సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, నేతలు పండగలా నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించి.. వైఎస్సార్‌సీపీ జెండాలనూ ఊరూరా ఆవిష్కరించారు. భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి.. పార్టీ కార్యాలయాల్లో భారీ కేక్‌లు కట్ చేశారు. నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసి.. అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజలు, వైఎస్సార్‌సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా.. ప్రజాభ్యుదయమే ధ్యేయంగా 2011 మార్చి 12న వైఎస్సార్‌సీపీని సీఎం వైఎస్ జగన్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రస్థానంలో 12 ఏళ్లు పూర్తి చేసుకుని ఆదివారం 13వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించారు.
తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి, మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సాగిస్తున్న సంక్షేమాభివృద్ధి పాలనను గుర్తుచేస్తూ యువకులు జై జగన్ నినాదాలు చేశారు.
♦విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
♦ అనంతపురం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. తిరుపతిలోని తన నివాసంలో మంత్రి పెద్దిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. నగరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి ఆర్కే రోజా కేక్ కట్ చేశారు. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి జెండా ఎగురవేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కేక్ కట్ చేశారు.
♦గుంటూరులో పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి, కేక్‌ను కట్‌చేశారు. 500 మీటర్ల వైఎస్సార్‌సీపీ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ పతాకం రెపరెపలాడింది.
♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి, ఏలూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని వేడుకల్లో పాల్గొన్నారు.
♦ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి వేణు, హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్ పాల్గొన్నారు.
♦ విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరులో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పార్టీ జెండాను ఎగురవేశారు.
Comments
Please login to add a commentAdd a comment