చిలకలూరిపేటరూరల్, న్యూస్‌లైన్: ప్రకృతి ప్రకోపం ఓ వైపు, పాలకుల నిర్లక్ష్యం మరోవైపు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమైన తరుణంలో వరుణుడు ముఖం చాటేయడంతో సాగర్ జలాలపై ఆశలు పెట్టుకున్నారు. పొలాల్లో విత్తనాలు నాటి సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. సాగర్ కుడి కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొంటుంటే చివరి భూములకు నీళ్లు అందుతాయో లేదోనని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెన్నార్ మేజరు కాలువలో పూడికతీత పనులు పూర్తికాకపోవడమే ఇందుకు కాణమని చెపుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలోనే సాగునీటి కాలువల దుస్థితి ఇలా ఉందంటున్నారు. వివరాల్లోకి వెళితే...
►సాగర్ కాలువల ఆధునికీకరణ పనుల్లో భాగంగా టెన్నార్ మేజర్‌లో కాంట్రాక్టర్ రెండేళ్ల కిందట జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేపట్టారు. అనంతరం పూర్తిస్థాయిలో
►పూడికతీత లేకపోవటంతో తిరిగి కాలువ పరీవాహక ప్రాంతంలో జమ్ము, అడవి తుమ్మచెట్లు విస్తారంగా పెరిగాయి. ఈ తరుణంలో సాగర్ నీటిని విడుదల చేసినా ఆయకట్టు చివరి భూములకు చేరేనా అని రైతులు సంశయిస్తున్నారు.
►టెన్నార్ మేజర్ కాలువ ఆధునికీకరణ పనులను 52వ ప్యాకేజి కింద 21.08 కిలోమీటర్లు నిర్వహించాలని నిర్ణయించారు.
►మండలంలోని కట్టుబడివారిపాలెం, యడవల్లి, మద్దిరాల, పోతవరం, కమ్మవారిపాలెం, పోలిరెడ్డిపాలెం, కోండ్రుపాడు, కావూరు, లింగంగుంట్ల తదితర గ్రామాలకు టెన్నార్ మేజర్ కాలువ ద్వారా 36 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది.
టెన్నార్ మేజర్‌ను డీసీ-1, డీసీ-2ల పేరుతో రూ.15 కోట్లకు టెండర్లు పిలిచారు. ప్రభు త్వానికి కాంట్రాక్టర్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2015 జూలై లోపు కాలువ పనులు పూర్తిచేయాలి.
►కాలువ పరిధిలోని మైనర్, మేజర్ మరమ్మతులతోపాటు పైప్‌లైన్‌ల రీప్లేస్‌మెంట్ పనులను నిర్వహించాలి. కాలువల్లో పూడిక తీసి ఇరువైపులా కరకట్టలను పటిష్టపరచాలి.
►ఇందుకు విరుద్ధంగా పనులు జరుగుతుండడంతో 2012 జూలై ఆరవ తేదీన అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కమ్మవారిపాలెం గ్రామం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు.
►నాటి నుంచి నేటి వరకు పనులు అంగుళం మేర కూడా ముందుకు జరగలేదు.
►రెండేళ్ల క్రితం నామమాత్రంగా జంగిల్ క్లియరెన్స్ చేసి వదిలేశారు. నేడు తిరిగి కాలువ పరీవాహక పరిధిలో విస్తారంగా జమ్ము, అడవి తుమ్మ చెట్లు పెరిగాయి.
►రెండేళ్ల నుంచి జంగిల్ క్లియరెన్స్, లెవలింగ్, సాధారణ పూడికతీత పనులు చేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
►కాలువ పరీవాహక ప్రాంతంలో ఉన్న షట్టర్లు, అప్‌టేక్‌లు, డ్రాప్‌లు, కల్వర్టుల్లో పాతవాటిని తొలగించి అదే స్థానంలో నూతన నిర్మాణాలు పూర్తి చేయాలి.
►సంబంధిత కాంట్రాక్టర్ పట్టీపట్టనట్లు వ్యవహరించడం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంతో కాలువ పరిధిలోని వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాగర్ జలాలకు దారేది ?
Published Wed, Aug 13 2014 2:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement