- సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెకు వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ మద్ధతు
- వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.గౌతంరెడ్డి వెల్లడి
విజయవాడ (గాంధీనగర్)
కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభించడంలో కేంద్రం కంటే చంద్రబాబు ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూనూరు గౌతంరెడ్డి చెప్పారు. గత ఏడాది మార్చిలో ఐదు ప్రధాన కార్మిక చట్టాలను ఏకపక్షంగా సవరిస్తూ శాసనసభలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదింపజేశారన్నారు. దీంతో గతంలో ఉన్న అనేక హక్కులను కార్మికులు కోల్పోయారని ఆయన మండిపడ్డారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి సంపద చేకూర్చే కార్మికులు, రైతులు ఇలా అన్ని వర్గాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ దాడిని కొనసాగిస్తున్నాయన్నారు. సంస్కరణల పేరుతో మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ కుదించి కార్మికుల హక్కులను అణచివేస్తున్నాయన్నారు. భవననిర్మాణ కార్మికుల కోసం వసూలు చేసిన సెస్సును తమ రాజకీయ ప్రచారానికి విచ్చలవిడిగా వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కొత్తగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కార్మిక చట్టాలను అమలుచేయకుండా తప్పించుకునే అవకాశం యజమానులకు ప్రభుత్వం కల్పించిందన్నారు. బాబువస్తే జాబువస్తుందని ఆశించిన యువతకుకు చంద్రబాబు పాలన నిరాశ మిగిల్చిందన్నారు. ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేయకపోగా వేలాది ఉద్యోగులను తొలగించిందన్నారు. ధర్నాల్లో పాల్గొంటే ఉద్యోగాల నుంచి తొలగించే విధంగా స్కీంవర్కర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అదేశాలు ఇవ్వడం ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శమన్నారు. గత సెప్టెంబర్ 2న 15 కోట్ల మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపితే మోదీ సర్కార్‌లో చలనం లేదన్నారు. 12 కోర్కెలతో కూడిన వినతి పత్రం సమర్పిస్తే సంప్రదింపులు జరిగి ఒప్పందానికి వస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నమ్మబలికిందన్నారు. ఆ తర్వాత ఒక్కరోజుకూడా కార్మిక సంఘాలతో చర్చలు జరపలేదన్నారు. సెప్టెంబర్ 2న మరోసారి దేశవ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెకు వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. ఈ దఫా 50 కోట్లమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తారన్నారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ట్రేడ్‌యూనియన్ నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేకి టీడీపీ సర్కార్
Published Tue, Aug 30 2016 7:52 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement