బోర్డ్‌ మీటింగ్స్‌ వీడియోలో.. | Companies can conduct board meetings through video conference | Sakshi
Sakshi News home page

బోర్డ్‌ మీటింగ్స్‌ వీడియోలో..

Published Fri, Mar 20 2020 5:15 AM | Last Updated on Fri, Mar 20 2020 5:15 AM

Companies can conduct board meetings through video conference - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీల బోర్డ్‌ మీటింగ్స్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించే వీలు కల్పించింది కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ). దీంతో కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, అమాల్గమేషన్, నిధుల సమీకరణ వంటి కీలక నిర్ణయాల బోర్డ్‌ మీటింగ్స్‌లను వీడియో లేదా ఆడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించుకోవచ్చు. జూన్‌ 30 వరకు వీడియో, ఆడియో ద్వారా సమావేశాలకు అనుమతి ఇస్తున్నట్టు సౌతీస్ట్‌ రీజియన్‌ రీజినల్‌ డైరెక్టర్‌ (ఆర్డీ) తెలిపింది. ఫైనాన్సియల్‌ స్టేట్‌మెంట్స్, అకౌంట్స్, బోర్డ్‌ రిపోర్ట్స్, మెర్జింగ్స్, రీ–స్ట్రక్చరింగ్‌ వంటి బోర్డ్‌ ఆమోదానికి వీడియో కాన్ఫరెన్స్‌ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కేవలం బోర్డ్‌ మీటింగ్స్‌కు మాత్రమే వీడియో, ఆడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహణకు అనుమతి ఉంది. మిగిలిన వాటికి కంపెనీ డైరెక్టర్లు సంబంధిత కార్యాలయాలను ఫిజికల్‌గా కలవాల్సిందే.  

ప్రయాణ ఆంక్షలున్న నేపథ్యంలో..
ఇప్పటికే ఆర్వోసీ, ఎన్‌సీఎల్‌టీ, ఆర్డీ పరిధిలోని కాంపౌండింగ్‌ అప్లికేషన్స్‌ విచారణలను హైదరాబాద్‌లోని ఆర్డీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అధికారిక ఈ–మెయిల్, ఫ్యాక్స్‌ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు ఆర్వోసీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, విజయవాడ ఆర్వోసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 80 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 20 వేల కంపెనీలున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ప్రయాణ, గ్రూప్‌ సమావేశాలు వంటి వాటిపై ఆంక్షలున్న నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్లు మౌఖికంగా ఆయా కార్యాలయాలను సందర్శించడం శ్రేయస్కరం కాదు. అంతేకాకుండా చాలా కంపెనీల్లో విదేశీ డైరెక్టర్లు, ఇన్వెస్టర్లు ఉంటారు. వీళ్లు ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో మౌఖికంగా బోర్డ్‌ సమావేశంలో పాల్గొనలేరు. అందుకే కంపెనీల రోజు వారి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీసెస్‌ (ఐసీఎల్‌ఎస్‌) సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే సంబంధిత బోర్డ్‌ మీటింగ్స్‌ తాలూకు వీడియో, ఆడియో కాన్ఫరెన్స్‌ కాపీలను భద్ర పర్చుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక ఫలితాల ప్రకటనల నేపథ్యంలో ఎంసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించదగినది అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

27 వరకూ ఎన్‌సీఎల్‌టీ ఫైలింగ్స్‌ బంద్‌
దేశవ్యాప్తంగా అన్ని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బెంచ్‌లలో ఈ నెల 27 వరకు ఫైలింగ్‌ కౌంటర్‌ మూసివేయాలని ఢిల్లీలోని ఎన్‌సీఎల్‌టీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ నిర్ణయించింది. అన్ని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ల ఫైలింగ్‌ కౌంటర్ల వద్ద ఎక్కువ మంది సభ్యులు సంచరిస్తున్నారని.. ఇది కోవిడ్‌ వ్యాప్తికి కారణమవుతుందని∙భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్‌సీఎల్‌టీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అమరావతి, జైపూర్‌ బెంచ్‌లలో మాత్రం అత్యవసర మ్యాటర్స్‌ విషయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఫైలింగ్‌ చేసుకునే వీలు కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement