దర్జాగా బతికేలా చేద్దాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతన్నలు దర్జాగా బతికేలా చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం లోని రైతులందరికీ త్వరలోనే భూసార పరీక్షా కార్డులను అందజేస్తామని చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రంలోని చండ్యాల తరహాలో తక్కువ స్థలంలో ఎక్కువ చేపల పెంపకం చేపట్టాలని సర్కారు నిర్ణయించిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయానికి రూ.8,611 కోట్లు కేటాయించినందున వ్యవసాయ, అనుబంధ రంగాల వారికి అనేక సబ్సిడీలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ, అనుబంధ రంగాల పై నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి పోచారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జేసీ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం.. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
జార్ఘండ్‌లోని చండ్యాల తరహాలో అతి తక్కువ విస్తీర్ణంలో వేల సంఖ్యలో చేప పిల్లలను పెంచేం దుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వీడియోను ప్రదర్శిం చారు. అనంతరం జెడ్పీటీసీలు, ఎంపీపీలను ఉద్ధేశించి ‘మీరు, మేం కలిసి గొర్లు, బర్లు, చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తే తెలంగాణ నుంచి వలసపోయినోళ్లంతా మళ్లీ సొంతూర్లకొచ్చి దర్జాగా బతుకుతారు’ అని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
రాష్ట్రంలోని ప్రతి సర్వే నెంబర్ భూమిలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు బడ్టెట్ లో రూ.20 కోట్లు కేటాయించాం. ఏ భూమి ఏ పంటకు అనుగుణంగా ఉందో తెలుసుకుంటే రైతుకు ఎంతో మేలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగా త్వరలో ప్రతి ఒక్క రైతుకూ భూసార పరీక్ష కార్డులను అందజేస్తాం.
స్త్రీనిధి కింద ఒక్కో డ్వాక్రా మహిళకు గరిష్టంగా రెండు గేదెలు కొనుగోలు చేసేందుకు వడ్డీ లేకుండా రూ.80వేల రుణం ఇప్పిస్తాం. గేదెల దాణాకు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీని అందిస్తాం. మహిళలకు ఇష్టమైన చోట గేదెలు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తాం.
నీటి ప్రాజెక్టులున్న చోట్ల నాలుగు మీటర్ల పొడవు, ఆరు మీటర్ల వెడల్పు పరిధిలో ఆరు వేల చేప పిల్లలను పెంచేందుకు తగిన రాయితీలిస్తాం. ముందుకొచ్చే వారికి వంద శాతం సబ్సిడీ ఇస్తాం. కరువు ప్రాంతాల్లో గొర్రెలు పెంపకాన్ని ప్రోత్సహిస్తాం. అందుకోసం రూ.50 కోట్లు కేటాయించాం.
సూక్ష్మ సేద్యం చేసే రైతులకు అవసరమైన పరికరాలను 80 శాతం రాయితీపై అందిస్తాం. ఎస్సీలకు ఉచితంగా, బీసీలకు 90 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తాం.
కోల్డ్‌స్టోరేజీలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వ్యక్తులకు అందుకయ్యే వ్యయంలో 75 శాతం నిధులను కేంద్రం అందిస్తోంది. ప్రభుత్వ శాఖలు ముందుకొస్తే 90 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.
తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇకపై తెలంగాణ రైతులే బయటి రాష్ట్రాలకు విత్తనాలను విక్రయించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం.