సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం తెలుగుదేశం పార్టీ నేతలకు కల్పతరువుగా మారింది.2014లో అధికారంలోకి రాగానే పథకం ఆరంభం నుంచిఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసిన వారిని తొలగించి వారి స్థానంలోతమ అనుచరులను టీడీపీ నేతలు నియమించుకున్నారు.ఫలితంగా అప్పటివరకు ఏటా కూలీల పనులకు రూ.5 లక్షల మేర చెల్లించిన గ్రామాల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రూ.25లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకంలో ఎక్కువమంది నిరుపేద కూలీలకు పని కల్పించిన సంవత్సరాలలో 2012–13 ప్రధానమైంది. ఆ ఏడాదిలో గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామంలో పథకం ద్వారా కూలీలకు రూ.5.75 లక్షల మేర ఉపాధి కల్పించారు.
అంతకుముందు ఆరేళ్ల పాటు ఆ గ్రామంలో కూలీల పని విలువ కేవలం రూ.4.20 లక్షలు మాత్రమే. కానీ, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ గ్రామంలో ఫీల్డు అసిస్టెంట్‌ను మంత్రి మార్చేసి పార్టీలో కీలకంగా పనిచేసే వ్యక్తిని నియమించేశారు. అంతే.. ఆయన తొలి ఏడాదిలో రూ.12.91 లక్షలు, రెండో ఏడాది రూ.19.94 లక్షలు, మొన్న మార్చి నెలాఖరుతో ముగిసిన మూడో ఏడాది రూ.29.08 లక్షల మేర కూలీలు పనిచేశారని బిల్లులు డ్రా చేశారు. అలాగే, 2012–13 సంవత్సరంలో ఆ గ్రామంలోకూలీల సంఖ్య 678 మందే.
ఇప్పటికీ అక్కడ ఆ సంఖ్యలో మార్పులేదు. కానీ, ఒక్కో కుటుంబానికి ఇచ్చే కూలీ కార్డుల సంఖ్య మాత్రం 442 నుంచి 648కి అమాంతంగా పెరిగింది. ఈ పెరుగుదలలో మతలబు ఏంటని సదరు గ్రామంలో ‘సాక్షి’ విచారిస్తే విస్తుగొలిపే నిజాలు తెలిశాయి. అధికార పార్టీకి చెందిన ఈ ఫీల్డు అసిస్టెంట్ గ్రామంలో తనకు కావాల్సిన వారు పనిచేసినట్లు బిల్లులు సృష్టించి వారి పేరున బ్యాంకులో డబ్బులు పడిన తర్వాత వారితో డబ్బులు డ్రా చేయించి, వాళ్లకు కొంత ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని ఆయన జేబులో వేసుకుంటున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా ఏడాదికి ఆ ఒక్క గ్రామంలోనే ఆ ఒక్క ఫీల్డు అసిస్టెంటే రూ.10 లక్షల దాకా జేబులో వేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ దొంగ మస్తర్లతో ఐదేళ్లుగా టీడీపీ నేతలు సాగించిన స్వాహా పర్వం.
కరువు ప్రాంతాలకు అరకొర.. డెల్టాకు దండిగా..
ఈ పథకం నిధులను కూలీల పనుల కల్పనకు కాకుండా కాంట్రాక్టర్ల పనులకు మళ్లిస్తున్నారు. అంతేకాక.. వలసలు ఎక్కువగా ఉండే అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో ఇటీవల ఈ పథకం ద్వారా కూలీలకు పనుల కల్పన పెరగడంలేదుగానీ.. రెండు మూడు పంటలు పండే డెల్టా ప్రాంతాలైన పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు వంటి జిల్లాల్లో ఈ పథకం ద్వారా పనుల కల్పన గత మూడేళ్లలో బాగా పెరిగింది. అలాగే..
►రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టిన మొత్తాన్ని 2012–13 ఏడాదితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం మూడు రెట్లు దాకా పెరిగింది. కానీ, విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కూలీలకు పనుల కల్పన మాత్రం బాగా తగ్గిపోయింది.
►2012–13లో రాష్ట్రంలో ఈ పథకం కింద రూ.3,140 కోట్లు ఖర్చు పెట్టగా.. 2018–19 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి అది రూ.9,212 కోట్లకు పెరిగిపోయింది.
►మరోవైపు.. అదే ఏడాది విజయనగరం జిల్లాలో కూలీలకు రూ.3.09 కోట్ల మేర పని దినాలు కల్పిస్తే, 2018–19 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2.61 కోట్ల పని దినాలను మాత్రమే కల్పించారు.
►శ్రీకాకుళం జిల్లాలోనూ రూ.70 లక్షల పని దినాల మేర పేదలకు ఉపాధి తగ్గిపోయింది.
►పథకం ఖర్చు మూడింతలు పెరిగిందేగానీ అనంతపురం వంటి కరువు జిల్లాలో కూలీలకు పనుల కల్పన మాత్రం పెరగలేదు.
►పశ్చిమ గోదావరి జిల్లాలో 2012–13లో రూ.69 లక్షల మేర కూలీలకు ఉపాధి కల్పిస్తే, అది ఇప్పుడు రెట్టింపు కన్నా పెరిగి ఏడాదికి రూ.1.45 కోట్లకు పెరిగింది.
దీంతో గ్రామాల్లో టీడీపీ నాయకులు ఈ పథకాన్ని పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రమంతటా అప్పటివరకు ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మార్చేసి, వారి స్థానంలో తమ పార్టీ కార్యకర్తలను ప్రభుత్వ పెద్దలు నియమించడంతో ఈ పథకం తమ్ముళ్లకు ‘ఉపాధి హామీ’గా మారిపోయింది.
ఎస్సీ, ఎస్టీలకు తగ్గిన ‘ఉపాధి’
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి హామీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం దూరం చేసింది. బీసీలకు సైతం పని కల్పించడం తగ్గించి.. అగ్రవర్ణాలలోని తమకు కావాల్సిన వారికి ప్రాధాన్యత ఇస్తోంది. ఫలితంగా గ్రామాల్లో నిరుపేద కూలీలు ఏటా రూ.170 కోట్లు నుంచి రూ.200 కోట్లు వరకు నష్టపోయినట్లు ఓ అంచనా. ఉదాహరణకు.. 2012–13 సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి ఖర్చు పెట్టిన నిధులలో 22.77 శాతం నిధులను నాటి ప్రభుత్వం ఎస్సీలకు ఖర్చుపెట్టగా.. 2014 నుంచి వరుసగా ఈ శాతం 22.51, 22.42, 22.03, 22.00, 21.48 శాతానికి పడిపోతూ వచ్చింది.
మొత్తంగా ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు 1.29 శాతం నిధులు తగ్గిపోయాయి. అంటే.. ఏటా రూ.70 కోట్లు మేర ఎస్సీ కూలీలు ఉపాధిని కోల్పోయారు. అలాగే, ఎస్టీ వర్గాల పరిస్థితి కూడా ఇంతే. వీరికి 2012–13లో 11.69 శాతం నిధులు ఈ పథకంలో ఖర్చుపెట్టగా.. గత ఐదేళ్లుగా ఈ మొత్తం తగ్గిపోతూ ఈ ఏడాది మార్చి నాటికి 10.19 శాతానికి పడిపోయింది. అంటే ఎస్టీలు కూడా ఏటా రూ.74 కోట్లు చొప్పున నష్టపోయారన్న మాట. అలాగే, బీసీలకు కూడా ఏటా రూ.26 కోట్ల మేర ఉపాధి తగ్గిపోయింది.
పని అడిగే వారికి అరకొర ఉపాధి
కాగా, ఉపాధి హామీ పథకం చట్టం నిబంధనలు ప్రకారం పనిచేయడానికి ముందుకొచ్చే కూలీలకు ఏడాదికి ఒక్కో కుటుంబానికి వంద రోజుల పాటు పని కల్పించాల్సి ఉంటుంది. అయితే, గత ఐదేళ్లలో కుటుంబానికి సరాసరి కల్పించే పనిదినాల సంఖ్య కూడా తగ్గిపోయింది. 2011–12, 2012–13 సంవత్సరాల్లో సరాసరి కుటుంబానికి 65 రోజుల పని కల్పించగా, ఈ మొత్తం ఇప్పుడు 58 రోజులకు పడిపోయింది.
గత ఐదేళ్లలో ఈ పథకానికి కేంద్ర సాయం..
ఏడాది కేంద్రం ఇచ్చిన నిధులు (కోట్లలో)
2015–16 3,073.80
2016–17 3,776.37
2017–18 5,127.63
2018–19 6,684.53
2019–20 1,510.89 (కేవలం 28 రోజులకే.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు)
అంకెల్లో ఉపాధి హామీ పథకం..
►పథకంలో నమోదు చేసుకున్న కుటుంబాలు 88,68,329
►జాబ్‌కార్డులో నమోదై పని కోరుతూ సంఘాలుగా ఏర్పడ్డ కూలీల సంఖ్య 91,63,273
►2018–19 ఆర్థిక ఏడాదిలో పని కల్పించిన కుటుంబాలు 42,35,321
►వంద రోజులపాటు పని పొందిన కుటుంబాలు 8,56,727
Comments
Please login to add a commentAdd a comment