హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయం
ఇంటికో ఉద్యోగం, ప్రతి ఏటా డీఎస్సీ, నిరుద్యోగ భృతి వంటి దొంగ హామీలతో అధికారం చేపట్టిన టీడీపీ కొత్త ఉద్యోగాలు కల్పించక పోగా వరుసగా ఉన్న ఉద్యోగాలు సైతం ఊడబెరుకుతోంది. కొలువుల్లో కూర్చొబెట్టినట్టే బెట్టి ఆ వెంటనే ఇంటికి పంపిస్తోంది. తాజాగా గృహ నిర్మాణ శాఖలో మూడు నెలల క్రితం నియమించిన వర్క్ ఇన్‌స్పెక్టర్లను (గృహమిత్రలను) తొలి జీతం కూడా ఇవ్వకుండానే ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది.
నెల్లూరు(అర్బన్): జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలోని 73 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను (గృహమిత్రలను) తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా హౌసింగ్ అధికారులు వారిని తొలగిస్తూ కలెక్టర్‌కు ఫైల్ పంపారు. కలెక్టర్ సంతకంతో ఒకటి.. రెండు రోజుల్లోనే వర్క్ ఇన్‌స్పెక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగించనున్నారు. కొత్తగా విధుల్లోకి చేరి సరిగ్గా మూడు నెలలు కూడా కాలేదు.. అంతలోనే తొలగించడంతోఆ చిరుద్యోగులు వీధిన పడ్డారు. తమకు ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి తొలగించడంపై వర్క్ ఇన్‌స్పెక్టర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలో హౌసింగ్ పథకం కింద ఇప్పుడు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సుమారు 50 వేల ఇళ్లు ఎన్టీఆర్ అర్బన్ (హెచ్‌ఎఫ్‌ఏ), గ్రామీణ (పీఎంజీ), రూరల్ పథకాల పేరుతో మంజూరయ్యాయి.
వీటి పర్యవేక్షణకు, పేదలకు సకాలంలో ఇళ్లు నిర్మించేందుకు తప్పని సరిగా సిబ్బంది అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హౌసింగ్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి 5 నెలల క్రితమే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మూడు నెలల క్రితం 160 మందికి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారు. బీటెక్, డిప్లొమో, డిగ్రీ కంప్యూటర్స్ తదితర అర్హతలతో వీరంతా రిజర్వేషన్, రోస్టర్ పద్ధతిలో నియమితులయ్యారు. వీరు కాకుండా రెగ్యులర్‌గా మరో 28 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు పని చేస్తున్నారు. మొత్తం 188 మంది హౌసింగ్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో బిటెక్, డిప్లొమో తదితర టెక్నికల్ కోర్సులు చదివిన వారిని ఉద్యోగాల్లో ఉంచుకుని అదనపు భారం పేరుతో మిగతా 73 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నారు.
మూడు నెలలుగా జీతాల్లేవు
వీరు ఉద్యోగాల్లో చేరిన నాటి నుంచే అంటే మూడు నెలలుగా వీరికి ప్రభుత్వం ఒక్క నయా పైసా జీతం ఇవ్వలేదు. చార్జీలు, భోజనానికి అప్పులు చేసి పని చేస్తున్నారు. జీతాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఉన్నట్టుండి పిడుగు లాంటి విషయం తెలియడంతో దిక్కు తోచడం లేదు.
జీతంలోనూ మోసమే!
ప్రభుత్వం వీరిని విధుల్లోకి తీసుకునేటప్పుడు నెలకు రూ.15 వేలు జీతం ఇస్తామని ప్రకటించింది. తీరా విధుల్లోకి చేరాక ఇల్లు నిర్మాణ దశలను బట్టి డబ్బులిస్తామంది. అంటే ఒక ఇంటికి బేస్‌మెంట్ వేస్తే రూ.150, రూఫ్ లెవల్‌కు వస్తే మరో రూ.150, శ్లాబు వేస్తే ఇంకో రూ.150 వంతున చెల్లిస్తామంది. 20 ఇళ్లు శ్లాబు లెవల్లో పూర్తి చేయిస్తే మరో రూ.300 ఇస్తామని చెప్పింది. తీరా ఇప్పుడు అటు జీతం ఇవ్వక.. ఇటు చెప్పిన దశల ప్రకారం ప్రభుత్వం డబ్బులివ్వక నిరుద్యోగుల ఉసురు పోసుకుంటుందని వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా చేతుల్లో ఏమి లేదు
హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర ఉన్నతాధికారులు మండలానికి ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లను మాత్రమే విధుల్లో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు సబ్ డివిజన్ డీఈ కార్యాలయాల్లో ఒకరు చొప్పున, గోడౌన్‌లో ఒకరు చొప్పున ఉంటే సరిపోతుందని చెప్పారు. అందువల్ల అదనంగా ఉన్న సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది. వారిని ఉద్యోగాల్లో కొనసాగించే విషయం తమ చేతుల్లో లేదు.
– ఎన్.రామచంద్రారెడ్డి,పీడీ, హౌసింగ్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment