ధైర్యంగా ఉండండి..ప్రభుత్వం ఆదుకుంటుంది
- ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కుటుంబానికి మంత్రులు ప్రత్తిపాటి , శిద్దా పరామర్శ
- రూ.5 లక్షలు పరిహారం
- పొగాకు బోర్డు, వ్యాపారులతో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
టంగుటూరు : ఆత్మ స్థైర్య కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పొగాకు రైతులకు సూచించారు. ఆత్మహత్మకు పాల్పడిన పొదవారిపాలేనికి చెందిన పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుంటుంబ సభ్యులను మంత్రి పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర రోడ్డురవాణా శాఖా మంత్రి సిద్దా రాఘవరావు, కలెక్టర్ సుజాతశర్మ ఆదివారం పరామర్శించారు. పొగాకు రైతులకు ధైర్యం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమను పంపించాడని తెలిపారు. రూ. 37.5 లక్షల అప్పు ఉందని మృతుని కుటుంబ సభ్యులు మంత్రులకు వివరించారు. ఆ కుటుంబ దయనీయ పరిస్థితిని స్థానికులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తుందని ప్రకటించారు. ప్రైవేట్ అప్పులు చెల్లింపు బాధ్యతను ఆర్‌డీవోకు అప్పగించారు.
రేపే బోర్డు అధికారులు, పొగాకు వ్యాపారులతో సీఎం సమావేశం
ప్రస్తుత పరిస్థితిపై చర్చించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు బోర్డు, వ్యాపారులు, ఎగుమతిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని మంత్రి పుల్లారావు తెలిపారు. గిట్టుబాటు ధరలకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని భరోసా ఇచ్చారు.
అదనపు పొగాకుపై అపరాద రుసం రద్దు చేయండి
అదనపు పొగాకు కొనుగోళ్లపై ప్రస్తుతం కొనసాగుతున్న అపరాద రుసుం 15 శాతం,సెస్‌లను రద్దు చేయాలని స్థానిక రైతులు, రైతు సంఘం నాయకుడు గోపి మంత్రులను కోరారు. ప్రస్తుతం రైతుల వద్ద లోగ్రేడే పొగాకు ఉందని,అందుకే అపరాద రుసుం రద్దు చేసి రైతులను ఈమేరకైనా ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి, టీడీపీ నాయకులు మంత్రుల వెంట ఉన్నారు.