అంతా అధినేత తీరే..!
తెలుగు తమ్ముళ్ల సైకిల్ యాత్ర తీరు
హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని గురించి ఊరూవాడా ప్రచారం చేయాలని కొందరు తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి ‘ఏపీ కేపిటల్ రైడ్’ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించడం ద్వారా పార్టీ అధినేత మెప్పు పొందాలనుకున్నారు. మోకాళ్లు, మోచేతులకు రక్షణ కవచాలు (గార్డ్స్), కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్‌లతో సిద్ధమయ్యారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, అరికెపూడి గాంధీ, మాగంటి బాబు జెండా ఊపి సైకిల్ యాత్ర ప్రారంభించారు. అంతే రాజధాని దిశగా తమ్ముళ్లు రయ్.. మంటూ దూసుకుపోయారు.
తమ్ముళ్ల స్పీడ్ చూసి నేతలు మహా ముచ్చటపడిపోయారు. కానీ ర్యాలీ నగర శివారు చేరుకున్నాక అసలు కథ మొదలయ్యింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న లారీలోకి సైకిళ్లు ఎక్కించిన తెలుగు తమ్ముళ్లు తాము ఆ పక్కనే ఉన్న ఏసీ బస్సు ఎక్కి కూర్చున్నారు. ముందు బస్సు.. దాని వెనుకే లారీ. ఏదైనా ఊరు సమీపించగానే బస్సులోంచి దిగి సైకిలెక్కడం.. ఊరు దాటగానే సైకిళ్లు లారీలో వేసి ఏసీ బస్సులో సేద తీరడం.. ఇదీ తమ్ముళ్ల సైకిల్ ర్యాలీ కొనసాగిన తీరు. ఈ డ్రామా గమనించిన కొందరు ముక్కున వేలేసుకోగా.. మరికొందరు డ్రామాలో తమ్ముళ్లు తమ నేతనే మించిపోయారంటూ వ్యాఖ్యానించారు.