విజయవాడ ఇందిరానాయక్ నగర్‌లోని నెయ్యి తయారీ కేంద్రంలో కల్తీ ప్యాకెట్లతో అధికారులు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగుతున్న ఆహార పదార్థాల కల్తీ వ్యాపారంపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఆహార భద్రత విభాగం కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో నెయ్యి తయారీ కేంద్రాలు, హోటళ్లపై ఆహార భద్రత, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజయవాడ నగర శివారులోని అజిత్‌సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాల్లోని నెయ్యి తయారీ కేంద్రాలను, బీసెంట్ రోడ్డులోని పలు హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు. కలెక్టర్ ఇంతియాజ్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత ఆదేశాల మేరకు రెవెన్యూ, విజిలెన్స్, ఆహార భద్రత విభాగం అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపారు. నెయ్యి తయారీ కేంద్రాలు, హోటళ్లలో ఆహార పదార్థాల్లో ఉపయోగించే ముడి సరకు నమూనాలను సేకరించారు. సేకరించిన 14 నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్ పంపుతున్నామని, ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతాధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ దాడుల్లో రూ.5.45 లక్షల విలువైన పామాయిల్, రూ.3.81 లక్షల విలువైన నెయ్యి, రూ.27,000 వేలు విలువైన వేరుశనగ నూనెను సీజ్ చేశామన్నారు.
రాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు
మంగళవారం ఉదయం ప్రారంభించిన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగాయి. విజయవాడ పటమట డివిజన్‌లోని సాయినగర్‌లో ఉన్న పారడైజ్ ఫుడ్ కోర్టును ఆహార భద్రతాధికారి టి.శేఖర్‌రెడ్డి నేతృత్వంలో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.శేఖర్, తహసీల్దార్ డీవీఎస్ ఎల్లారావు తనిఖీ చేశారు. నాణ్యత సరిగా లేవన్న అనుమానంతో కారం పొడిని, మటన్ దమ్ బిర్యానీ నమూనాలను సేకరించారు. రెండో బృందానికి ఆహార భద్రతాధికారి ఎన్.రమేష్‌బాబు నేతృత్వం వహించారు. ఈ బృందం గవర్నర్‌పేటలోని ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను తనిఖీ చేసింది. రూ.4,225 విలువ చేసే నాణ్యత లేని 65 కిలోల వేరుశనగ గుండ్లను సీజ్ చేశారు. కిచెన్ రూం పరిశుభ్రంగా లేదని, రిఫ్రిజిరేటర్ కూడా సరిగా లేదని, తక్షణమే వాటిని సరిచేసుకోవాలంటూ హోటల్ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఇదే బృందం కొత్త రాజరాజేశ్వరి పేటలోని శ్రీలక్ష్మి దివ్య బాబు డెయిరీని తనిఖీ చేసింది.
అక్కడ తయారు చేస్తున్న ఆవు నెయ్యి, గేదె నెయ్యిలను పరిశీలించింది. 193.4 కిలోల ఆవు నెయ్యి, 700.4 కిలోల గేదె నెయ్యిని సీజ్ చేసి వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ఆహార భద్రతా అధికారి గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని మూడో బృందం అజిత్‌సింగ్ నగర్‌లోని ఇందిరానాయక్ నగర్‌లో శ్రీకృష్ణా వెగాన్ ఘీ పేరుతో నిర్వహిస్తున్న నెయ్యి తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసింది. అక్కడ ఇతర బ్రాండ్లను పోలిన ప్యాకింగ్ లేబుల్స్‌ను వినియోగిస్తుండటంతో 2,500 నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే 70 కిలోల నకిలీ పామాయిల్‌ను అధికారులు గుర్తించి నమూనాను సేకరించారు.
అనంతరం గవర్నర్‌పేటలోని బర్కత్ హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ వింగ్స్‌లో అధికంగా కలర్ వాడినట్టు గుర్తించారు. వాటిన నమూనాలను సేకరించారు. ఆహార భద్రతాధికారి పి.శ్రీకాంత్ నేతృత్వంలోని నాలుగో బృందం అజిత్‌సింగ్ నగర్‌లోని వెంకటేశ్వర జనరల్ ట్రేడర్స్‌ను తనిఖీ చేసింది. ఇందులో నాణ్యతపై అనుమానం రావడంతో విజయ ప్రీమియం డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్‌నట్ ఆయిల్ నమూనాను సేకరించి.. 9 ఆయిల్ టిన్నులను సీజ్ చేశారు. 58 టిన్నుల్లో నిల్వ ఉంచిన 3,600 కిలోల పామాయిల్‌ను సీజ్ చేశారు. అనంతరం వన్‌టౌన్‌లోని ఇస్లాంపేటలోని మిలాప్స్ పంజాబీ హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ నాణ్యత సరిగా లేవన్న కారణంతో బిర్యానీ, పెరుగు నమూనాలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment