రభుత్వం ఆమోదించడంతో పండిత లోకం పొంగిపోయింది. తమ కల సాకారమైందని హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. గత పాలకులెవరికీ పట్టని తమ గోడు తలకెత్తుకుని తుది ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది. వైఎస్ జగన్ చిత్రపటానికి అర్చకులు కనకాభిషేకం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని గులాబీ పూలతో అభిషేకించారు. అర్చకులు సాధారణంగా తాము ఆరాధించే దేవుణ్ణి తప్ప మరెవర్నీ స్తుతించరు. అలాంటిది మంగళవారం గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) ఆధ్వర్యంలో దేశంలోనే మరే ఇతర ముఖ్యమంత్రికీ జరగని అభిషేకం జగన్‌మోహన్‌రెడ్డికి చేసి ఘనంగా తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
నిజమైన జననేత.. జగన్
వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నేత లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ఎన్నికల హామీల అమలుకు పూనుకున్న తమ నేత జగన్, నిజమైన జననేత అన్నారు. ఏళ్లనాటి అర్చకుల కలను సాకారం చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో పుష్కర కాలంగా పెండింగ్‌లో ఉన్న చట్ట సవరణను అధికారం చేపట్టిన ఐదు మాసాల్లోపే సీఎం జగన్ అమలు చేయడం సంతోషించదగ్గ అంశమన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఆచారి మాట్లాడుతూ ఇది యావత్ బ్రాహ్మణ సమాజం సంతోషించాల్సిన సమయమన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని ఇంత వేగంగా అమలు పరచడం ఆనందదాయకమన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు తమను దారుణంగా దగా చేశారని ధ్వజమెత్తారు.
అర్చకులను పట్టించుకుంది నాడు తండ్రి, నేడు తనయుడే
అర్చకుల సమస్యలను పట్టించుకున్నది నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, నేడు ఆయన తనయుడు జగనే. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో 76 నంబరుతో అర్చకులకు వెలుగు దొరికిందని భావించాం. అయితే ఆ జీవో అప్పట్లో పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన జీవో నంబరు 439 ఎంతో ఉపయోగకరంగాఉంటుంది.
– శ్రీకంఠ నందీశ్వరశాస్త్రి, రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment