ప్రకృతి వ్యవసాయానికి చేయూత
మంత్రి ప్రత్తిపాటి వెల్లడి
కొరిటెపాడు(గుంటూరు): సహజ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక కృషిభవన్‌లో సహజ వ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సహజ వ్యవసాయంపై రాష్ట్ర వ్యాప్తంగా 39 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్‌కు 300 మంది రైతులను కేటాయింంచి, మొత్తం 39 వేల మంది రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల హెక్టార్లలో సహజ వ్యవసాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడింంచారు. దీనిలో భాగంగా ఆవు కొనుగోలుకు ప్రభుత్వం రూ.10 వేలు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.రైతులు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించాలని సూచించారు. పొగాకు గిట్టుబాటు ధర కోసం రైతులు, పొగాకు మ్యాన్‌ఫాక్చర్స్, ఎక్స్‌పోర్టర్లతో కలసి శుక్రవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నట్లు వెల్లడించారు.
కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు అధికంగా వాడే జిల్లాల్లో గుంటూరు ప్రథమ స్థానంలో ఉందన్నారు. భూములు నిస్సారంగా మారుతున్నాయని చెప్పారు. సహజ వ్యవసాయంలో దిగుబడి తగ్గినా ధరలు అధికంగా ఉంటాయని తెలిపారు. జేడీఏ కృపాదాసు, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, గుంటూరు రూరల్ ఎంపీపీ తోట లక్ష్మీకుమారి, వ్యవసాయాధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.