మరో అమరావతి ‘అనకొండ’.. అడ్డంగా దొరికేసింది | Ex-Minister Prathipati Pulla Rao Son Irregularities | Sakshi
Sakshi News home page

మరో అమరావతి ‘అనకొండ’.. అడ్డంగా దొరికేసింది

Published Sat, Mar 2 2024 7:54 PM | Last Updated on Sat, Mar 2 2024 9:02 PM

Ex Minister Prathipati Pulla Rao Son Irregularities - Sakshi

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ కి రిమాండ్

అమరావతిని దోచేసిన మరో అనకొండ అడ్డంగా దొరికింది. ప్రజా ధనాన్ని వాటాలేసుకుని మరీ మింగేసిన మరో టీడీపీ నేత దొరికిపోయాడు. అమరావతిలో నిర్మాణాల పేరుతో రచించిన దోపిడీ కథ జైలుకి చేరింది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్‌ అయ్యారు. మనీ లాండరింగ్, జీఎస్టీ ఎగవేత కేసుల్లో అరెస్ట్‌ అయిన ప్రత్తిపాటి శరత్‌ను రిమాండ్‌కు తరలించారు. బోగస్ ఇన్వాయిస్‌లు, బోగస్ బిల్లులతో కోట్లు కొల్లగొట్టిన నేరంపై DRI, డైరెక్టరేట్‌ ఆఫ్ GST అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ అమరావతి అనకొండ కథేంటో చూద్దాం.

టీడీపీకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అవెక్సా కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పుల్లారావు భార్య, కొడుకు శరత్ మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి కాంట్రాక్టులు తన భార్య కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న సంస్థకి తీసుకుని, వాటి ద్వారా కోట్ల రూపాయలను అడ్డదారిలో మళ్లించారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్‌లు సమర్పించి నిధులను కొల్లగొట్టి, వాటిని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఆధారాలతో సహా బట్టబయలైంది.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోదాల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడింది. డీజీజీఐ విచారణలో తేలిన ఆధారాలపై ఏపీ డీఆర్ఐ కూడా విచారించడంతో మొత్తం గుట్టురట్టయ్యింది. ఈ నేపథ్యంలోనే డీఆర్ఐ అధికారులు ప్రత్తిపాటి శరత్ పై విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రత్తిపాటి శరత్ ని పోలీసులు అరెస్ట్‌ చేసి వెంటనే న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున న్యాయస్థానం ప్రత్తిపాటి శరత్ ని 14 రోజులు రిమాండ్ కి పంపింది.

బోగస్ ఇన్వాయిస్ లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని సాక్షాత్తూ అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్రా జగదీష్ అంగీకరించారు. డీజీజీఐ, డీఆర్ఐ విచారణలోనే నేరం అంగీకరించడంతో ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ కుంభకోణం ఎలా జరిగిందో కూడా జగదీష్ పూసగుచ్చినట్టు వెల్లడించడంతో ప్రత్తిపాటి శరత్‌కి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లను బెదిరించి అమరావతి పనులు చేసే కాంట్రాక్టు సంస్థల నుండి ఈ కంపెనీ 2017 నుండి అడ్డగోలుగా సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే నిధులు కొల్లగొట్టింది.

జాక్సన్ ఎమినెన్స్ అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టు పొందింది. ఆ కంపెనీ నుండి 37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. సీఆర్డీఏ పరిధిలో రోడ్డు, వరద నీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాకులు గ్రీనరీ పనులు చేస్తామని సబ్ కాంట్రాక్టు తీసుకుంది. అయితే వీళ్లు మళ్లీ తానిషా ఇన్ ఫ్రా, రాలాన్ ప్రాజెక్ట్స్‌, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు 21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టును ఇచ్చినట్టు చూపించారు. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది.

సబ్ కాంట్రాక్టు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్ లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా మాయ చేసింది. ప్రభుత్వ ఖజానా నుండి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. ఏ పనులు చేయలేదు. ఆ నాలుగు కంపెనీలు షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం 21.93 కోట్లు ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది.

మరో వైపు అమరావతిలోని ఉద్దండ రాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్ఆర్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకుంది ప్రత్తిపాటి పుల్లారావు అవెక్సా కంపెనీ. ఇక్కడైతే అసలు రోడ్డు పనులు చేయకుండానే బిల్లులు పెట్టి ప్రజా ధనాన్ని సొంత ఖాతాల్లోకి మళ్ళించేసుకున్నారు. రోడ్డు నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్ పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్‌ ఫినెక్స్ ఐరన్ స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఏ పనీ చేయకుండానే 26 కోట్లకు పైగా దోపిడీ చేసింది ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ.

పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ కోట్లు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జీ ప్లస్ 3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్ లను సమర్పించి ప్రజాధనాన్ని కొల్లగొట్టింది.

ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీకి చెందిన కంపెనీ. ఈ మేరకు ఆధ్యా ఎంటర్ ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్‌ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్టు బోగస్ ఇన్వాయిస్‌లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా 17.85 కోట్లు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ మొత్తం 66.3 కోట్లు కొల్లగొట్టింది.

ఈ అవినీతి దందా మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అవెక్సా డైరెక్టర్ అయిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానం ప్రత్తిపాటి శరత్ కి రిమాండ్ విధించింది.

ఇదీ చదవండి: 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్‌ రియల్‌ సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement