మంత్రి ప్రోద్బలంతోనే కిడ్నాప్!
చిలకలూరిపేట: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతోనే ఎంపీటీసీ సభ్యుల కిడ్నాప్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. బుధవారం ఆయన, పార్టీ నాయకులతో కలిసి రూరల్ సీఐ సంజీవ్‌కుమార్‌ను కలిశారు. మంగళవారం కిడ్నాప్ అయిన ఎంపీటీసీల కేసు దర్యాప్తు విషయంపై ప్రశ్నించారు.
మంగళవారం రాత్రి చిలకలూరిపేట మండలం యడవల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు గుంటుపల్లి శ్రీనివాసరావును కొంతమంది కిడ్నాప్ చేయటం, మురికిపూడి2 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ జమ్మలమడల కృష్ణను ఊరి నుంచి కొంతమంది బలవంతంగా తీసుకెళ్లారని గ్రామస్తులు చెప్పిన వివరాలపై కేసులు నమోదైన విషయం విదితమే.
త్వరితగతిన కేసును ఛేదించాలని, కిడ్నాప్‌లకు కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మర్రి కోరారు. అనంతరం పోలీస్‌స్టేషన్ బయట విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీపీకి తగిన బలం ఉందని, కానీ దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకొనేందుకు టీడీపీ వర్గీయులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సహాయసహకారాలతోనే ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని, ఇందుకు మంత్రి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
నెలరోజుల పరిపాలనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు పెచ్చుపెరిగాయని, ప్రశాంతంగా ఉండే నియోజవర్గంలో చిచ్చుపెడుతున్నారన్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేట, నాదెండ్ల పార్టీ కన్వీనర్లు ఏవీఎం సుభానీ, కాట్రగడ్డ మస్తాన్‌రావు, మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ అబ్దుల్ రౌఫ్, షేక్ సైదావలి, న్యాయవాదులు తోట శ్రీనివాసరావు, విడదల హరనాథ్‌బాబు, పార్టీ నాయకులు బైరావెంకటకృష్ణ, చిరుమామిళ్ల కోటిరెడ్డి, బైరింగ్ మౌలాలి, సాతులూరి కోటి, గుంజి వీరాంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.