యోగమస్తు..! భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం..!! | International Day Of Yoga 2024 Yogamastu Indian culture is universal | Sakshi
Sakshi News home page

యోగమస్తు..! భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం..!!

Published Fri, Jun 21 2024 9:50 AM | Last Updated on Fri, Jun 21 2024 9:50 AM

International Day Of Yoga 2024 Yogamastu Indian culture is universal

మానసిక – శారీరక ఆరోగ్యకర మార్పులకు వారధి..

నగరం వేదికగా విదేశీయులకు శిక్షణ..

నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా...

సంప్రదాయ భారతీయ ‘యోగ’ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. మన దేశస్తులతో పోటీ పడుతూ విదేశీయులు కూడా ఆరోగ్య‘యోగ’ం కోసం తపిస్తున్నారు. మన సంస్కృతీ సంప్రదాయాల్లో మమేకమైన ఆసనం...ఇప్పుడు ఆరోగ్యార్థుల పాలిట శాసనంగా మారింది. ఈ నేపథ్యంలో మన వాళ్లే కాకుండా పాశ్చాత్యులు కూడా యోగ సాధన కోసం నగరానికి క్యూ కడుతున్నారు. మేము సైతం అంటూ యోగ మార్గానికి జై కొడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

సాంత్వన–ఉత్తేజమయం...
దేహానికి ధ్యానంలాంటిది...యోగ. ఒక్కో ఆసనం శరీరంలోని ఒక్కో అవయవానికి సాంత్వనను, ఉత్తేజాన్ని అందిస్తుంది. యోగలోని విభిన్నమైన బ్రీథింగ్‌ టెక్నిక్స్‌ శారీరక, మానసిక ఉపశమనాన్ని నెలకొల్పుతాయి. దశాబ్దకాలంగా ఆస్వాదనతో, అంకితభావంతో యోగ చేస్తున్నాను. ఫిట్నెస్‌ కోసమో, మరువు తగ్గించుకోడానికి మాత్రమే కాకుండా నిత్య జీవనం పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. 

యోగాసనాలు యవ్వనత్వాన్ని కాపాడుతూ, చర్మాన్ని సున్నితంగా ఉంచడంతో పాటు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. దృష్టి కేంద్రీకరణ, మానసిక నిలకడ–సమతుల్యతలో యోగ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. షూటింగ్‌లో ఉన్నా, ఇతర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నా నిత్యం యోగ చేస్తుంటాను. ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు చేయడం ఇష్టం. ఎక్కువ కాలం యోగతో ప్రయాణం..ఆనందమయ జీవితానికి వారధి.

– శ్రద్దాదాస్, ప్రముఖ సినీనటి.

యోగ, ప్రాణాయామం, ధ్యాన సమ్మేళనం... 
మానవ జీవితానికి అందిన అద్భుత వరం ..యోగ. యోగాసనాలు శారీరక, మానసిక స్థిగతులపైన ఉత్తేజకర ప్రభావాన్ని చూపించడమే కాకుండా అంతర్గత శక్తిని ప్రసాదిస్తుంది. వీటి సమ్మేళనం జీవితంలో ఒక నూతన మార్గాన్ని సూచిస్తుంది. యోగలో ఎన్నో ఆసనాలు ఉన్నప్పటికీ నిత్య జీవనంలో ప్రత్యేకించిన 25–30 ఆసనాలు తప్పనిసరిగా చేయాలి. యోగ నిత్య ప్రయాణంలో క్రమ క్రమంగా శాశ్వత ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుత ఆధునిక, సాంకేతిక యుగంలో యోగను తప్పనిసరి దైనందిన చర్యగా మార్చుకోవాల్సిన అవసరముంది.

– యోగాన్వేషి స్వప్న, యోగా శిక్షకురాలు. హైదరాబాద్‌. 

స్పృహ ‘వర్సెస్‌’ ఆందోళన...
సామాజికంగా పెరిగిపోయిన ఆందోళన, అనిశ్చితి వంటి పరిస్థితులకు యోగ చక్కటి పరిష్కార మార్గం. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా గతేడాది మానసిక వైద్యులను సంప్రదించిన సందర్శకులు, యాంటీ డిప్రెసెంట్స్‌ వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి. సాధారణ ఆందోళన స్థాయి నుంచి అస్పష్టమైన చంచలత్వం, తీవ్ర శారీరక లక్షణాలు.. మూర్ఛపోయేంతలా మానసిక ఆందోళనలు పెరిగిపోతున్నాయి.

ఆందోళన అనేది కేంద్ర నాడీ వ్యవస్థపై నియంత్రించలేని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సమస్యలకు యోగ పరిష్కారాలను సూచిస్తుంది. భావోద్వేగ నేపథ్యంతో పనిచేసే యోగ మెదడు సిగ్నలింగ్‌ వ్యవస్థను తిరిగి సున్నితం చేయడంలో సహాయపడుతుంది. భారతీయ సంస్కృతిలోని యోగ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న మానసిక ఆందోళనను సమాధానపరుస్తుంది.

– ఇరినా తాషె్మట్, ఉజ్బెకిస్తాన్‌. (కన్హా శాంతి వనంలో యోగా ఆభ్యాసకురాలు)

ఐక్య వేడుకగా...
అంతర్జాతీయ యోగ దినోత్సవ నేపథ్యంలో ఏటా యోగాకు పెరుగుతున్న ఆదరణ, ఉత్సాహం, ఐక్యత చూసి ఆశ్చర్యపోతున్నాను. యోగ సెషన్‌లో భాగంగా యోగలోని ఎనిమిది భాగాల్లో దేనిని సాధన చేసినా ఆసనం, ప్రాణాయామం, ధారణ, ధ్యానం, యామ–నియామ ప్రయోజనాలను అందిస్తుంది. అనతికాలంలోనే యోగ విశ్వవ్యాప్తమైంది. హార్ట్‌ఫుల్‌నెస్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అధికారిక వేడుకలకు ముందుగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలను సమన్వయం చేస్తుంది.

ఇందులో జైపూర్‌లోని ఓ గ్రామం నుంచి యునెస్కో–ప్యారిస్, యునైటెడ్‌ నేషన్స్‌–న్యూయార్క్‌ వరకూ అన్ని హార్ట్‌ఫుల్‌నెస్‌ బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగ దేశాన్ని దాటి వివిధ భాషలు, మతాలు, సంప్రదాయాలకు అతీతంగా ఐక్య వేడుకగా మారింది. యోగ కార్యక్రమాలను సిద్ధం చేయడం, నిర్వహించడం యోగ చేసిన అనుభూతిని అందిస్తుంది.

– డాక్టర్‌ వెరోనిక్‌ నికోలాయ్‌ (ఫ్రాన్స్‌), హార్ట్‌ఫుల్‌నెస్‌ యోగ అకాడమీ డైరెక్టర్‌.

ఇవి చదవండి: International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement