మండలంలోని పురుషోత్తపురం పంచాయతీ పరిధి బురదపాడులో శుక్రవారం రాత్రి జరిగిన ఓ వివాహ ఊరేగింపు కార్యక్రమంలో టీడీపీ-వైఎస్సార్ సీపీ కార్యకర్తల
బురదపాడు(కంచిలి):మండలంలోని పురుషోత్తపురం పంచాయతీ పరిధి బురదపాడులో శుక్రవారం రాత్రి జరిగిన ఓ వివాహ ఊరేగింపు కార్యక్రమంలో టీడీపీ-వైఎస్సార్ సీపీ కార్యకర్తల మధ్య జరిగిన కొట్లాటలో ఐదుగురు గాయపడ్డారు. ఈ వివాదంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొ న్నాయి. ఊరేగింపు సందర్భంగా డ్యాన్సులు వేసే విషయం లో వివాదం చోటుచేసుకోగా, వాటిలో పాతకక్షల నేపథ్యంలో ఇరువర్గాలవారు కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారని ఎస్‌ఐ వెంకట సురేష్ శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఇందులో వైఎస్సార్ సీపీకి చెందిన ఒకరు, టీడీపీకి చెందిన నలుగురు గాయాలపాలైనట్లు పేర్కొన్నారు.
గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు గేదెల భైరాగి ఇచ్చిన ఫిర్యాదులో తనను టీడీపీకి చెందిన పైల మన్మథరావు, మాధవరావు, జగన్నాయకులు, వెంకటరావు, రాము డు అనే వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నాడు. వ్యతిరేకవర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు పైల మన్మథరావు తనపై వైఎస్సార్‌సీపీకి చెందిన పైల మోహనరావు, గేదెల తులసయ్య, గేదేల ధర్మరాజు, గేదెల అపూర్వ చక్రవర్తి, గేదెల భైరాగి, తిప్పన చిన్నయ్య, తిప్పన నారాయణ, పైల ధర్మరాజులపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. ఈ వివాదం నేపథ్యంలో గ్రామంలో పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం తహశీల్దారు టి.కళ్యాణచక్రవార్తి, ఎస్‌ఐ వెంకట సురేష్ గ్రామానికి వెళ్లి విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.
పోలీసుల ఏకపక్ష వైఖరిపై వైఎస్సార్ సీపీ మండిపాటు
బురదపాడు కొట్లాట విషయంలో పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నర్తు రామారావు, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పలికల భాస్కరరావు తదితరులు శనివారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. కొట్లాటకు దారితీసిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించకుండా అధికార పార్టీ ఒత్తిడి మేరకు బాధితులపైనా, గొడవను సద్దుమణిగించటానికి వచ్చిన వారిపైనా పోలీసులు కేసు నమోదు చేయటం సరికాదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో పార్టీ నేతలు ఇప్పిలి కృష్ణారావు, వజ్జ మృత్యుంజయరావు, దుర్గాసి ధర్మారావు, ఎంపీటీసీ సభ్యులు బుడ్డెపు విశ్వనాథం, హరిబంధు జెన్ని, కొణపల సురేష్, గుమ్మిడి రామదాసు, తిప్పన కూర్మయ్య తదితరులు పాల్గొన్నారు.