కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్న చిలకలూరిపేట ప్రజాగళం కాస్తా.. టీడీపీ, జనసేన అత్యుత్సాహంతో నీరుగారిపోయింది. వందల ఎకరాలు, లక్షల జనాలు అంటూ ఉదరగొట్టిన కూటమి ప్రచారం.. ఆచరణలో చల్లబడింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత స్పీచులను తిరగేసి చదవగా.. ప్రధాని మోదీ జాతీయ వాదాన్ని వినిపించారు.
బీజేపీతో పొత్తు ఎందుకంటే.? : చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుంది. ఎవరికీ అనుమానం లేదు. మోదీ ఒక వ్యక్తి కాదు... భారత్‌ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి. మోదీ అంటే సంక్షేమం.. మోదీ అంటే అభివృద్ధి. మోదీ అంటే భవిష్యత్తు... మోదీ అంటే ఆత్మవిశ్వాసం. సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి... మోదీ. అందుకే రాష్ట్ర ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. ఐదుకోట్ల మంది ప్రజలకు ఆనందం కలిగించేందుకే ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన చేరాయని, అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఎన్టీఆర్‌ను కీర్తించిన ప్రధాని మోదీ
చిలకలూరిపేట సభలో ప్రధాని నరేంద్రమోదీ .. తన ప్రసంగంతో చంద్రబాబుకు పరోక్షంగా చురకలంటించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పదవిని, పార్టీని లాక్కుంటే.., ప్రధాని మోదీ మాత్రం చిలకలూరిపేట వేదికగా ఎన్టీఆర్‌ను కీర్తించారు. చిలకలూరిపేట ప్రజాగళం బహిరంగ సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. "ఆంధ్రా ప్రజలందరికీ నమస్కారాలు" అన్నారు. "ఎన్టీఆర్ రాముడి పాత్రలో జీవించారు, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ఆ దృశ్యమే గుర్తొచ్చింది, పేదలు, రైతుల కోసం ఎన్టీఆర్ పోరాడారు, ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల వేళ ఆయన స్మారక నాణెం విడుదల చేశాం. తెలుగు బిడ్డ పీవీకి భారత రత్న ఇచ్చి గౌరవించాం. అప్పట్లో కాంగ్రెస్ ఎన్టీఆర్‌ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది" అని అన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు
- నిన్ననే ఎన్నికల నగారా మోగింది
- తర్వాతి రోజే నేను ఆంధ్రప్రదేశ్ కు వచ్చా
- కోటప్పకొండ ఈశ్వరుడి ఆశీస్సులతో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నా
- త్రిమూర్తుల ఆశీర్వాదం లభించినట్లుగా భావిస్తున్నా
- వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం 400 ఎంపీ సీట్లు దాటాలి .. ఎన్డీఏ కి ఓటేయాలి
- ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ వికాసాన్ని కలిపి ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది
- ఎన్డీఏ పేదలకు సేవ చేసే ప్రభుత్వం
- పదేళ్ల నా పాలనలో 30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు
- రాష్ట్రానికి, పల్నాడుకు ఎంతో చేశాం
- ఏపీకి అనేక జాతీయ విద్యాసంస్థలొచ్చాయి
- ఎన్డీఏలో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళతాం
- కాంగ్రెస్ మాత్రం మిత్ర పక్షాలను వాడుకుని వదిలేస్తుంది
- ఇండియా కూటమిలో ఎవరికి వారే అన్నట్టుగా పరిస్థితి ఉంది
- ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పర విరుద్ధంగా పనిచేస్తుంటాయి
- కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి పరస్పరం పోటీ పడతాయి
- కాంగ్రెస్, లెఫ్ట్ దిల్లీలో మాత్రం కలిసిపోతాయి
- ఎన్నికలకు ముందే విభేదాలు బయటపడ్డాయి
- కాంగ్రెస్ ఇండియా కూటమి మిత్రులను వాడుకుని వదిలేస్తుంది
- ఇండియా కూటమి... అవసరాల కోసం ఏర్పాటైన స్వార్థపరుల బృందం
- ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆలోచించండి
Comments
Please login to add a commentAdd a comment