ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
నిడమర్రు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం అమలవుతున్న ‘రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం’ నాలుగేళ్లుగా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. బాలల ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఆరోగ్య కార్డుల పంపిణీ మూడేళ్లుగా నిలిచిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పథకాల పేరు మార్పుపై పెట్టిన శ్రద్ధ వాటి అమలుపై చూపకపోవడంతో ఈ పథకం కూడా అటకెక్కింది. దాంతో ఏటా సీజనల్ వ్యాధుల బారినపడుతున్న విద్యార్థులకు వైద్యం అందడం లేదు.
పథకం పేరు మార్చి.. ఏమార్చి
గతంలో జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా ఆరోగ్య పరీక్షలను స్థానిక పీహెచ్‌సీ, ఆరోగ్య సిబ్బంది నిర్వహించేవారు. స్థానిక డాక్టర్ తన పరిధిలోని పాఠశాలల్లో నెలకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించి అందుబాటులో ఉన్న మందులు అందించేవారు. 2016 నుంచి ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం’ (ఆర్‌బీఎస్‌కే)గా పేరు మార్చింది.
వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత
రెండేళ్లుగా వైద్య సిబ్బంది కొరత తదితర కారణాలతో జిల్లాలో విద్యార్థులకు వైద్య పరీక్షలు అరకొరగా సాగుతున్నాయి. మరో రెండు రోజుల్లో పాఠశాలలు పునఃపారంభం కానున్నాయి. ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థతో ఒప్పందం
గత ఏడాది రాష్ట్ర బాలల ఆరోగ్య పథకం నిర్వహణను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ధనుష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ జిల్లాలో 36 వైద్య బృందాలను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు పారా మెడికల్ సిబ్బంది ఉంటారు. ఒక్కో బృందం ప్రతిరోజూ 120 మంది విద్యార్థులను పరీక్షించి చికిత్స అందించాల్సి ఉంది. విద్యార్థులకు పూర్తి స్థాయిలో 30 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి సాధ్యంకాని వ్యాధులుంటే రిఫరల్ ఆసుపత్రులకు పంపించాలి. ఈ మేరకు ఒక్కో విద్యార్ధికి రూ.47.50 చెల్లించే విధంగా ఒప్పదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
అరకొరగా ఆరోగ్య కార్డుల పంపిణీ
జిల్లాలో 2,870 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 3.2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారంతా పేద విద్యార్థులే కావడంతో సహజంగానే పౌష్టికాహారలోపం ఉంటుంది. దీంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. గత రెండేళ్లుగా జిల్లాలోని ఏ పాఠశాలలోను ఈ ఆరోగ్య కార్డులు పూర్తి స్థాయిలో అందలేదు. ఆరోగ్య రికార్డులో ప్రతి విద్యార్థికీ రక్త పరీక్షలు నిర్వహించి ఆ వివరాలు నమోదు చేయాలి. ఈ విషయం ఆరోగ్య సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment