దేశంలోనే అతిపెద్ద కుంభకోణం
► సీబీఐతో విచారణ చేయించాలి..
► మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుకోవాలి
► ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
► రాజధాని దురాక్రమణపై
► వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
పట్నంబజారు (గుంటూరు) : భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం రాజధాని ప్రాంతంలో జరిగిందని, దానిలో ప్రభుత్వ పెద్దలు ఉండడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నిప్పులు చెరిగారు. తక్షణమే దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులను భయపెట్టి, పొలాలు, అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తక్షణమే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
అమ్మకాల్లో ఆయనకు ఆయనే సాటి ...
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో అరాచకాలు చేస్తున్నారని, ఎక్కడ భూములు ఉంటే అక్కడ వాలిపోతారని, ఇసుక, మట్టి, పత్తి అమ్ముకోవడంతో ఆయనకు ఆయనే సాటి అని మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెర తీశారన్నారు. కోర్ కేపిటల్, పరిశ్రమలు ఎక్కడ వస్తాయో పూర్తిగా తెలిసిన మంత్రులు భూములు రేట్లు తగ్గేలా చేశారని ఆరోపించారు.
బినామీల ద్వారా 90 ఎకరాలు..
అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని, నష్ట పరిహారం రాదని భయపెట్టిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు బినామీల ద్వారా 90 ఎకరాలు కొనుగోలు చేశారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. బట్టల దుకాణం నిర్వహించే విజయవాడకు చెందిన గుమ్మడి సురేష్ అనే వ్యక్తి అన్ని ఎకరాలు ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. సురేష్ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయటం జరిగిందని, ఈసీలు సైతం అతని పేరుపైనే ఉన్నాయని, వాటికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. నాలుగు రోజలు క్రితమే మంత్రి ప్రత్తిపాటి అసైన్డ్ ల్యాండ్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారన్నారు.
మంత్రి రావెల కిషోర్‌బాబుకు సంబంధించిన భూములు సైతం ఆయన భార్య, బావమరిది పేరుతో ఉన్నాయని తెలుస్తోందన్నారు. తక్షణమే రాజధానిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములను రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో సైతం పూర్తి సాక్ష్యాలతో నిరూపించామని, పత్తి కోనుగోళ్లలో భారీ అవినీతి జరిగితే, విచారణకు అతీగతీ లేదన్నారు.
చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి...
పార్టీ సీఈసీ సభ్యులు రావి వెంకటరమణ మాట్లాడుతూ లక్షల కోట్ల కుంభకోణానికి టీడీపీ నేతలు తెర లేపారని విమర్శించారు. రాజధాని పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌ఫర్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ ల్యాండ్‌లో ఎవరు పొజిషన్‌లో ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అసైన్డ్ ల్యాండ్ చట్ట ప్రకారం ఆ భూములు కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర సైతం ఓ డీఎస్పీతో కలసి ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు.