సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగర టీడీపీలో ఎత్తుగడ రాజకీయాలకు పూర్తి స్థాయిలో తెరలేచాయి. నిత్యం మంత్రి నారాయణ వెంట ఉండే కీలక అనుచరగణమే ఆయన సీటుకు ఎసరు పెట్టాయి. అదే స్థానం కోరుతూ పలువురు నేతలు కీలక లాబీయింగ్‌కు తెరతీసి సరికొత్త సమీకరణాలు తెరపైకి తెచ్చి సీటు హామీ వచ్చిందని ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే మంత్రి నారాయణ చుట్టూ ఉన్న ప్రథమ శ్రేణి నేతలు అంతా టికెట్ కోసం ప్రయత్నిస్తూ గురువుకే సున్నం పెడుతున్నారు. వీరిలో ఒకరైతే మరో అడుగు ముందుకు వేసి సీటు తనకి వస్తే ఖర్చు మంత్రిగారే పెట్టుకుంటానని చెప్పారనే ప్రచారానికి తెరతీశారు. ఈ పరిణామాల క్రమంలో మంత్రి నారాయణ జిల్లాలో మరో నియోజకవర్గం సీటుపై దృష్టి సారించి అక్కడ రాజకీయ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఇప్పటికే నగర టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. నేతలు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత కార్యక్రమాలు మినహా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాల్లేవు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పలుమార్లు నేతలు అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పినా అది ఎవరూ పట్టించుకోని పరిస్థితి. దీంతో నగర టీడీపీలో గందరగోళం నెలకొంది. పాత, కొత్త నేతల వివాదాలు, గొడవలు, ఆదిపత్య పోరు నిత్య కృత్యంగా సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే అసెంబ్లీ టికెట్ ఫైట్‌కు అధికార పార్టీలో తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలలు సమయం ఉన్నా అధికార పార్టీలో మాత్రం టికెట్ హడావుడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా అయితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరు నగరం నుంచి తాను పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో ప్రకటించుకున్నారు. దీనికి అనుగుణంగా నగరంలో కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం వారంలో రెండు రోజుల పాటు నగరంలో పర్యటనలు నిర్వహించటం, అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.
మరోవైపు నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్లందరినీ తనవైపు మరల్చుకోవడానికి వీలుగా అందరికీ పనులు చేయించటం, ఆయా డివిజన్లకు నిధులు కేటాయించి నేరుగా తనతోనే మాట్లాడాలని ఆదేశాలు ఇచ్చి నగరంలో బలంగా వర్గం ఏర్పాటు చేసుకునే యత్నాలు సాగించారు. అయితే అవి కొంతమేరకే ఫలించాయి. ఈ క్రమంలో మంత్రి కోటరీలో కీలక వ్యక్తులుగా ఉన్న నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర టీడీపీ ఇన్‌చార్జి మంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి. టీడీపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధలు టికెట్ రేసులోకి వచ్చారు. అలాగే నుడా చైర్మన్, నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా సీటు కోసం తన లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎవరికీ వారు కార్యక్రమాలు నిర్వహించి హడావుడి చేస్తున్నారు. అయితే అంతిమంగా మాత్రం ఎవరు పార్టీ కార్యక్రమాలు నిర్వహించని పరిస్థితి. దీంతో నగరంలో ఆధిపత్యం విషయమై నేతల మధ్య పలుమార్లు అంతర్గత వివాదాలు రేగి మంత్రి వద్దే పంచాయితీలు జరిగాయి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 1983లో ఆనం రామనారాయణరెడ్డి, ఆ తర్వాత 1994లో తాళ్లపాక రమేష్‌రెడ్డి మాత్రమే అధికార పార్టీ నుంచి ఇక్కడ గెలుపొందారు. 1994లో రమేష్‌రెడ్డి గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. దీంతో స్వతహాగానే నగరంలో పార్టీకి పట్టు తక్కువ. ఈ క్రమంలో 2014 నుంచి భారీగా వలస వచ్చిన నేతలు కూడా ఎక్కువ అయ్యారు. నేతలు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అన్న రీతిలో నగరంలో పరిస్థితి ఉంది.
మైనార్టీ కోటాలో అజీజ్ హడావుడి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేయర్‌గా గెలుపొందిన అబ్దుల్ అజీజ్ పార్టీ ఫిరాయించారు. ఈయన నెల్లూరు టికెట్ తనకే దక్కుతుందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ హామీతోనే పార్టీ ఫిరాయించానని, మంత్రి నారాయణతో పాటు లోకేశ్, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని చెబుతుండటంతో పాటు రెండు నెలలుగా మైనార్టీ ఆత్మీయ సమావేశాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించి టికెట్ డిమాండ్‌ను బలపరుచుకునేలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి టికెట్ తనకే వస్తుందని బలంగా చెప్పుకుంటూ పనిచేస్తున్నారు. మరోవైపు నగర టీడీపీ ఇన్‌చార్జీ హోదాలో నగరంతో పాటు రాజధానిలోనూ మంత్రి సహకారంతో భారీగా కాంట్రాక్ట్ వర్కులు తీసుకుంటు మందస్తు సన్నాహాల్లో ఉన్నారు. ఇక తాళ్లపాక అనురాధ కూడా టికెట్ కోసం ఆశిస్తూ తనకి టికెట్ వస్తే పార్టీ, మంత్రి నారాయణ ఖర్చు పెడతరానే ప్రచారం చేసుకుంటున్నారు. ఇక నుడా చైర్మన్ కోటంరెడ్డి యథావిధిగా బాలయ్య కోటాలో టికెట్ వస్తుందనే ఆశలో ఉన్నారు. నగర నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలని మంత్రి రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో నగరంలో తలనొప్పులు పడటం కష్టమనే భావనతో కొత్త నియోజకవర్గంపై దృష్టి సారించారు. మొత్తం మీద నగరం టీడీపీలో కొనసాగుతున్న టికెట్ ఫైట్ మంత్రికే తలనొప్పిగా మారటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment