Sagar waters
-
15లోపు తాగునీటి విడుదల
- డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వండి - కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం - సమీక్షా సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి గుంటూరు వెస్ట్ : జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఈనెల 15వ తేదీలోపు తాగునీటి కోసం సాగర్ జలాలను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో శుక్రవారం వ్యవసాయం, వర్షాభావ పరిస్థితులు, తాగు, సాగునీరు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి తదితర ప్రాంతాలలో ఈనెలాఖరు నాటికి తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ గత ఏడాది కంటే అదనంగా పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ వెల్లడించారు. సబ్సిడీపై గిరిరాజ్ ఆవులను అందజేయనున్నట్లు పశుసంవర్థక శాఖాధికారి దామోదరంనాయుడు వెల్లడించారు. జిల్లాలోని వివిధ గ్రామాలలో తాగునీటి ఎద్దడి కారణంగా 83 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ గోపాలకృష్ణ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ జూన్,జూలైలో కురిసిన వర్షాల వల్ల ప్రస్తుతం పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు వల్ల ఎక్కడైనా పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొంటే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. దాణా, పసుగ్రాసం కొరత రాకుండా చూడాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలను, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కంది, ఉల్లి పంటలను, డ్రిప్ ఇరిగేషన్, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. మాచర్ల, గురజాలలో రైతుబజార్లను ఏర్పాటు చేయాలని గురజాల ఆర్డీఓను ఆదేశించారు. కరువు పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి పుల్లారావు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్పర్సన్ షేక్ జానీమూన్, కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ-2 ముంగా వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వి.పూర్ణచంద్రరావు, సీఈఓ బి.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సాగర్ జలాల కోసం మరో ఉద్యమం: పొంగులేటి
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి సాక్షిప్రతినిధి, ఖమ్మం: సాగర్ జలాలను ఖమ్మం జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమవుతోందని పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కిగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌తోపాటు పలు ప్రాంతాలు పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ఏరకమైన ప్రాధాన్యం ఇస్తారో.. వ్యవసాయానికి కూడా అదేరీతిలో సాగునీరు ఇవ్వాలన్నారు. రైతుల కన్నీరు తుడవకుండా ఏ అభివృద్ధి చేసినా నిష్ర్పయోజనమేనని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును నేరుగా కలిసి రైతుల సమస్యలను వివరిస్తామని చెప్పారు. సాగర్ జలాలతో వైరా రిజర్వాయర్‌ను నింపాలని కోరారు. -
సాగర్ జలాలకు దారేది ?
చిలకలూరిపేటరూరల్, న్యూస్‌లైన్: ప్రకృతి ప్రకోపం ఓ వైపు, పాలకుల నిర్లక్ష్యం మరోవైపు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమైన తరుణంలో వరుణుడు ముఖం చాటేయడంతో సాగర్ జలాలపై ఆశలు పెట్టుకున్నారు. పొలాల్లో విత్తనాలు నాటి సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. సాగర్ కుడి కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొంటుంటే చివరి భూములకు నీళ్లు అందుతాయో లేదోనని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెన్నార్ మేజరు కాలువలో పూడికతీత పనులు పూర్తికాకపోవడమే ఇందుకు కాణమని చెపుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలోనే సాగునీటి కాలువల దుస్థితి ఇలా ఉందంటున్నారు. వివరాల్లోకి వెళితే... ►సాగర్ కాలువల ఆధునికీకరణ పనుల్లో భాగంగా టెన్నార్ మేజర్‌లో కాంట్రాక్టర్ రెండేళ్ల కిందట జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేపట్టారు. అనంతరం పూర్తిస్థాయిలో ►పూడికతీత లేకపోవటంతో తిరిగి కాలువ పరీవాహక ప్రాంతంలో జమ్ము, అడవి తుమ్మచెట్లు విస్తారంగా పెరిగాయి. ఈ తరుణంలో సాగర్ నీటిని విడుదల చేసినా ఆయకట్టు చివరి భూములకు చేరేనా అని రైతులు సంశయిస్తున్నారు. ►టెన్నార్ మేజర్ కాలువ ఆధునికీకరణ పనులను 52వ ప్యాకేజి కింద 21.08 కిలోమీటర్లు నిర్వహించాలని నిర్ణయించారు. ►మండలంలోని కట్టుబడివారిపాలెం, యడవల్లి, మద్దిరాల, పోతవరం, కమ్మవారిపాలెం, పోలిరెడ్డిపాలెం, కోండ్రుపాడు, కావూరు, లింగంగుంట్ల తదితర గ్రామాలకు టెన్నార్ మేజర్ కాలువ ద్వారా 36 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. టెన్నార్ మేజర్‌ను డీసీ-1, డీసీ-2ల పేరుతో రూ.15 కోట్లకు టెండర్లు పిలిచారు. ప్రభు త్వానికి కాంట్రాక్టర్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2015 జూలై లోపు కాలువ పనులు పూర్తిచేయాలి. ►కాలువ పరిధిలోని మైనర్, మేజర్ మరమ్మతులతోపాటు పైప్లైన్ల రీప్లేస్మెంట్ పనులను నిర్వహించాలి. కాలువల్లో పూడిక తీసి ఇరువైపులా కరకట్టలను పటిష్టపరచాలి. ►ఇందుకు విరుద్ధంగా పనులు జరుగుతుండడంతో 2012 జూలై ఆరవ తేదీన అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కమ్మవారిపాలెం గ్రామం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. ►నాటి నుంచి నేటి వరకు పనులు అంగుళం మేర కూడా ముందుకు జరగలేదు. ►రెండేళ్ల క్రితం నామమాత్రంగా జంగిల్ క్లియరెన్స్ చేసి వదిలేశారు. నేడు తిరిగి కాలువ పరీవాహక పరిధిలో విస్తారంగా జమ్ము, అడవి తుమ్మ చెట్లు పెరిగాయి. ►రెండేళ్ల నుంచి జంగిల్ క్లియరెన్స్, లెవలింగ్, సాధారణ పూడికతీత పనులు చేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ►కాలువ పరీవాహక ప్రాంతంలో ఉన్న షట్టర్లు, అప్టేక్లు, డ్రాప్‌లు, కల్వర్టుల్లో పాతవాటిని తొలగించి అదే స్థానంలో నూతన నిర్మాణాలు పూర్తి చేయాలి. ►సంబంధిత కాంట్రాక్టర్ పట్టీపట్టనట్లు వ్యవహరించడం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంతో కాలువ పరిధిలోని వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.