Bicycle trip
-
అభిమానికి హరీశ్‌రావు బాసట
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేటజోన్: కష్టాల్లో ఉన్న ఓ అభిమానికి మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు బాసటగా నిలిచారు. అధికారుల చుట్టూ తిరిగినా ఏ ప్రయోజనం లేకపోవడంతో తన సమస్యను విన్నవించుకునేందుకు వారం కింద సైకిల్ యాత్ర చేపట్టి శుక్రవారం నేరుగా హరీశ్ నివాసంలో ఆయనను కలిశాడు. ములుగు జిల్లాకు చెందిన 19 ఏళ్ల బిల్ల తరుణ్.. సైకిల్‌పై హైదరాబాద్‌లోని హరీశ్ నివాసానికి వచ్చి కలిశాడు. ‘నేను మీ అభిమానిని అన్న. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం మా అమ్మమ్మ చామంతుల దుర్గమ్మ. అమె భూమిని వెంకటాపురానికి చెందిన కొంతమంది కబ్జా చేశారు. ఎన్నోసార్లు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. మిమ్మల్ని కలవాలని గత వారం క్రితం వెంకటాపురం నుంచి సైకిల్ యాత్రతో బయలుదేరి వచ్చాను. మీరే నన్ను ఆదుకోవాలి..’అని విన్నవించాడు. దీనిపై హరీశ్ వెంటనే స్పందించారు. అక్కడి సీఐ, ఎమ్మార్వోలతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పారు. తరుణ్ సమస్య పరిష్కారానికి హరీశ్ భరోసానిచ్చారు. రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. హరీశ్ ఆదేశాలతో ములుగు ఆర్డీవో వెంటనే స్పందించారు. తరుణ్ ఫిర్యాదు అంశంపై పత్రికా ప్రకటన జారీ చేశారు. విచారణ జరిపి తాజా పరిస్థితిని వివరించారు. దుర్గమ్మ భూమి విషయంపై విచారణ జరుగుతోందని తెలిపారు. -
పిల్లల్లో చైతన్యానికి ‘ఫిట్నెస్ ఫర్ లైఫ్’
అక్కయ్యపాలెం(విశాఖఉత్తర): పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రజల్ని చైతన్యం చేయడానికి రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం( ఏపీ ఎస్పీఎఫ్) చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం విశాఖ నగరానికి చేరుకుంది. అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంకు చేరుకున్న సైకిల్ యాత్రికులకు పోలీస్ అధికారులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ ‘ఫిట్నెస్ ఫర్ లైఫ్’ అనే అంశంపై నేటి తరం పిల్లల్లో చైతన్యం తేవడానికి రాష్ట్రంలోని 13 జిల్లాలను కలుపుతూ గత నెల 20న అనంతపురంలో సైకిల్ యాత్ర ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు 1300 కిలోమీటర్లు ప్రయాణించామని, శనివారం శ్రీకాకుళంలో యాత్ర ముగుస్తుందన్నారు. లైఫ్ స్పేన్ పెరిగినా, హెల్తీ లైఫ్ స్పేన్ మాత్రం పెరగలేదన్నారు. చాలా మంది సుగర్, బీపీ, థైరాయిడ్, ఒబేసిటీతో బాధపడుతున్నారు. వీటివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ గ్రాఫ్ పడిపోతోందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని, మెడిసన్స్‌కు దూరంగా, మన సంపదను మనం ఎంజాయ్ చేసేలా ఆరోగ్యవంతంగా ఉండాలన్న సంకల్పంతో సైకిల్ యాత్ర చేపట్టామన్నారు. రోజుకు 100 కిలోమీటర్లు తొక్కడం పెద్ద కష్టమేమీ కాదు, అడుగడుగునా ప్రజల సహకారంతో చాలా ఆనందంగా యాత్రను ఎంజాయ్ చేశామని తెలిపారు. మేము హాల్ట్ చేసిన ప్రతి చోటా స్కూల్ పిల్లలు కూడా బాగా స్పందిస్తున్నారని చెప్పారు. సంప్రదాయ పండుగ స్థానంలో ఫిట్‌నెట్ ఫెస్టివల్స్ రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఐజీ రామిరెడ్డి, ఏడీపీసీ కె.ప్రభాకర్, డీపీఆర్వో వి.మణిరామ్, నాల్కో జనరల్ మేనేజర్ పి.కె.పాత్రా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.ఎస్.సింగ్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 40వేల కిలోమీటర్లు ప్రయాణించా.. నేను ఇంజినీరింగ్ పూర్తి చేసి , ప్రైవేటు కళాశాలలో పీటి మాస్టర్‌గా పనిచేస్తున్నాను. అనంతపురం నుంచి సైకిల్ యాత్రలో పాల్గొన్నాను. హెల్తీ ఇండియా కాన్సెప్ట్‌తో కర్నూలు నుంచి భూటాన్,బంగ్లాదేశ్, థాయ్‌ల్యాండ్Š , శ్రీలంక, కన్యాకుమారి, ఎవరెస్ట్ బేస్ క్యాంప్, నేపాల్ దేశాలకు, కర్నూలు నుంచి ఇండియా బోర్డర్ అంతా సైకిల్‌పై తిరిగాను. ఇప్పటివరకు సుమారు 40వేల కిలోమీటర్లు సైకిల్‌పై యాత్రలు చేశాను. ఇపుడు హెల్తీ వరల్డ్ కాన్సెప్ట్‌తో 54 దేశాలు ఏడాదిన్నర కాలంలో సైకిల్‌పై చుట్టి రావాలని సంకల్పించాను. ప్రపంచ సైకిల్ యాత్రకు స్పాన్సర్షిప్ దొరుకుతుందన్న ఆశతో ఎస్పీఎఫ్ సైకిల్ యాత్రలో పాల్గొన్నాను. చాలా ఆనందంగా ఉంది.– శ్రీకాంత్ గోశల, కర్నూలు ఎన్నో అనుభూతులు అనంతపురం నుంచి సైకిల్ యాత్రలో పాల్గొన్నాను. 14 రోజుల్లో1300 కిలో మీటర్లు యాత్ర పూర్తి చేశాం. అడగడుగునా యాత్రను స్వాదిస్తున్నాం. ఒకే రాష్ట్రం అయినప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఆచారాలు, సంస్కృతి, వాతావరణం, ఆదరణ ఈ యాత్ర ద్వారా చూడగలిగాం. రాయలసీమలో ఒక వాతావరణం, నెల్లూరులో మరొక విధంగా, తూర్పు గోదావరిలో వేరే వాతావరణం చూశాం. ధవళేశ్వరం ఆనకట్ట హరిద్వార్‌లో ఉన్న అనుభూతి కల్గింది. విశాఖలో వీటన్నింటికి భిన్నమైన అనుభూతి పొందాం. ప్రతి చోట పిల్లల నుంచి మంచి స్పందన లభించింది.– ఎన్. హరిశ్చంద్ర, హెచ్‌సీ, ఎస్పీఎఫ్ ,అనంతపురం -
సైకిల్ యాత్రలో భగ్గుమన్న విభేదాలు
నెల్లూరు,దుత్తలూరు: ప్రత్యేక హోదా సాధన కోసం అంటూ టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్ర టీడీపీలోని వర్గ విభేదాలను బట్టబయలు చేస్తోంది. సైకిల్ యాత్రలో భాగంగా బుధవారం మండల కేంద్రం దుత్తలూరు నుంచి నర్రవాడ పంచాయతీ మజరా గ్రామమైన గుదేవారిపాళెం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పంచాయతీలో తమకు తెలియకుండానే ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న వారిని విస్మరించి కొత్త వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఎదుట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాపోయారు. స్థానిక ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు తన గ్రూపును ఏర్పాటు చేసుకుని టీడీపీ కార్యకర్తలకు ద్రోహం చేస్తున్నారని, ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన సబ్సిడీ రుణాలను సైతం తమ ప్రమేయం లేకుండానే ఎంపీపీ తన ఇష్టానుసారం మంజూరు చేశారన్నారు. అలాగే పంచాయతీలో నెలకొన్న నీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఏఎంసీ వైస్ చైర్మన్ పేలపూడి వెంకటరత్నం పలు సమస్యలను ఎమ్మెల్యేకి వివరిస్తుండగా ఎంపీపీ రవీంద్రబాబు జోక్యం చేసుకుని ఏఎంసీ వైస్ చైర్మన్‌ను ఉద్దేశించి ఏడాదికి ఒకసారి వచ్చేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనడంతో ఒక్కసారిగా వెంకటరత్నం వర్గీయులు ఎంపీపీపై మండిపడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాల వారిని సర్దుబాటు చేసి పంపించారు. ఈ సందర్భంగా పేలపూడి వెంకటరత్నం మాట్లాడుతూ ఎంపీపీ మండలంలో టీడీపీని భ్రష్టు పట్టించారని, గ్రామాల్లో వర్గాలను పెంచుతూ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీపీ పోకడ వల్ల రానున్న ఎన్నికల్లో టీడీపీకి భారీ నష్టం చేకూరే అవకాశం ఉందన్నారు. ఇకపై తమ పంచాయతీల్లో తిరగడాన్ని కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంటే వర్గ విభేదాలతో పార్టీని నష్టపరచవద్దని అన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీసుకుం టామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చీదర్ల మల్లికార్జున, సర్పంచ్ మేకపాటి మాలకొండ్రాయుడు, ఎంపీటీసీ పులివర్తి వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు కనసాని సుబ్బారెడ్డి, అన్నపురెడ్డి చినవెంగళరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతా అధినేత తీరే..!
తెలుగు తమ్ముళ్ల సైకిల్ యాత్ర తీరు హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని గురించి ఊరూవాడా ప్రచారం చేయాలని కొందరు తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి ‘ఏపీ కేపిటల్ రైడ్’ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించడం ద్వారా పార్టీ అధినేత మెప్పు పొందాలనుకున్నారు. మోకాళ్లు, మోచేతులకు రక్షణ కవచాలు (గార్డ్స్), కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లతో సిద్ధమయ్యారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, అరికెపూడి గాంధీ, మాగంటి బాబు జెండా ఊపి సైకిల్ యాత్ర ప్రారంభించారు. అంతే రాజధాని దిశగా తమ్ముళ్లు రయ్.. మంటూ దూసుకుపోయారు. తమ్ముళ్ల స్పీడ్ చూసి నేతలు మహా ముచ్చటపడిపోయారు. కానీ ర్యాలీ నగర శివారు చేరుకున్నాక అసలు కథ మొదలయ్యింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న లారీలోకి సైకిళ్లు ఎక్కించిన తెలుగు తమ్ముళ్లు తాము ఆ పక్కనే ఉన్న ఏసీ బస్సు ఎక్కి కూర్చున్నారు. ముందు బస్సు.. దాని వెనుకే లారీ. ఏదైనా ఊరు సమీపించగానే బస్సులోంచి దిగి సైకిలెక్కడం.. ఊరు దాటగానే సైకిళ్లు లారీలో వేసి ఏసీ బస్సులో సేద తీరడం.. ఇదీ తమ్ముళ్ల సైకిల్ ర్యాలీ కొనసాగిన తీరు. ఈ డ్రామా గమనించిన కొందరు ముక్కున వేలేసుకోగా.. మరికొందరు డ్రామాలో తమ్ముళ్లు తమ నేతనే మించిపోయారంటూ వ్యాఖ్యానించారు. -
సైకిలుపై చుట్టేశాడు...
తిక్క లెక్క మన నగరాల్లో సైకిలుపై ఇంటి నుంచి ఆఫీసుకు రాకపోకలు సాగించడమే అరుదు. అలాంటిది గ్లెన్ బర్మీస్టర్ అనే బ్రిటిష్ యువకుడు సైకిలుపై ఏకంగా పదకొండు దేశాలు చుట్టేశాడు. అది కూడా కేవలం వారం రోజుల వ్యవధిలోనే. ఈ సైకిలు యాత్రతో ఇతగాడు సునాయాసంగా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టాడు. కచ్చితంగా చెప్పాలంటే, ఈ యాత్ర పూర్తి చేసేందుకు ఇతగాడికి ఆరు రోజుల పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు పట్టింది. బర్మీస్టర్ ఈ యాత్రలో జెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, స్లోవేకియా, హంగెరీ, స్లోవేనియా, క్రొయేషియా, రుమేనియా, సెర్బియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా, మాంటెనిగ్రో, అల్బేనియా దేశాలలో పర్యటించాడు. -
‘స్వచ్ఛ గోదావరి’ కోసం సైకిల్‌యాత్ర
భద్రాద్రి చేరిన హైదరాబాద్ యువకుడు భద్రాచలం: గోదావరి తీరాల పరిశుభ్రత లక్ష్యంగా హైదరాబాద్ బొల్లారం మేఘన రెసిడెన్సీకి చెందిన ఎ.శివశంకర్ అనే వ్యక్తి సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆయన భద్రాచలం చేరుకున్నారు. స్నానఘట్టాల రేవులో ఉన్న భక్తులకు నీటి కాలుష్య నివారణ గురించి అవగాహన కల్పించారు. భక్తుల వద్దకు వెళ్లి గోదావరి నదిలో వ్యర్థ పదార్థాలు పడేయవద్దని కోరారు. అలా చేస్తే భవిష్యత్‌లో గుక్కెడు నీళ్లు కూడా తాగేందుకు ఉపయోగపడవని తెలిపారు. గోదావరి తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలతో కూడిన చార్టు, స్వచ్ఛ గోదావరి- సంరక్షణ యాత్ర అంటూ రాసిన లోగోలతో ఉన్న చార్టులను అందరికీ కనిపించేలా సైకిల్‌కి తగిలించి తిరిగారు. గ్రీన్ భద్రాద్రి నిర్వాహకులు భూపతిరావు ఆయనకు ఆతిథ్యమిచ్చారు. గోదావరి తీరాల పరిశుభ్రతే లక్ష్యం.. ఈ నెల 12న హైదరాబాద్‌లో సైకిల్ యాత్ర చేపట్టా. ఇప్పటి వరకు 750 కిలోమీటర్లు తిరిగా. గోదావరి తీరాన ఉన్న బాసర, ధర్మపురి, కాళేశ్వరం మీదగా భద్రాచలం వచ్చా. రోజుకు 80 కిలోమీటర్ మేర ప్రయాణిస్తూ మార్గమధ్యంలో స్వచ్ఛంద సంస్థలను కలుస్తూ, పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కలిస్తున్నా. 1818 కిలోమీటర్ మేర యాత్రను సాగించి గోదావరి నది చివరన ఉన్న అంతర్వేదితో ముగిస్తా. - ఎ.శివశంకర్ -
సైక్లింగ్
ఖరీదైన బైకుల మీద దూసుకెళ్లే యూత్ ఉన్న ఈ కాలంలో ఓ కుర్రాడు సైకిల్ సవారీకే ‘సై’ కొట్డాడు.. పేదరికంలో పుట్టినా పట్టుదలతో తన లక్ష్యం వైపు దూసుకెళ్తున్నాడు. ఎత్తైన కొండను సైకిల్‌తో ఎక్కేసి జాతి పతాకాన్ని ఎగరేస్తున్నాడు... మరిన్ని రికార్డులు తొక్కేసేందుకు సిద్ధమవుతున్న నాగరాజు తన సైకిల్ ప్రస్థానాన్ని ‘సిటీ ప్లస్’తో పంచుకున్నాడు... సైకిల్‌పై నా వ్యామోహం ఇప్పటిదికాదు.. చిన్నప్పుడే దానితో ప్రేమలో పడిపోయా. ఎవరిదైనా సైకిల్ దొరికితే ఊరంతా చుట్టేయాల్సిందే. నాన్నకు ఈ విషయం తెలిసి ఓ సెకండ్‌హ్యాండ్ సైకిల్‌ను కొనిచ్చారు. అప్పటి నుంచి అదే నా లోకం. నా సైకిల్ సవారీకి హైదరాబాద్ కూడా చిన్నదైపోయింది. ట్యాంక్‌బండ్ నుంచి చార్మినార్ వరకు.. నెక్లెస్‌రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఇలా సిటీలో అన్నీ చుట్టేశా. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. అమ్మ పదిళ్లలో పాచిపని చేస్తే... నాన్న రోజూ కూలీకి వెళితే కానీ మా ఇంట్లో పొయ్యి వెలగదు. వరంగల్ జిల్లాలోని తరిగొప్పుల అనే చిన్న గ్రామం మాది. ఆమే స్ఫూర్తి.. ఒక రోజు సైకిల్ మీద సికింద్రాబాద్ వెళ్తుంటే జింఖానా గ్రౌండ్లో దినాజ్ 24 గంటల ఎరోబిక్స్ షో జరుగుతోంది. అది పెద్ద రికార్డ్ అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పుడు నాకు కూడా సైకిల్‌తో రికార్డు సృష్టించాలనే ఆలోచన వచ్చింది. అలా అనుకున్నదే తడవుగా ట్యాంక్‌బండ్ నుంచి నెక్లెస్‌రోడ్ వరకు 24 గంటలు నాన్‌స్టాప్‌గా సైకిల్ తొక్కా. అప్పుడు నా ఫ్రెండ్స్ ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. ఆదిత్య చేయూత.. నా సైకిల్ సవారీలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఆదిత్య మెహతా. ఒక కాలు లేకపోయినా సైకిల్ యాత్రలు చేస్తూ రికార్డులు సృష్టించాడు. నగరంలో సైక్లింగ్ పోటీలు జరిగితే రైడింగ్ సైకిల్ కొనుక్కునే డబ్బులేక అద్దెకు సైకిల్ తీసుకుని పాల్గొనే నాకు అన్నివిధాలుగా చేయూతనిచ్చాడు. తనతో కలిసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేశా. కొండ కూడా తలవంచింది.. ప్రపంచంలో ఎత్తైన కొండపై సైకిల్‌యాత్ర చేయాలన్నది నా లక్ష్యం. ఇందుకు అవసరమైన మౌంటెన్ సైకిల్‌ను ఆదిత్యనే ఇచ్చాడు. ఈసారి నా లక్ష్యానికి అనుగుణంగా పంద్రాగస్టు రోజున జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ జిల్లా కర్దుంగ్లాలో జాతీయపతాకాన్ని ఎగురవేయాలని ప్లాన్ చేసుకున్నాం. పదిరోజుల ముందే కులు-మనాలి చేరుకున్నాం. అక్కడి నుంచే మా జర్నీ మొదలైంది. విపరీతమైన చలి, ఆక్సిజన్ లేకపోవడంతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. పెద్దపెద్ద రాళ్లను దాటుకుంటూ వెళ్లే ప్రయత్నంలో ఎన్నో గాయాలయ్యాయి. అయినా నా ఆత్మవిశ్వాసం ముందు అవన్నీ చిన్నవిగానే అనిపించాయి. చివరకు అనుకున్నట్లుగానే ఆగస్టు 15న కర్దుగ్లాకు చేరుకున్నాం. అక్కడ నా చేతితో త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు.. సరికొత్త రికార్డునూ సృష్టించాం. రికార్డు తొక్కేస్తా... ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్పాండే 86.45 గంటల పాటు సైకిల్ తొక్కి 1,038 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డు. దీన్ని బద్దలు కొట్టాలన్నది నా లక్ష్యాల్లో మరొకటి. 100 గంటల్లో 1,300 కిలోమీటర్లు నిరాటంకంగా సైకిల్ యాత్రచేసి కొత్త రికార్డు నెలకొల్పాలనుకుంటున్నా. కానీ, ఇలాంటి రికార్డులు సృష్టించాలంటే బాగా ప్రాక్టీసు చేయాలి. అందు కోసం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. దానికోసం ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అందుకే కొన్ని ఈవెంట్లలో స్టేజీ డెకరేషన్ బాయ్‌గా పనిచేస్తున్నా. నా లక్ష్యం చేరాలంటే నా దగ్గరున్న పాత సైకిల్‌తో అది సాధ్యం కాదు. ఇందుకోసం అత్యంత ఖరీదైన రోడ్ బైక్ సైకిల్ కొనుక్కోవాలి. ఇందుకోసం సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అందుకే ఎవరైనా దాతలు స్పందిస్తారేమోనని చూస్తున్నా..