State Agriculture Minister
-
దర్జాగా బతికేలా చేద్దాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతన్నలు దర్జాగా బతికేలా చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం లోని రైతులందరికీ త్వరలోనే భూసార పరీక్షా కార్డులను అందజేస్తామని చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రంలోని చండ్యాల తరహాలో తక్కువ స్థలంలో ఎక్కువ చేపల పెంపకం చేపట్టాలని సర్కారు నిర్ణయించిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయానికి రూ.8,611 కోట్లు కేటాయించినందున వ్యవసాయ, అనుబంధ రంగాల వారికి అనేక సబ్సిడీలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ, అనుబంధ రంగాల పై నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి పోచారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జేసీ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం.. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జార్ఘండ్‌లోని చండ్యాల తరహాలో అతి తక్కువ విస్తీర్ణంలో వేల సంఖ్యలో చేప పిల్లలను పెంచేం దుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వీడియోను ప్రదర్శిం చారు. అనంతరం జెడ్పీటీసీలు, ఎంపీపీలను ఉద్ధేశించి ‘మీరు, మేం కలిసి గొర్లు, బర్లు, చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తే తెలంగాణ నుంచి వలసపోయినోళ్లంతా మళ్లీ సొంతూర్లకొచ్చి దర్జాగా బతుకుతారు’ అని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రాష్ట్రంలోని ప్రతి సర్వే నెంబర్ భూమిలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు బడ్టెట్ లో రూ.20 కోట్లు కేటాయించాం. ఏ భూమి ఏ పంటకు అనుగుణంగా ఉందో తెలుసుకుంటే రైతుకు ఎంతో మేలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగా త్వరలో ప్రతి ఒక్క రైతుకూ భూసార పరీక్ష కార్డులను అందజేస్తాం. స్త్రీనిధి కింద ఒక్కో డ్వాక్రా మహిళకు గరిష్టంగా రెండు గేదెలు కొనుగోలు చేసేందుకు వడ్డీ లేకుండా రూ.80వేల రుణం ఇప్పిస్తాం. గేదెల దాణాకు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీని అందిస్తాం. మహిళలకు ఇష్టమైన చోట గేదెలు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తాం. నీటి ప్రాజెక్టులున్న చోట్ల నాలుగు మీటర్ల పొడవు, ఆరు మీటర్ల వెడల్పు పరిధిలో ఆరు వేల చేప పిల్లలను పెంచేందుకు తగిన రాయితీలిస్తాం. ముందుకొచ్చే వారికి వంద శాతం సబ్సిడీ ఇస్తాం. కరువు ప్రాంతాల్లో గొర్రెలు పెంపకాన్ని ప్రోత్సహిస్తాం. అందుకోసం రూ.50 కోట్లు కేటాయించాం. సూక్ష్మ సేద్యం చేసే రైతులకు అవసరమైన పరికరాలను 80 శాతం రాయితీపై అందిస్తాం. ఎస్సీలకు ఉచితంగా, బీసీలకు 90 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తాం. కోల్డ్‌స్టోరేజీలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వ్యక్తులకు అందుకయ్యే వ్యయంలో 75 శాతం నిధులను కేంద్రం అందిస్తోంది. ప్రభుత్వ శాఖలు ముందుకొస్తే 90 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇకపై తెలంగాణ రైతులే బయటి రాష్ట్రాలకు విత్తనాలను విక్రయించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. -
కార్మికులకు టీడీపీ అండ: ప్రత్తిపాటి
కొరిటెపాడు(గుంటూరు): కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా టీఎన్టీయూసీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని విభాగాల్లోను టీ ఎన్టీయూసీ బలోపేతం చేయాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. టీడీపీ జిల్లా కన్వీనర్ జీవీ.ఆంజనేయులు మాట్లాడుతూ కార్యికుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ప్రతి సంస్థలోని కార్మికులు పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమను క్రమబద్దీకరించాలని కోరుతూ మంత్రి పుల్లారావుకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, గంజి చిరంజీవి, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నారా జోషి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు, నాయకులు మన్నవ సత్యనారాయణ, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, భానుమూర్తి, మేకతోటి ప్రకాశరావు, కనకరాజు, టి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగానికే సర్కారు ప్రాధాన్యం
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖల పనితీరు, రుణ మాఫీ అమలు వంటి తదితర అంశాలపై సమీక్షా సమీవేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ కిషన్ సహా, పలు శాఖల అధికారులకు ఆయా అంశాలపై పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తొ లి విడతగా రైతులకు రుణమాఫీ నిధులను బ్యాంకులకు విడుదల చేశామన్నారు. ఆ నిధులను సాధ్యమైన త్వరలో బ్యాంకర్లు అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయాల న్నారు. తద్వార కొత్త రుణాలు పొందవచ్చన్నారు. జిల్లాలో వ్యవసాయానుబంధ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలుతీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఈ యేడు 82 శాతం మాత్రమే పంటల సాగు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది 5,02,132 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయాల్సిండగా 4,11,373 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగిందన్నారు. మొత్తంగా 82శాతం మాత్రమే సాగు జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పంట నోటికి వచ్చిందని ఈపరిస్థితుల్లో విద్యుత్ సరఫరాలు ఇబ్బందులు కాకుండా చూస్తామని అన్నారు. రెండో పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచామని మంత్రి తెలిపారు. జిల్లాకు ఇప్పటివరకు 1,03, 288 మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం ఉండగా అంతకన్నా ఎక్కువగా అందినట్లు తెలిపారు. కొన్నిచోట్ల అవసరానికన్నా ఎక్కువ మొత్తంలో కొందరు అక్రమంగా నిల్వ చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చింద న్నారు. ఈ విషయంలో బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జిల్లాలో రూ.1888కోట్ల రుణమాఫీ.. తొలి విడతలో రూ.472 కోట్లు రుణమాఫీ రాష్ట్రంలో 36 లక్షలమంది రైతులకు 17వేల కోట్లను ప్రభుత్వం రుణ మాఫీ చేసిందని మంత్రి తెలిపారు. జిల్లాలో 4,13,523 మంది రైతులకు 1888కోట్లు రుణమాఫీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి తొలి విడతగా *472కోట్లు సంబందిత బ్యాంకులకు చేరినట్లు మంత్రివివరించారు. ఒక్కో రైతుకు 55వేల రుణం ప్రస్తుతం రుణ మాఫీ పొందిన ప్రతిరైతుకు * 55వేలు బ్యాంకర్లు రుణంగా చె ల్లించే లా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకుల ప్రతినిధులు అంగీకరించారని తెలిపారు. ప్రస్తుతం రైతుల రుణంగా ప్రభుత్వ చెల్లించిన 25శాతం(*25వేలు)తోపాటు మరో *30వేలు అదనంగా రుణం కింద ఇస్తారని మంత్రి తెలిపారు. దీంతో ఒక్కో రైతుకు 55వేలు తగ్గకుండా రుణం పొందే వెసులుబాటు ఉంటుందని ఆయనపేర్కొన్నారు. లక్ష రుణ మాఫీలో బాగంగా రైతులు చెల్లించాల్సిన మొత్తం పైసలు వడ్డీతోసహా ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. హార్టికల్చర్ అభివృద్ధికి 44 కోట్లు రాష్ట్రంలో ఉద్యానవన శాఖ ద్వారా 39వేల హెక్టార్లలో బిందుసేద్యం 11,700హెక్టార్లలో, తుంపర సేద్యం అమలుకు 7,397 కోట్లు కేటాయించామని ఇందులో జిల్లాలో 4500హెక్టార్లలో బిందు సేద్యం, 850హెక్టార్లలో తుంపర సేద్యానికి 44కోట్లు కేటాయించామన్నారు. పశువుల కొనుగోలుకు రుణం ఇస్తాం రాష్ట్రంలోని మహిళా సంఘాలకు స్త్రీనిధి బ్యాంకుల ద్వారా పశువులు, గొర్రెల కొనుగోలుకు రుణం మంజూరు చేస్తామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజక వర్గంలో 13కోట్లు గొర్రెల కొనుగోలుకు రుణం మంజూరు చేసిన ట్లు వివరించారు. యూనిట్లో 60శాతం రుణం, 20శాతం మార్జిన్ మనీ, 20శాతం సబ్సీడీ కింద రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ విధంగా జిల్లాకు 50కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. చేపల అమ్మకం కోసం మండల కేంద్రాలు, గ్రామాలకు మార్కెట్ల నిర్మాణం కోసం మండలకేంద్రాలకు 15లక్షలు, గ్రామాలకు 7050 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. విత్తన ఉత్పత్తి కేంద్రాలు సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలో పండించే వివిధ విత్తనాల కోసం ప్రతి జిల్లాలో విత్తన ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేస్తామని మంత్రి అన్నారు. 45కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల జిల్లాకు 54కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందని అందుకు సంబంధించిన నిధులను అర్హులైన ఆయా రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని బ్యాంకర్లు, వ్యవసాయాధిరులను మంత్రి ఆదేశించారు. చేపల పెంపకంపై దృష్టి సారించాలి: ఎంపీ కడియం ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్ కొర్రమీను చా లా రుచిగా ఉంటుందని దానికి డిమాండ్ ఎక్కువని వాటిని ఇక్కడి చెరువుల్లో పెంచేలా అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కోరారు. జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, జేసీ పౌసుమీబసు పాల్గొన్నారు. -
సాగర్ జలాలకు దారేది ?
చిలకలూరిపేటరూరల్, న్యూస్‌లైన్: ప్రకృతి ప్రకోపం ఓ వైపు, పాలకుల నిర్లక్ష్యం మరోవైపు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమైన తరుణంలో వరుణుడు ముఖం చాటేయడంతో సాగర్ జలాలపై ఆశలు పెట్టుకున్నారు. పొలాల్లో విత్తనాలు నాటి సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. సాగర్ కుడి కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొంటుంటే చివరి భూములకు నీళ్లు అందుతాయో లేదోనని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెన్నార్ మేజరు కాలువలో పూడికతీత పనులు పూర్తికాకపోవడమే ఇందుకు కాణమని చెపుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలోనే సాగునీటి కాలువల దుస్థితి ఇలా ఉందంటున్నారు. వివరాల్లోకి వెళితే... ►సాగర్ కాలువల ఆధునికీకరణ పనుల్లో భాగంగా టెన్నార్ మేజర్‌లో కాంట్రాక్టర్ రెండేళ్ల కిందట జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేపట్టారు. అనంతరం పూర్తిస్థాయిలో ►పూడికతీత లేకపోవటంతో తిరిగి కాలువ పరీవాహక ప్రాంతంలో జమ్ము, అడవి తుమ్మచెట్లు విస్తారంగా పెరిగాయి. ఈ తరుణంలో సాగర్ నీటిని విడుదల చేసినా ఆయకట్టు చివరి భూములకు చేరేనా అని రైతులు సంశయిస్తున్నారు. ►టెన్నార్ మేజర్ కాలువ ఆధునికీకరణ పనులను 52వ ప్యాకేజి కింద 21.08 కిలోమీటర్లు నిర్వహించాలని నిర్ణయించారు. ►మండలంలోని కట్టుబడివారిపాలెం, యడవల్లి, మద్దిరాల, పోతవరం, కమ్మవారిపాలెం, పోలిరెడ్డిపాలెం, కోండ్రుపాడు, కావూరు, లింగంగుంట్ల తదితర గ్రామాలకు టెన్నార్ మేజర్ కాలువ ద్వారా 36 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. టెన్నార్ మేజర్‌ను డీసీ-1, డీసీ-2ల పేరుతో రూ.15 కోట్లకు టెండర్లు పిలిచారు. ప్రభు త్వానికి కాంట్రాక్టర్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2015 జూలై లోపు కాలువ పనులు పూర్తిచేయాలి. ►కాలువ పరిధిలోని మైనర్, మేజర్ మరమ్మతులతోపాటు పైప్లైన్ల రీప్లేస్మెంట్ పనులను నిర్వహించాలి. కాలువల్లో పూడిక తీసి ఇరువైపులా కరకట్టలను పటిష్టపరచాలి. ►ఇందుకు విరుద్ధంగా పనులు జరుగుతుండడంతో 2012 జూలై ఆరవ తేదీన అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కమ్మవారిపాలెం గ్రామం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. ►నాటి నుంచి నేటి వరకు పనులు అంగుళం మేర కూడా ముందుకు జరగలేదు. ►రెండేళ్ల క్రితం నామమాత్రంగా జంగిల్ క్లియరెన్స్ చేసి వదిలేశారు. నేడు తిరిగి కాలువ పరీవాహక పరిధిలో విస్తారంగా జమ్ము, అడవి తుమ్మ చెట్లు పెరిగాయి. ►రెండేళ్ల నుంచి జంగిల్ క్లియరెన్స్, లెవలింగ్, సాధారణ పూడికతీత పనులు చేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ►కాలువ పరీవాహక ప్రాంతంలో ఉన్న షట్టర్లు, అప్టేక్లు, డ్రాప్‌లు, కల్వర్టుల్లో పాతవాటిని తొలగించి అదే స్థానంలో నూతన నిర్మాణాలు పూర్తి చేయాలి. ►సంబంధిత కాంట్రాక్టర్ పట్టీపట్టనట్లు వ్యవహరించడం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంతో కాలువ పరిధిలోని వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. -
మంత్రి ప్రోద్బలంతోనే కిడ్నాప్!
