15లోపు తాగునీటి విడుదల
- డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వండి
- కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
- సమీక్షా సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు వెస్ట్ : జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఈనెల 15వ తేదీలోపు తాగునీటి కోసం సాగర్ జలాలను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో శుక్రవారం వ్యవసాయం, వర్షాభావ పరిస్థితులు, తాగు, సాగునీరు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.
నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి తదితర ప్రాంతాలలో ఈనెలాఖరు నాటికి తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ గత ఏడాది కంటే అదనంగా పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ వెల్లడించారు. సబ్సిడీపై గిరిరాజ్ ఆవులను అందజేయనున్నట్లు పశుసంవర్థక శాఖాధికారి దామోదరంనాయుడు వెల్లడించారు. జిల్లాలోని వివిధ గ్రామాలలో తాగునీటి ఎద్దడి కారణంగా 83 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ గోపాలకృష్ణ మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ జూన్,జూలైలో కురిసిన వర్షాల వల్ల ప్రస్తుతం పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు వల్ల ఎక్కడైనా పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొంటే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. దాణా, పసుగ్రాసం కొరత రాకుండా చూడాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలను, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కంది, ఉల్లి పంటలను, డ్రిప్ ఇరిగేషన్, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. మాచర్ల, గురజాలలో రైతుబజార్లను ఏర్పాటు చేయాలని గురజాల ఆర్‌డీఓను ఆదేశించారు. కరువు పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి పుల్లారావు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ షేక్ జానీమూన్, కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ-2 ముంగా వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వి.పూర్ణచంద్రరావు, సీఈఓ బి.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.