యోగా సర్వరోగ నివారిణి
♦ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
♦ గుంటూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
గుంటూరు స్పోర్ట్స్ : ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ముఖ్యభాగం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నగరంపాలెంలోని కేకేఆర్ పంక్షన్ ప్లాజాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అన్ని రోగాలకు యోగా సర్వరోగ నివారిణి అన్నారు. శరీరం, మెదడు చురుగ్గా పనిచేయడానికి యోగా దోహదకారి అవుతుందన్నారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి యోగా ఆయుధం కావాలన్నారు.
ఆరో తరగతి నుంచి యోగాను ఓ పాఠ్యాంశంగా చేర్చితే పిల్లలు మానసిక పరిపక్వత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ మాట్లాడుతూ యోగాపై విద్యార్థులు ఆసక్తిపెంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే మాట్లాడుతూ జీవితంలో యోగా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. యోగా దినోత్సవంలో భాగంగా శిక్షకులు డాక్టర్ కె.కొండయ్య 20 రకాల ఆసనాలతో దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో యోగా చేయించారు.
కార్యక్రమంలో యోగా శిక్షకురాలు శ్రీవిద్య, సంయుక్త కలెక్టర్-2 ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి.వెంకటేశ్వరరావు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.వి.శ్రీనివాసులురెడ్డి, ఆయుష్ వైద్య అధికారి డాక్టర్ ఉమాసుందరి, వివిధ శాఖల అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.