సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళుతున్న టీడీపీ నాయకులు
నెల్లూరు,దుత్తలూరు: ప్రత్యేక హోదా సాధన కోసం అంటూ టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్ర టీడీపీలోని వర్గ విభేదాలను బట్టబయలు చేస్తోంది. సైకిల్ యాత్రలో భాగంగా బుధవారం మండల కేంద్రం దుత్తలూరు నుంచి నర్రవాడ పంచాయతీ మజరా గ్రామమైన గుదేవారిపాళెం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పంచాయతీలో తమకు తెలియకుండానే ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న వారిని విస్మరించి కొత్త వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఎదుట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాపోయారు. స్థానిక ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు తన గ్రూపును ఏర్పాటు చేసుకుని టీడీపీ కార్యకర్తలకు ద్రోహం చేస్తున్నారని, ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన సబ్సిడీ రుణాలను సైతం తమ ప్రమేయం లేకుండానే ఎంపీపీ తన ఇష్టానుసారం మంజూరు చేశారన్నారు.
అలాగే పంచాయతీలో నెలకొన్న నీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఏఎంసీ వైస్ చైర్మన్ పేలపూడి వెంకటరత్నం పలు సమస్యలను ఎమ్మెల్యేకి వివరిస్తుండగా ఎంపీపీ రవీంద్రబాబు జోక్యం చేసుకుని ఏఎంసీ వైస్ చైర్మన్‌ను ఉద్దేశించి ఏడాదికి ఒకసారి వచ్చేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనడంతో ఒక్కసారిగా వెంకటరత్నం వర్గీయులు ఎంపీపీపై మండిపడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాల వారిని సర్దుబాటు చేసి పంపించారు. ఈ సందర్భంగా పేలపూడి వెంకటరత్నం మాట్లాడుతూ ఎంపీపీ మండలంలో టీడీపీని భ్రష్టు పట్టించారని, గ్రామాల్లో వర్గాలను పెంచుతూ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీపీ పోకడ వల్ల రానున్న ఎన్నికల్లో టీడీపీకి భారీ నష్టం చేకూరే అవకాశం ఉందన్నారు. ఇకపై తమ పంచాయతీల్లో తిరగడాన్ని కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంటే వర్గ విభేదాలతో పార్టీని నష్టపరచవద్దని అన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీసుకుం టామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చీదర్ల మల్లికార్జున, సర్పంచ్ మేకపాటి మాలకొండ్రాయుడు, ఎంపీటీసీ పులివర్తి వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు కనసాని సుబ్బారెడ్డి, అన్నపురెడ్డి చినవెంగళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment