జనసంద్రంగా కోటప్పకొండ
మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వరుడికి విశేష పూజలు
నరసరావుపేట రూరల్ : ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ సోమవారం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసరాలు శివ నామ స్మరణతో మారుమోగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి త్రికోటేశ్వరుడిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తొలుత బిందతీర్దంతో అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. సాలంకయ్య అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి, యాగశాలలో చండీ, రుద్ర, గణపతి యాగాలు నిర్వహించారు. ధ్యాన శివుడు, నాగేంద్రుడి పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన ప్రసాదం కౌంటర్ వద్ద భక్తుల రద్దీ కనిపించింది. పలువురు భక్తులు మెట్లకు పూజ చేస్తూ కొండకు చేరుకున్నారు. గొల్లభామ గుడి కూడా భక్తులతో నిండిపోయింది. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచిత ప్రసాదాలు, తాగు నీరు పంపిణీ చేశాయి.
ప్రముఖుల రాక..
స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ర్ట మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, సినీ హీరో శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. హీరో శ్రీకాంత్‌తో కరచాలనం చేసేందుకు భక్తులు పోటీపడ్డారు.