
సాక్షి, అమరావతి: ఒక గుడిని నమ్ముకొని దశాబ్దాలపాటు అర్చకత్వం చేసుకుంటూ జీవించే అర్చక కుటుంబాల ఏళ్ల నాటి కలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. అలాంటి ఆలయాల్లో ఆ అర్చక కుటుంబమే వంశపారంపర్యంగా అధికారికంగా అర్చకత్వం కొనసాగించుకోవడానికి ఆమోదం తెలుపుతూ సోమవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మినహా దేవదాయ శాఖ పరిధిలో ఉండే 6 (ఏ), 6 (బీ), 6 (సీ) ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ పథకం అమలవుతుంది. 1966 నాటి దేవదాయ శాఖ చట్టం ప్రకారం.. ఏదైనా ఆలయంలో అర్చకులుగా చేరినవారి కుటుంబాలకు ఆ ఆలయంలో వంశపారంపర్య అర్చకత్వం చేసుకోవడానికి అర్హత ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంశపారంపర్య అర్చకత్వానికి తమ ఆలయ వివరాలతో దేవదాయ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత కాలంలో ఏదైనా ఆలయంలో నిర్ణీత జీతభత్యాల మేరకు నియమితులైతే వంశపారంపర్య అర్చకునిగా కొనసాగుతారో.. లేదంటే నియమితులైన చోట పనిచేస్తారో ఎంచుకునే వీలు అర్చకులకే కల్పించారు.
ఏ ఆలయానికి ఎవరు వంశపారంపర్య అర్చకత్వానికి అర్హులో తేల్చుతూ దేవదాయ శాఖ కమిషనర్ పారదర్శకంగా ఒక జాబితాను తయారు చేస్తారు. అర్హత ఉన్న అర్చకులు, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్, కుటుంబ వారసత్వ పట్టిక, అందుకు సంబంధించిన అఫిడవిట్లను దేవదాయ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. వంశపారంపర్య అర్చకత్వానికి గుర్తింపు పొందిన వారు.. తమ తదనంతరం వారసులుగా ఎవరు కొనసాగుతారో తెలపాలి. వంశపారంపర్య అర్చకుడిగా నియమించాలంటే కనీస వయసును 16 ఏళ్లుగా నిర్ణయించారు. ఒక ఆలయంలో వంశపారంపర్య అర్చకత్వానికి అర్హత ఉన్న కుటుంబం వేరొక ఆలయానికి బదిలీపై వెళ్లడానికి అనుమతించరు. రూ.ఐదు లక్షల ఆదాయం లోపు ఉన్న ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వంలో సెక్షన్ 144 అమలుకు మినహాయింపునిచి్చ.. కొత్త నిబంధనలు రూపొందిస్తారు. ధారి్మక పరిషత్ నియమ నిబంధనలకు అనుగుణంగా వంశపారంపర్య అర్చకులకు అందించే ప్రయోజనాలను ఆలయాల వారీగా ప్రత్యేకంగా పేర్కొంటారు.
12 ఏళ్ల తర్వాత విధివిధానాలు ఖరారు
వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలుపుతూ 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేవదాయ శాఖ చట్టానికి చట్ట సవరణ తీసుకొచ్చారు. దీనికనుగుణంగా పూర్తి విధివిధానాలతో తుది ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియ ముగియక ముందే ఆయన దివికేగారు. ఆ తర్వాత 12 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు అర్చకులను మోసం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే వంశపారంపర్య అర్చకత్వం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లపాటు మాయమాటలతో మభ్యపెట్టి అర్చకుల తీవ్ర ఒత్తిడితో 2017, ఫిబ్రవరి 16న వంశపారంపర్య అర్చకత్వం అమలుపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయించారు. అభ్యంతరాలు స్వీకరించాక తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి మరోసారి మోసపుచ్చారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పాదయాత్రలో అర్చకులు కలిసినప్పుడు ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే వంశపారంపర్య అర్చకత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇచి్చన మాటను నిలబెట్టుకున్నారు.
దేవాలయాల రక్షణకు దోహదం
వంశపారంపర్య అర్చకత్వం అమలుకు ఆమోదం తెలపడం పట్ల అర్చక కుటుంబాలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయని టెంపుల్స్ ప్రొటెక్షన్ మూమెంట్ కన్వీనర్ ఎంవీ సౌందర్యరాజన్, సీఎస్ రంగరాజన్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి సానుకూల చర్యలు దేవాలయాలను రక్షించడానికి సహాయపడతాయని తెలిపారు.
సీఎం వైఎస్ జగన్‌కు అర్చకులందరి ఆశీస్సులు
పుష్కర కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్‌కు అర్చకులందరి ఆశీస్సులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో పేర్కొంది. దివంగత సీఎం వైఎస్సార్ చేసిన చట్టాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చంద్రబాబు కూడా మాయమాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చారని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్రిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వహణ కార్యదర్శి పెద్దింటి రాంబాబు, తదితరులు విమర్శించారు. ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, బ్రాహ్మణ సంఘాల నేత ద్రోణంరాజు రవికుమార్ కూడా వేర్వేరుగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయం ముదావహం
అర్చకుల వారసత్వపు హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయం ముదావహమన్నారు. అర్చకుల జీవితాల్లో మార్పుకు నాంది పలుకుతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయ వ్యవస్థను కాపాడటంలో అర్చకుల పాత్ర చాలా గొప్పదని తెలిపారు. హిందూ, ధార్మిక, దేవదాయ ధర్మాదాయ వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వం ఇదే కృషిని కొనసాగించాలన్నారు. కాగా, అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారమవ్వడంతో అర్చకుల జీవితాల్లో ఇక వెలుగులు నిండుతాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు.