కన్నీటి పర్యంతమైన దొంతు శారద | Municipal Chair Person Alekya And Donthu Sarada Conflicts In TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో ‘మున్సిపల్‌’ ప్రకంపనలు

Published Thu, May 17 2018 11:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Municipal Chair Person Alekya And Donthu Sarada Conflicts In TDP - Sakshi

మంత్రి అమరనాథ్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడుతున్న దొంతుశారద

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  జిల్లాలో అధికార పార్టీలో మున్సిపల్‌ ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల మితిమీరిన జోక్యంతో మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా, స్వంత్రంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్లుగా ఉన్న మహిళలకు కనీస గౌరవంతో పాటు పదవి ద్వారా సంక్రమించిన హక్కులను కూడా కాలరాసేలా విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. పర్యవసనంగా మహిళా ప్రజాప్రతినిధుల్ని ఇంటికే పరిమితం అనే చందంగా అధికార పార్టీలో వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఈ పరిణమాల క్రమంలో వెంకటగిరి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దొంతు శారద బుధవారం కన్నీటి పర్యంతమవుతూ రాజీనామా కు సిద్ధపడ్డారు. చివరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డి ఫోన్‌చేసి బుజ్జగించటంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, కావలిలో అధికార పార్టీ మహిళలు మున్సిపల్‌ చైర్‌పర్సన్లుగా కొనసాగుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా పార్టీలో మహిళా నేతల పరిస్థితి దయనీయం. పట్టణాలకు ప్రథమ మహిళలే అయినా పార్టీలోనూ, పాలనలోనూ చివరి మహిళలుగా మిగులుతున్నారు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి. నారాయణ సొంత జిల్లాలోనే పట్టణాల ప్రథమ మహిళలకు కనీస ప్రాధాన్యం లేకపోవటంతో పార్టీలో పరిస్థితికి నిదర్శనం. గతంలో కావలిలో పార్టీ ఇన్‌చార్జి బీద మస్తాన్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అలేఖ్య మధ్య ఇదే తరహలో అధిపత్య పోరు సాగింది. ముందస్తు ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు పదవీ కాలం పూర్తి కాగానే అలేఖ్యను పదవి నుంచి తప్పుకోవాలని బీద ఒత్తిడి తేవటం, ఒప్పందంలోని అంశాలను మీరు ఏమీ పాటించకుండా ఇప్పుడు రాజీనామా చేయమని కోరటం సరికాదని ఆమె సామాజిక వర్గ మద్దతుతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

దీంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారటంతో ఆమెనే కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో గూడూరు మున్సిపాలిటీలోనూ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పొనకా దేవసేనమ్మ మధ్య కొంత కాలం ఆధిపత్య పోరు కొనసాగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే మున్సిపల్‌ పాలనలో మితిమీరిన జోక్యం చేసుకుని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రా«ధాన్యం తగ్గిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిణమాల క్రమంలో ముగ్గురు మున్సిపల్‌ చైర్‌పర్సన్లు మంత్రి నారాయణకు మొర పెట్టుకున్నా తమకు ఎమ్మెల్యేలే ముఖ్యమని మంత్రి సృష్టం చేశారు. దీంతో కొన్ని నెలలుగా మున్సిపల్‌ చైర్‌పర్సన్స్‌ వరెస్స్‌ ఎమ్మెల్యేలుగా వ్యవహారం సాగుతుంది. ఈ క్రమంలో మళ్లీ వెంకటగిరిలో ముసలం మొదలై తారా స్థాయికి చేరింది.

బీసీ మహిళ కావటం వల్లే వేధింపులు
గురువారం వెంకటగిరి పట్టణంలో జరిగే మినీ మహానాడు వంటి కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు, ఏర్పాట్లుపై తనకు ఎటువంటి సమాచారం లేకపోవడంపై ఆమె మనస్థాపం చెందారు. దీంతో అమె తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆమె ససేమిరా అనడంతో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అమరనాథ్‌రెడ్డి నేరుగా ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వెంకటగిరిలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాలుగేళ్లుగా వ్యవహరిస్తున్న తీరు భరించామని, ఇక తన వల్ల కావడం లేదంటూ ఆమె మంత్రితో ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి సంబంధించి ఏ ఒక్క నిర్ణయంలో తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పిన విధంగానే నడుచుకుంటున్నానని అయినా తనను అడుగు అడుగునా అవమానిస్తున్నారంటూ వాపోయారు. తన మాట వినాల్సిన అవసరం లేదని అధికారులు, సిబ్బందికి చెబుతుంటే ఎలా చైర్‌పర్సన్‌గా కొనసాగాలో అర్థం కావడం లేదని తెలిపారు. పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే అండతో ఆయన ముందే తనపై దూషణలకు దిగుతున్నా వారిని వారించకపోవడం వారిని పరోక్షంగా ప్రోత్సహించడం కాదా అంటూ మంత్రితో ఆమె ఫోన్‌లో కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన మంత్రి అమరనాథ్‌రెడ్డి తనే స్వయంగా ఎమ్మెల్యేతో మాట్లాడి సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement