0.35 శాతం దాకా బేస్ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లను దాదాపు 0.35 శాతం దాకా తగ్గించాయి. ప్రభుత్వ రంగానికి చెందిన యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బేస్ రేటును 9.9 శాతం నుంచి 9.65 శాతానికి తగ్గించింది. ఇది అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అటు సిండికేట్ బ్యాంక్ బేస్ రేటును 0.30 శాతం తగ్గించడంతో ఇది 9.70 శాతానికి దిగి వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25 శాతం తగ్గించి బేస్ రేటును 9.70 శాతానికి పరిమితం చేసింది. కొత్త రేటు ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తుంది. కరూర్ వైశ్యా బ్యాంక్ 0.35 శాతం బేస్ రేటును తగ్గించడంతో ఇది 10.40 శాతానికి దిగి వచ్చింది. ఈ రేటు అక్టోబర్ 5 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. యూనియన్ బ్యాంక్ బేస్ రేటును 0.35 శాతం తగ్గించింది. దీంతో అక్టోబర్ 5 నుంచి కొత్త బేస్ రేటు 9.65 శాతం అమల్లోకి వస్తుందని బ్యాంకు పేర్కొంది. ఇండియన్ బ్యాంక్ 30 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బేస్ రేటు 9.65 శాతానికి తగ్గింది. ఇది అక్టోబర్ 7 నుంచి అమల్లోకి వస్తుంది. రుణాలపై వడ్డీ రేటును నిర్ణయించడానికి బేస్ రేటే ప్రామాణికంగా ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లూ తగ్గింపు..
యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ కాలపరిమితులు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను 0.25-0.50 శాతం మేర తగ్గించింది. అక్టోబర్ 5 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయి. అటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) వివిధ మెచ్యూరిటీల ఎఫ్‌డీలపై 0.25 శాతం మేర వడ్డీ రేటు తగ్గించింది. కొత్త రేటు ఈ నెల 5 నుంచి అమల్లోకి వస్తుంది. అటు, ప్రభుత్వం నుంచి లభించిన అదనపు మూలధనానికి గాను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రానికి రూ. 3,534 కోట్ల విలువ చేసే ప్రిఫరెన్షియల్ షేర్లను కేటాయించాయి.
వడ్డీ రేట్లు తగ్గించిన మరిన్ని బ్యాంకులు
Published Sun, Oct 4 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM
Advertisement
Advertisement