తండ్రీ కొడుకుల దెబ్బ.. చంద్రబాబు అబ్బా | TDP Three Times Lost in Four Elections At Anantapur District | Sakshi
Sakshi News home page

తండ్రీ కొడుకుల దెబ్బ.. చంద్రబాబు అబ్బా

Published Wed, Apr 10 2024 6:58 AM | Last Updated on Wed, Apr 10 2024 7:38 AM

TDP Three Times Lost in Four Elections At Anantapur District  - Sakshi

ఉమ్మడి జిల్లాలో నాలుగు ఎన్నికల్లో మూడు దఫాలు టీడీపీకి పరాభవం 


 వైఎస్సార్‌ హయాంలో రెండు సార్లు దారుణ ఓటమి 


 2019లో వైఎస్‌ జగన్‌ సునామీలో కొట్టుకుపోయిన సైకిల్‌ 


 వైఎస్సార్‌ సీపీకే ఉమ్మడి అనంతపురం జిల్లా కంచుకోట అని నిరూపితం 


 ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం    కానుందని విశ్లేషకుల అంచనా 

తనకు ఎదురేలేదని విర్రవీగిన ఆయనకు పెద్దాయన గట్టిదెబ్బే కొట్టారు. దారుణ ఓటమి రుచిచూపించారు. అయితే, అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణంతో మళ్లీ తెరమీదికి వచ్చిన ఆయన.. ప్రజలను బురిడీ కొట్టించి మళ్లీ గద్దెనెక్కారు. నమ్మి ఓట్లేసిన పాపానికి నరకం చూపించారు. ఆయన చేతిలో దారుణంగా మోసపోయిన జనం.. తమను అక్కున చేర్చుకున్న పెద్దాయన కుమారుడికి పట్టం కట్టారు. ఆ పెద్దాయన, ఆయన కుమారుడు మరెవరో కాదు దివంగత నేత వైఎస్సార్, ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి.  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేతిలో 2004,2009లో ఘోర పరాభవం మూటగట్టుకున్న చంద్రబాబును.. ఆయన తనయుడు జగన్‌మోహన్‌ రెడ్డి కూడా మట్టి కరిపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాబుకు చుక్కలు చూపించారు. గతంలో జరిగిన నాలుగు ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 14 నియోజకవర్గాలున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్‌ కుటుంబ విశ్వసనీయతకే జనం పట్టం కట్టినట్లు             తెలిసిపోతుంది. మాట ఇస్తే దాన్ని నెరవేర్చే వరకూ వెనకడుగు వేయని తత్వం, తమ అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటారన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతోనే ఇది సాధ్యమైంది. తమకు జిల్లా కంచుకోట అని బాకాలు ఊదే టీడీపీ నాయకుల మాటలను జనం నమ్మడం లేదు. 

చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో.. 
40 ఏళ్ల రాజకీయ చరిత్ర తనదనీ, మూడు దఫాలు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకునే చంద్రబాబు.. తండ్రీతనయుల చేతిలో దారుణంగా ఓడిపోవడం చరిత్రలో ఒక విచిత్రం. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేతగా ఉన్న వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో     సంపూర్ణ ఆధిపత్యం సాధించారు. టీడీపీని పరాభవం బాట పట్టించారు. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టడం, తన హయాంలోనే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేయడంతోనే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.  

2019లో సునామీ సృష్టించిన జగన్‌ 
ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా 2019లో రాజకీయ పెను తుఫాను సంభవించిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌ సీపీ      ప్రభంజనం సృష్టించింది. ఫ్యాను ధాటికి సైకిల్‌ గల్లంతైంది. జనహితమే లక్ష్యంగా బరిలోకి దిగిన జగన్‌ సైన్యం టీడీపీ అభ్యర్థులను మట్టి               కరిపించింది. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి   తండ్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి రెండు దఫాలు బాబును కోలుకోలేని దెబ్బతీయగా.. 2019లో జగన్‌ ఏకంగా చంద్రబాబును రాజకీయంగా వెంటిలేటర్‌పై పడుకోబెట్టినంత పనిచేశారు. ఇక అప్పట్లో గెలిచిన ఇద్దరు టీడీపీ అభ్యర్థులు కూడా అత్తెసరు మెజారీ్టతో గట్టెక్కడం గమనార్హం.  

పాతకథ పునరావృతమే..!  
2019 ఫలితాలు ఈ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో పారీ్టకి పనిచేసిన వారిని కాదని డబ్బున్న వారికి టికెట్లు ఇవ్వడంతో టీడీపీలో అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీ కేడర్‌ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. అభ్యర్థుల ఎంపిక తమ పారీ్టకి గుదిబండలా తయారైందని నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా మొన్నటిదాకా తీవ్రంగా విమర్శించిన గుమ్మనూరు జయరామ్‌కు చంద్రబాబు టికెట్‌ ఇవ్వడంతో కేవలం డబ్బు కోసమే సీటు కేటాయించారన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్నాయి. కళ్యాణదుర్గం, అనంతపురం, పుట్టపర్తి వంటి నియోజకవర్గాల్లోనూ డబ్బున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ద్వితీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ టీడీపీకి భంగపాటు తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement