భారతీయ వారసత్వ సంపద యోగా | Indian heritage is yoga | Sakshi
Sakshi News home page

భారతీయ వారసత్వ సంపద యోగా

Jun 22 2024 5:20 AM | Updated on Jun 22 2024 5:20 AM

Indian heritage is yoga

వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌

సాక్షి, అమరావతి/లబ్బిపేట (విజయవాడ తూర్పు): యోగా భారతీయ ఘన వారసత్వ సంపద అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో విజయవాడ లోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. శరీరంతో పాటు, మనసు శక్తివంతం కావాలంటే అందుకు ఏకైక మార్గం యోగా అని అన్నారు. 

ఈ ఏడాది యోగా ఫర్‌ సెల్ఫ్‌ అండ్‌ సొసైటీ ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. 175 దేశాలకు పైగా యోగాను ఆచరిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుంచే యోగా ఔన్నత్యాన్ని వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణరాజు యోగాసనాలు చేయించారు. 

ఆయుష్‌ శాఖ రూపొందించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఫార్మసీస్‌ అండ్‌ డాక్టర్స్‌ వెబ్‌సైట్, ఆశా ఏఎన్‌ఎంల కోసం రూపొందించిన శిక్షణా పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు కొలికపూడి, ఎన్‌.ఈశ్వరరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు. 

యోగాతో మానసిక ఆరోగ్యంగవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌
నిత్యం యోగా చేయడం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో శుక్రవారం గవర్నర్‌తోపాటు అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య అధికారి సీహెచ్‌.రామానంద్, కేర్‌ యోగా నేచురోపతి కాలేజ్‌కు చెందిన ఎస్‌.సుచరిత యోగాసనాల గురించి వివరించారు. 

ప్రాచీన జీవన విధానాన్ని స్వీకరించాలికేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ 
భీమవరం: యోగా ప్రాచీన సంస్కృతిలో ఒక భాగమని, మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా పడుతున్న ఇబ్బందులను అధిగవిుంచడానికి ప్రాచీన జీవన విధానాన్ని తిరిగి స్వీకరించాలి్సన అవసరముందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భారతీయ విద్యాభవన్స్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

యోగా సాధన ద్వారా చక్కని శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చునన్నారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ నేటి ప్రపంచంలో ప్రతి రంగంలోనూ తీవ్ర పోటీ నెలకొన్నందున మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందన్నారు. 

ఎస్పీ వేజెండ్ల అజిత మాట్లాడుతూ టెక్నాలజీ, ఆధునిక సాధనాల వల్ల శారీరక శ్రమ తగ్గిపోయిందని, ప్రతి ఒక్కరూ నిత్యం కనీసం 20 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేయాలని, తద్వారా మానసిక, శారీరక సమతౌల్యత కలుగుతుందని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్, ఎస్పీ అజిత వేజెండ్ల, జాయింట్‌ కలెక్టర్‌ సీవీ ప్రవీణ్‌ ఆదిత్య తదితరులు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.

నడి సముద్రంలో నౌకాదళం యోగాసనాలు
సాక్షి, విశాఖపట్నం: ‘స్వీయ ఆరోగ్యం, సమాజం కోసం యోగా’ అనే థీమ్‌తో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించింది. 11 రోజుల పాటు యోగా ప్రచారం నిర్వహించిన నౌకాదళం.. శుక్రవారం గ్రాండ్‌ ఫినాలేలో వివిధ ప్రాంతాల్లోని సాగర తీరంలోనూ, సముద్రంలోని యుద్ధ నౌకల్లో యోగాసనాలు వేశారు. శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరచడానికి నేవీ సిబ్బంది యోగా విన్యాసాలు నిర్వహించారు. 

యోగా సెషన్స్‌తో పాటు మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం, అధునాతన ఆసనాలపై నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లలో నౌకాదళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పసిఫిక్, అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహా సముద్ర తీరాల్లో పహారా కాస్తున్న యుద్ధ నౌకల్లో నిర్వహించిన యోగా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డేలో కోస్ట్‌గార్డ్‌ ఉద్యోగులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement