తెలుగుదేశం సంస్థాగత ఎన్నికలు ఆ పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. వర్గ విభేదాలతో తమ్ముళ్లు రోడ్డెక్కుతున్నారు. పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. పదవులు తమకంటే తమకు ఇవ్వాలంటూ సామాజిక వర్గాలను రెచ్చగొడుతున్నారు. సాక్షాత్తూ పార్టీ జిల్లా కన్వీనర్ జీవీ ఆంజనేయులు సమక్షంలోనే బాహాబాహీ తలపడుతున్నారు. సన్నాహాక సమావేశాల్లో కుర్చీలు విసిరేసుకుంటూ ఘర్షణ పడుతున్నారు. ఆదివారం పల్నాట ప్రాంతం మాచర్లలో ఇవే సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. రాజధాని ప్రాంతం మంగళగిరిలో సైతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పరిశీలకులు, పార్టీ ఇన్‌చార్జిల ఎదుటే కార్యకర్తలు ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. పరిశీలకులను సైతం భయాందోళనకు గురిచేసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పదవులు కట్టబెట్టని పక్షంలో ధర్నాలు చేసి బెదిరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తామా అంటూ ఓ సామాజిక వర్గం యువకలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించగా, అంతా కలిసి టీడీపీ పరువు గంగపాలు చేస్తున్నారని ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేయడం ఆ పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి అద్దం పట్టింది.
టీడీపీ పరువు గోవిందా
మంగళగిరి : క్రమశిక్షణకు మారు పేరు తమ పార్టీ అని చెబుతుండే టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధానిలో తెలుగు తమ్ముళ్లు షాకిచ్చారు. ఆదివారం మంగళగిరి మండల సంస్థాగత ఎన్నికల నిర్వహణకు నాయకులు సంకల్పించారు. ముందుగా పథకం ప్రకారం నాయకులు తమ అనుచర వర్గాలతో కార్యాలయానికి చేరుకున్నారు. ఇంతలో కార్యాలయం వద్దకు పార్టీ పరిశీలకులు పూర్ణచంద్రరావు, కొమ్మినేని సాయివికాస్, పార్టీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి చేరుకున్నారు. దీంతో వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు, అభిమానులు ఎవరికి వారు తమ నాయకుల పేర్లతో జిందాబాద్‌లు కొడుతూ పదవులు కేటాయించాలంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
దీంతో పరిశీలకులు, నాయకులు ఇన్‌చార్జి గదిలోకి చేరుకుని చర్చలు నిర్వహించే ప్రయత్నం చేశారు. మంగళగిరి మండల అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఎస్సీ వర్గానికి చెందిన కొమ్మా లవ్‌కుమార్, బీసీ వర్గానికి చెందిన చావలి ఉల్లయ్య, కోనంకి శ్రీనివాసరావు, కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల ఉమామహేశ్వరావును చర్చలకు పిలవగా, ఎవరికి వారు తమకు నాయకుడికి పదవి కేటాయించాలంటే, తమకు నాయకుడికి కేటాయించాలని బయట అభిమానులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీలకు నియోజకవర్గంలో ఒక్క పదవి కేటాయించలేదని మంగళగిరి మండల పదవిని కేటాయించి న్యాయం చేయాలని పరిశీలకులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
ఒక దశలో యువకులు ‘‘మేము ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వస్తామా..మా ఓట్లతో గెలిచి పదవులు మాత్రం కమ్మ సామాజిక వర్గానికే ఇస్తారా పదవులకు మేము పనికిరామా ’’ అంటూ పరిశీలకులను నిలదీశారు. పదవి ఎస్సీలకు ఇవ్వకుంటే తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. న్యాయం చేయాలంటూ లవ్‌కుమార్ పరిశీలకులకు దణ్ణం పెడుతూ కాళ్ల మీద పడే ప్రయత్నం చేయడంతో నాయకులు కంగారు పడ్డారు. చివరకు అధిష్టానానికి తెలియజేసి న్యాయం చేస్తామంటూ న చ్చచెప్పారు.
అనంతరం మండల యువత పదవికి పోటీపడుతున్న జువ్వాది కిరణ్ చందు, సద్దాంల అనుచరులు రంగంలోకి దిగారు. ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేయడమేకాక ఇన్‌చార్జి గది తలుపుల అద్దాలను సైతం పగులగొట్టి కుర్చీలు గాలిలోకి విసిరేశారు. పరిస్థితి చేయిదాటిపోతుందనుకున్న నాయకులు సమా వేశాన్ని మధ్యాహ్నం మూడుగంటలకు వాయిదా వేశారు. అయితే పార్టీలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ముగ్గురు నాయకులు మూడు వర్గాలను ప్రోత్సహించి పార్టీపరువు తీశారని సీనియర్ నాయకులు విమర్శించారు.
మాచర్లలో బాహాబాహీ
మాచర్ల టౌన్ : తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ అని విభేదాలు వీడి రాబోయే ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేయాలని జిల్లా టీడీపీ కన్వీనర్ జీవీ ఆంజనేయులు చెప్పిన ఐదు నిమిషాలకే తమ్ముళ్లు బాహాబాహీకి దిగి ఘర్షణ పడ్డారు. స్థానిక మార్కెట్‌యార్డులో ఆదివారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. జీవీ ముఖ్య అతిథిగా హాజరై విభేదాలు విడనాడి కమిటీలను ఏకగ్రీవం చేసుకోవాలని హితబోధ చేశారు. ఆనంతరం ఆయన యార్డులోని విశ్రాంతి గదికి వెళ్లారు. ఈ సమయంలో మాచర్ల మండలానికి చెందిన టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి మండల అధ్యక్ష పదవి తమకంటే తమకివ్వాలని వాదనకు దిగారు. పోటీపడి 11 మంది పేర్లను పరిశీలకులకు ఇచ్చారు.
ఈ సమయంలో కొప్పునూరుకు చెందిన ఒకే సామాజిక వర్గంలోని గుండాల శ్రీనివాసరావు, నేరేటి వీరాస్వామి పదవి కోసం తీవ్రంగా వాదనకు దిగారు. నియోజక వర్గ ఇన్‌చార్జిలు చిరుమామిళ్ల మధుబాబు మద్దతు ఒకరు, మరొకరు కొమ్మారెడ్డి చలమారెడ్డి మద్దతుతో వాదులాటకు దిగారు. ఈ సమయంలో గిరిజనులకు అధ్యక్ష పదవి కేటాయించాలని కొంత మంది, జమ్మలమడక గ్రామానికి కేటాయించాలని మరికొంత మంది వాదనకు దిగారు. ఒక దశలో తీవ్ర గందరగోళం నెలకొంది.
గుండాల శ్రీనివాసరావుకు మద్దతుగా కొంత మంది వీరాస్వామికి మద్దతుగా మరికొంత మంది మద్దతు పలుకుతూ సవాళ్లు విసురుకున్నారు. రండి చూసుకుందాం అంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఘర్షణకు సిద్ధమయ్యారు. కొంత మంది కుర్చీలు విసిరివేయగా, ప్రతిగా మరోవర్గం కుర్చీలు విసిరివేసి నెట్టుకున్నారు. ఘర్షణ తీవ్రమై ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నాయకులు సర్ధిచెబుతున్నా వినకుండా ఘర్షణపడటంతో ఇతర మండలాలకు చెందిన వారు ఆందోళనతో వేదిక ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణ పడుతున్న సమయంలో పరిశీలకునిగా వచ్చిన కృష్ణాజిల్లా నందిగామ మార్కెట్ యార్డు చైర్మన్ సాంబశివరావు ఘర్షణపడవద్దని బతిమిలాడాడు. అయినా ఎవరూ వినిపించుకోకుండా ఘర్షణ పడుతూనే ఉన్నారు. నియోజవర్గానికి చెందిన ఇన్‌చార్జిలకు మద్దతుగా రెండు వర్గాలుగా విడిపోయి నాయకులను దూషించే స్థాయిలో ఘర్షణ జరిగింది. చివరకు నియోజకవర్గానికి చెందిన నాయకులు సర్దిచెప్పి ఘర్షణను ఆపారు. ఆ తరువాత మండల అధ్యక్షులుగా పోటీచేసే వారి పేర్లను నమోదు చేసుకొని ఎవరికి మద్దతుంటే వారిని ఎంపిక చేస్తామని ప్రకటించటంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది.
వెల్దుర్తి మండలానికి సంబంధించి టీడీపీ అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు రాజబోయిన మధు, మండాదికి చెందిన పాపిరెడ్డి పోటీ పడ్డారు. వీరిద్దరు కూడా పదవి తమకంటే తమకు కావాలని కోరటంతో వాదన జరిగింది. మాచర్ల, వె ల్దుర్తి మండలాలకు సంబంధించి సాయంత్రం వరకు ఏకాభిప్రాయానికి రాకపోవటంతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఘర్షణ జరిగే సమయంలో మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి, పిన్నెల్లి లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు యాగంటి మల్లిఖార్జునరావుతో పాటు పలువురు నాయకులు ఉన్నా ఘర్షణను నివారించలేకపోవటంతో టీడీపీ తమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి.
‘దేశం’లో సంస్థాగత చిచ్చు !
Published Mon, Apr 20 2015 3:00 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement