సాక్షి, ఆంధ్రప్రదేశ్: 1956–2014 మధ్య ఉనికిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌లో 1982లో తెలుగుదేశం ఏర్పాటయ్యాకే రెండు ప్రధాన రాజకీయపక్షాల మధ్య అధికారం కోసం గట్టి పోటీ జరిగే పరిస్థితులు వచ్చాయి. అంటే, 1983 ఏపీ శాసనసభ ఎన్నికల నుంచి మాత్రమే ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షానికి 30 శాతానికి పైగా ఓట్లు రావడం మొదలైంది. 1953–56 మధ్య మూడేళ్లు ఉనికిలో ఉన్న ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఒకే ఒక ఎన్నికల్లో ప్రతిపక్షానికి పడిన ఓట్లు 30 శాతం దాటాయి. 1955లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)కి 31.13% ఓట్లు దక్కాయి.
అయితే, దాదాపు మూడో వంతు శాతం ఓట్లు దక్కించుకున్నాగాని కమ్యూనిస్టులకు ఈ ఎన్నికల్లో మొత్తం 190 సీట్లకుగాను కేవలం 15 స్థానాలే లభించాయి. కాంగ్రెస్ కూటమికి, సీపీఐకి మధ్య దాదాపు అన్ని చోట్లా పోటీ తీవ్రంగా ఉండడమే ఈ అసాధారణ ఫలితాలకు కారణం. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో 1983 ఎన్నికల ముందు వరకూ ఇలా దాదాపు మూడో వంతు ఓట్లు (30%) దక్కించుకున్న ప్రధాన ప్రతిపక్షం ఏదీ లేదు. 1957, 62, 67, 72 ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌కు దాదాపు ఎదురులేని పరిస్థితి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ చివరి మూడు ఎన్నికలే రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి.
1957లో తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 105 స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షమైన సీపీఐ 25.73% ఓట్లతో 22 సీట్లు సంపాదించగలిగింది. విశాల తెలుగురాష్ట్రంలో మొదటిసారి అంతటా జరిగిన 1962 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ అత్యధికంగా 19.13% ఓట్లు సంపాదించి, 51 సీట్లు సాధించింది. అయితే, అప్పటికీ బలహీనపడిన సీపీఐ నాటి ఏపీ అసెంబ్లీలోని మొత్తం 300 సీట్లకు గాను 136 సీట్లలో మాత్రమే పోటీచేయగలిగింది.
ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (1967, 1972) ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి కనీసం 10% ఓట్లు దక్కలేదు. 1978 ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ కాసు బ్రహ్మానందరెడ్డి, ఇందిరాగాంధీ నాయకత్వంలో రెండు పార్టీలుగా దేశవ్యాప్తంగా చీలిపోయింది. ఈ చీలిక తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన 1978 ఫిబ్రవరి ఎన్నికల్లో మాత్రమే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా పార్టీకి రాష్ట్రంలో 28.85 శాతం ఓట్లు, 60 సీట్లు దక్కాయి. (ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (ఆర్) తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు నాయకత్వంలోని పార్టీకి 17% ఓట్లు, 30 సీట్లు దక్కాయి.) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1983 ఎన్నికలకు ముందు ఒక ప్రతిపక్ష పార్టీకి పాతిక శాతం వరకూ ఓట్లు వచ్చిన ఏకైక సందర్బం ఇదే.
మూడో పక్షానికి 15% ఓట్లు దాటిన ఏకైక సందర్భం 2009 అసెంబ్లీ ఎన్నికలే!
1980ల ఆరంభంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షానికి (కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్) ప్రతిసారీ 30 శాతానికి పైగానే ఓట్లు లభించాయి. 1994 ఏపీ పదో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 26 సీట్లు (మొత్తం 294కు) మాత్రమే దక్కించుకున్నప్పుడు కూడా ఈ పార్టీకి పోలైన ఓట్లలో 33.85% వచ్చాయి. ఈ పదో శాసనసభ ఎన్నికల తర్వాత మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలోకి దిగిన ప్రాంతీయపక్షానికి 15 శాతానికి మించిన ఓట్లు లభించిన సందర్భం 2009 అసెంబ్లీ ఎన్నికలే.
ఈ ఎన్నికలకు 8 మాసాల ముందు ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)కి 16.2 శాతం ఓట్లు, 18 సీట్లూ ఈ ఎన్నికల్లో లభించాయి. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలోగాని, రెండు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ)గాని మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల పోరుకు దిగిన ఏ పార్టీకి కనీసం 15 శాతం ఓట్లు దక్కలేదు. 2023 నవంబర్–డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ మూడో ఎన్నికల్లో తృతీయ ప్రత్యామ్నాయంగా భావించిన బీజేపీకి గరిష్ఠంగా 13.9 శాతం ఓట్లు, 8 సీట్లూ దక్కాయి.
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లోనూ (2014, 2019) మూడో ప్రధాన పార్టీగా బరిలోకి దిగిన ఏ రాజకీయపక్షం కూడా కనీసం ఆరు శాతం ఓట్లు సంపాదించుకోలేదు. ఇలా తెలుగునాట రెండు ప్రధాన రాజకీయపక్షాలే ఒకదాని తర్వాత మరొకటి (ఒక్కోసారి వరుసగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాగాని) సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయేగాని మూడో ప్రత్యామ్నాయ పార్టీకి లేదా కూటమికి అవకాశం ఇవ్వలేదు.
విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP
Comments
Please login to add a commentAdd a comment