చిలకలూరిపేట: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతోనే ఎంపీటీసీ సభ్యుల కిడ్నాప్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. బుధవారం ఆయన, పార్టీ నాయకులతో కలిసి రూరల్ సీఐ సంజీవ్‌కుమార్‌ను కలిశారు. మంగళవారం కిడ్నాప్ అయిన ఎంపీటీసీల కేసు దర్యాప్తు విషయంపై ప్రశ్నించారు. మంగళవారం రాత్రి చిలకలూరిపేట మండలం యడవల్లి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు గుంటుపల్లి శ్రీనివాసరావును కొంతమంది కిడ్నాప్ చేయటం, మురికిపూడి2 వైఎస్సార్సీపీ ఎంపీటీసీ జమ్మలమడల కృష్ణను ఊరి నుంచి కొంతమంది బలవంతంగా తీసుకెళ్లారని గ్రామస్తులు చెప్పిన వివరాలపై కేసులు నమోదైన విషయం విదితమే. త్వరితగతిన కేసును ఛేదించాలని, కిడ్నాప్‌లకు కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మర్రి కోరారు. అనంతరం పోలీస్‌స్టేషన్ బయట విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీపీకి తగిన బలం ఉందని, కానీ దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకొనేందుకు టీడీపీ వర్గీయులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సహాయసహకారాలతోనే ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని, ఇందుకు మంత్రి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నెలరోజుల పరిపాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు పెచ్చుపెరిగాయని, ప్రశాంతంగా ఉండే నియోజవర్గంలో చిచ్చుపెడుతున్నారన్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేట, నాదెండ్ల పార్టీ కన్వీనర్లు ఏవీఎం సుభానీ, కాట్రగడ్డ మస్తాన్‌రావు, మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ అబ్దుల్ రౌఫ్, షేక్ సైదావలి, న్యాయవాదులు తోట శ్రీనివాసరావు, విడదల హరనాథ్‌బాబు, పార్టీ నాయకులు బైరావెంకటకృష్ణ, చిరుమామిళ్ల కోటిరెడ్డి, బైరింగ్ మౌలాలి, సాతులూరి కోటి, గుంజి వీరాంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయాన్ని పండుగ చేస్తాం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడరూరల్ : గత పాలకులు వ్యవసాయమే దండుగ అన్నారని, కానీ తమ ప్రభుత్వం మాత్రం రైతన్నకు అండగా ఉండి వ్యవసాయాన్ని పండుగగా మారుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వరావు, పశుసంవర్ధకశాఖ డెరైక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి మండలంలోని నాగారం గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మా ట్లాడారు. రైతులు సాంప్రదాయ సాగుకు స్వస్తిపలికి శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకుంటూ అత్యధిక లాభాలు గడించాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా జూ లై, జనవరి మాసాల్లో రెండువిడతలుగా 8కోట్లతో నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. మరో నాలు గు కోట్లతో ఏప్రిల్మాసంలోనూ మూడోవిడత పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నా రు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నా మన్నా రు. అనంతరం గొర్రెలు, మేకల పెంపకందార్లు, పశుసంవర్థక శాఖ అధికారులు మంత్రి పోచారంను ఘనంగా సన్మానించారు. గొంగళి కప్పి గొర్రెను బహుమానంగా ఇచ్చారు. పశుసంవర్థక శాఖ జేడిఏ ఎల్లన్న పాల్గొన్నారు. రైతు గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి పోచారం రైతు గుండె శబ్ధం తెలిసిన వ్యక్తి, తెలంగాణ తొలి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వరావు అన్నారు. ఇటీవల అకాల వర్షాలు పడి ధాన్యం రాశులు ఎక్కడి కక్కడ నిలిచి పోయిన సందర్భంలో వాటిని రైస్ మిల్లులకు తరలించడంలో ఎమ్మెల్యేగా ఆయన పడిన తపనను తా ను స్వయంగా చూశానని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర వ్యవసాయ శా ఖ మంత్రిగా ఆయన తెలంగాణ ప్రజలకు చక్కటి సేవలు అందిస్తారని ఆకాక్షించారు.