వెంకాయమ్మ చెబితే ఏ అధికారి అయినా మాట వినాల్సిందే! ఎదురు చెబితే.. | Tdp Leader Prathipati Pulla Rao Political Overview Chilakaluripet Constituency | Sakshi
Sakshi News home page

వెంకాయమ్మ చెబితే ఏ అధికారి అయినా మాట వినాల్సిందే! అడ్రస్‌ గల్లంతవడంతో హైదరాబాద్‌కు మకాం..

Published Fri, Mar 10 2023 5:00 PM | Last Updated on Fri, Mar 10 2023 6:34 PM

Tdp Leader Prathipati Pulla Rao Political Overview Chilakaluripet Constituency - Sakshi

పార్టీలో ఆయనో సీనియర్ నేత. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగారు. అధికారంలో ఉన్నంత కాలం భార్యాభర్తలు అడ్డంగా దోచుకున్నారు. పార్టీ ఓడిపోయాక మకాం హైదరాబాద్‌కు మార్చాడా మాజీ మంత్రి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ నియోజకవర్గాన్ని వదిలేశాడు. ఇప్పుడు కార్యకర్తలకు టైం వచ్చింది. ఆయనపై రివెంజ్ తీర్చుకునే పనిలో పడ్డారు. ఆ నేత ఎవరో? ఆయన మీద రివెంజ్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

అబ్బో ఘన చరిత్ర 
ప్రత్తిపాటి పుల్లారావు ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తికాలం మంత్రిగా పనిచేశారు. టీడీపీలో కీలక నేతగా ఉండటంతో మంత్రిగా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్తిపాటి పుల్లారావు తన సంపదలను అడ్డగోలుగా పెంచేసుకున్నారు. మైనింగ్, లిక్కర్, రేషన్ మాఫియాకు రింగ్ మాస్టర్‌గా వ్యవహరించారు. ఇక ఆయన భార్య వెంకాయమ్మ అయితే సెటిల్మెంట్ల వ్యవహారంలో ఆరితేరిపోయారు. జిల్లాలో ఏ అధికారికి పోస్టింగ్ ఇవ్వాలన్నా, ట్రాన్స్ ఫర్ కావాలన్నా రేట్లు నిర్ణయించి వసూలు చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

పుల్లారావు భార్య వెంకాయమ్మ చెబితే ఏ అధికారి అయినా మాట వినాల్సిందే. ఎదురు చెబితే ఏమవుతుందో అధికారులకు బాగా తెలుసు. ఇలా ఐదేళ్లపాటు భార్యా భర్తలు జిల్లా మొత్తం ఊడ్చేశారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి దెబ్బకు పుల్లారావు అడ్రస్ గల్లంతయ్యింది. దీంతో వెంటనే హైదరాబాద్‌కు మకాం మార్చేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. అప్పటినుంచి టీడీపీ అనే పార్టీ ఉందనే విషయాన్నే పూర్తిగా మర్చిపోయాడు. అసలు చిలకలూరిపేట వైపు చూడడమే మానేశారు ప్రత్తిపాటి పుల్లారావు.

ఆయన రూటే సెపరేటు
పుల్లారావు తీరుతో టీడీపీ కార్యకర్తలు చిలకలూరిపేటకు పార్టీ ఇన్‌చార్జి ఉన్నారో లేదో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధినేత కార్యక్రమాలకు పిలుపునిచ్చినా పుల్లారావు మాత్రం పేటవైపు కన్నెత్తి చూడడంలేదు. స్థానిక టీడీపీ నేతలు కొంతమంది పుల్లారావు వ్యవహారశైలిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో ఓడాక పుల్లారావు చిలకలూరిపేటకు రాకుండా హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేశారని ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదంటూ.. ఆధారాలను చంద్రబాబు ముందు పెట్టారు.

దీంతో చంద్రబాబు పుల్లారావుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. అయినా పుల్లారావు తీరు మారలేదు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే గుంటూరుకు వచ్చి హాజరవడమే తప్ప చిలకలూరిపేటకు మాత్రం వెళ్లేవాడు కాదాయన. దీంతో పుల్లారావుకు సీటిస్తే తమ తడాఖా చూపిస్తామని చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు తేల్చి చెప్పేశారు. పుల్లారావుకు బదులు మరో కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వద్ద కొత్త డిమాండ్ లేవనెత్తారు. పార్టీని, కార్యకర్తలను పట్టించుకోని పుల్లారావుకు ఎందుకు సీటివ్వాలని ఏకంగా అధినేతకే ప్రశ్నల వర్షం కురిపించారని ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు కూడా నియోజకవర్గం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకున్నారట. 

అవకాశం ఇస్తే సై
పుల్లారావు తీరుతో విసుగు చెందిన స్థానిక నేతలంతా ఇక ఆయనతో కుదరదని నిర్దారించుకుని... మనమే కొత్తనేతను వెతుక్కుందామని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏగా పనిచేసిన పావులూరి శ్రీనివాస్‌పేరును తెరపైకి తెచ్చారు. పావులూరి కూడా అధినేత అవకాశం ఇస్తే చిలకలూరిపేటనుంచి పోటీ చేసేందుకు సై అన్నాడట. ఈ విషయం తెలుసుకున్న పుల్లారావు పావులూరి కాళ్లు, గడ్డాలు పట్టుకుని బతిమిలాడాడట.

ఇక పావులూరితో కూడా ప్రయోజనం లేదని అర్థం చేసుకున్న చిలకలూరిపేట తెలుగుదేశం నాయకులంతా కలిసి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే కొంతమంది నందమూరి సుహాసిని వద్దకు వెళ్లి పేటనుంచి పోటీ చెయ్యాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. సుహాసిని కూడా పోటీ చెయ్యడానికి సుముఖంగానే ఉన్నారని, పైగా బాలకృష్ణ కూడా సపోర్టు చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఇదే విషయాన్ని ఇప్పుడు చిలకలూరిపేట తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు, లోకేష్ లకు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. తాను అక్కడ లేకపోవడంతో...పేటలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకుని ప్రత్తిపాటి పుల్లారావు తెగ కంగారు పడిపోతున్నారట. చివరికి పుల్లరావును చిలకలూరిపేట తమ్ముళ్ళు ఏంచేస్తారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement