కార్మికులకు టీడీపీ అండ: ప్రత్తిపాటి
కొరిటెపాడు(గుంటూరు): కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా టీఎన్‌టీయూసీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని విభాగాల్లోను టీ ఎన్‌టీయూసీ బలోపేతం చేయాలన్నారు.
పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. టీడీపీ జిల్లా కన్వీనర్ జీవీ.ఆంజనేయులు మాట్లాడుతూ కార్యికుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ప్రతి సంస్థలోని కార్మికులు పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమను క్రమబద్దీకరించాలని కోరుతూ మంత్రి పుల్లారావుకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, గంజి చిరంజీవి, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నారా జోషి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు, నాయకులు మన్నవ సత్యనారాయణ, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, భానుమూర్తి, మేకతోటి ప్రకాశరావు, కనకరాజు, టి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.