Ministry of Corporate Affairs
-
రికార్డు స్థాయిలో కొత్త కంపెనీలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త కంపెనీలు నమోదయ్యాయి. నవంబర్ చివరికి 1,96,028 కంపెనీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్‌లు (ఎల్ఎల్పీ) కొత్తగా ఏర్పాటైనట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రితం ఏడాది ఇలా ఏర్పాటైనవి 1.88 లక్షలుగా ఉన్నాయి. సులభతర నిబంధనల అమలు, సులభతర వ్యాపార నిర్వహణపై తమ దృష్టి కొనసాగుతుందని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. 2023 మే నుంచి ‘సెంట్రల్ ప్రాసెసింగ్ ఫర్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్’ (సీ–పేస్) అమల్లోకి వచ్చినట్టు గుర్తు చేసింది. కాంపిటీషన్ చట్టానికి, కంపెనీల చట్టంలోని పలు నిబంధనలకు సవరణలు చేసినట్టు పేర్కొంది. కంపెనీల నిబంధనలకు చేసిన సవరణలతో కంపెనీల విలీనాలకు రీజినల్ డైరెక్టర్లు వేగంగా అనుమతులు ఇవ్వడం సాధ్యమవుతుందని తెలిపింది. చురుకైన, సమర్థవంతమైన, ప్రతిస్పందించే కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించడమే ఈ చర్యల ఉద్దేశ్యమని వివరించింది. -
బ్యాంకుల్లో మూలుగుతున్న డిపాజిట్లు..అంత డబ్బును బ్యాంక్‌లు ఏం చేశాయంటే?
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో ఎవ్వరూ క్లెయిమ్ చేయని రూ.48,461.44 కోట్లను 2023 మార్చి 31వ తేదీ నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (డీఈఏఎఫ్)కు బదలాయించినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. 16,79,32,112 కోట్లకు ఈ నిధులు సంబంధించినవని కూడా ఆయన తెలిపారు. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. కార్పొరేట్ వ్యవహారా శాఖ సహాయమంత్రి కూడా అయిన కరాద్ చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు... ►ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్) వద్ద ఉన్న నిధులు మొత్తం (31 మార్చి 2023 నాటికి) రూ.5,715 కోట్లు. ►2018లో దేశం నుంచి పారిపోయిన ఆర్థిక నేరస్తులపై చట్టం అమల్లోకి వచ్చింది. 2023 ఆగస్టు 2వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపిన సమాచారం ప్రకారం, ఎనిమిది మంది ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు దేశం నుంచి పారిపోయారు. ఆగస్టు 2 నాటికి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల నేరాలకు సంబంధించి రూ. 34,118.53 కోట్ల జప్తు జరిగింది. అందులో రూ. 15,838.91 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. జప్తయిన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిధిలో ఉంచడం జరిగింది. ►ఉద్దేశపూర్వక ఎగవేతదారులు రాజీ పరిష్కారాన్ని అమలు చేసిన తర్వాత 12 నెలల వరకు తాజా రుణాన్ని పొందలేరు. ►జూలై 1 నాటి ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, ఉద్దేశపూర్వక ఎగవేతదారు లేదా మోసం అని వర్గీకరణ కిందకు చేరినవారు రుణగ్రహీతలకు శిక్షార్హులు అవుతారు. ►రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ రుణ పరిమాణం కలిగిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు (ఎస్సీబీ), అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లు (యూసీబీ), రూ. 5 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తం రుణాలకు సంబంధించి రుణగ్రహీతల నిర్దిష్ట క్రెడిట్ సమాచారాన్ని సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్‌కు(సీఆర్‌ఐఎల్‌సీ) తెలియజేయాలి. ►ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎన్బీ) ఫిబ్రవరి 2023 నాటికి గడచిన 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆపరేట్ చేయని దాదాపు రూ.35,012 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి బదిలీ చేశాయి. ఇవి దాదాపు రూ.10.24 కోట్ల అకౌంట్లకు సంబంధించినవి. సంబంధిత బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. చదవండి👉 బ్యాంకుల్లో 'అన్క్లెయిమ్డ్ డిపాజిట్', అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్ చేసుకోండిలా! -
చైనా కంపెనీల మాస్టర్ మైండ్‌కు భారీ షాక్ : వివరాలివిగో!
న్యూఢిల్లీ: చైనా లింకులతో భారత్‌లో పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపించిన మాస్టర్‌మైండ్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అరెస్టు చేసింది. దేశంలో పనిచేస్తున్న అనేక చైనీస్ షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో భారీ విజయాన్ని సాధించింది. ఈ చైనా కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను సరఫరా చేసేసూత్రధారి జిలియన్ ఇండియా అనే సంస్థ బోర్డు సభ్యుడైన డోర్సె అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని హుసిస్ కన్సల్టింగ్, బెంగళూరులోని ఫినిన్టీ లిమిటెడ్, గురుగ్రామ్‌లోని జిలియన్ కన్సల్టెంట్స్ ఇండియా కార్యాలయాల్లో సెప్టెంబర్ 8న సోదాలు నిర్వహించిన మీదట ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘జిలియన్ ఇండియా బోర్డులో డోర్సె సభ్యుడిగా ఉన్నారు. చైనాతో లింకులు ఉన్న అసంఖ్యాక డొల్ల కంపెనీలను భారత్‌లో ఏర్పాటు చేయడం, వాటి బోర్డుల్లో డమ్మీ డైరెక్టర్లను చేర్చడం వెనుక తనే మాస్టర్‌మైండ్ అని తేలింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం తను హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంత వాస్తవ్యుడిగా డోర్సె నమోదు చేసు కున్నారు. ఢిల్లీ నుంచి బీహార్ రోడ్డుమార్గంలో విదేశాలకు పారిపోయే ప్రయత్నాలకు చెక్ చెప్పిన ఎంసీఏ బీహార్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో అరెస్ట్ చేసింది. ఎస్ఎఫ్ఐవో ప్రత్యేక టీమ్ సెప్టెంబర్ 10న డోర్సెను అరెస్టు చేసి, సంబంధిత కోర్టులో హాజరుపర్చిందని ఎంసీఏ వెల్లడించింది. -
2021–22లో 1.67 లక్షల కొత్త కంపెనీలు...ఆ రాష్టంలోనే అధికం..!
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1.67 లక్షల కొత్త కంపెనీలు ఏర్పాటైనట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘2021–22లో ఏర్పాటైన కంపెనీలు 2020–21తో పోలిస్తే 8 శాతం అధికం. కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద 2018–19లో 1.24 లక్షల కొత్త కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. 2019–20లో 1.11 లక్షల కంపెనీలు, 2020–21లో 1.55 లక్షల కంపెనీలు చొప్పున నమోదయ్యాయి’’అని కార్పొరేట్ శాఖ వెల్లడించింది. వ్యాపార సేవల్లో 44,168 కంపెనీలు, తయారీలో 34,640 కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు కావడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో 31,107 కంపెనీలు నమోదయ్యాయి. చదవండి: భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఎకానమీపై తీవ్ర ప్రభావం..! -
మొండిబాకీల వసూళ్లు,లైసెన్సు కోసం సన్నాహాలు
న్యూఢిల్లీ: మొండిబాకీల వసూళ్ల కోసం ఉద్దేశించిన బ్యాడ్ బ్యాంక్ (నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ–ఎన్ఏఆర్సీఎల్)ని ముంబైలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా లాంఛనాలు పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నాయి. తదుపరి ఆర్బీఐ నుంచి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)గా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందని వివరించాయి. కెనరా బ్యాంకు సారథ్యంలోని ప్రభుత్వ బ్యాంకులకు ఇందులో మెజారిటీ వాటాలు ఉంటాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్ మొదలైనవి మూలధనం సమకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఏఆర్సీఎల్ మూలధనం రూ. 7,000 కోట్లుగా ఉండనుంది. ఇందులో కేంద్రం నేరుగా వాటాలు తీసుకోకపోయినప్పటికీ ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసీట్స్‌కు పూచీకత్తు మాత్రం ఇస్తుంది. ఇందుకు ప్రభుత్వం రూ. 31,000 కోట్లు కేటాయించింది. బ్యాంకుల నుంచి మొండిబాకీలను కొనుగోలు చేసి, వాటిని రికవర్ చేయడంపై ఎన్ఏఆర్సీఎల్ కసరత్తు చేస్తుంది. దీనికి బదలాయించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే రూ. 82,500 కోట్ల విలువ చేసే 22 అసెట్స్‌ను గుర్తించాయి. -
కరోనా కాలంలో కొత్త కంపెనీల జోరు
2020 ఏప్రిల్ నుండి 2021 ఫిబ్రవరి వరకు 1,38,051 కొత్త కంపెనీలు నమోదయ్యాయని అలాగే 10,113 కంపెనీల కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపార. లోక్‌సభలో కంపెనీల చట్టం, 2013 ప్రకారం సోమవారం అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ప్రజా తనిఖీ కోసం కూడా ఈ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్ www.mca.gov.inలో లభిస్తాయని ఠాకూర్ చెప్పారు. అలాగే, పెట్రోల్, డీజిల్‌పై పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయం గడిచిన ఆరేళ్లలో 300 శాతం పెరిగిందని ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చదవండి: వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్ -
బోర్డ్ మీటింగ్స్ వీడియోలో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల బోర్డ్ మీటింగ్స్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించే వీలు కల్పించింది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ). దీంతో కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, అమాల్గమేషన్, నిధుల సమీకరణ వంటి కీలక నిర్ణయాల బోర్డ్ మీటింగ్స్‌లను వీడియో లేదా ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించుకోవచ్చు. జూన్ 30 వరకు వీడియో, ఆడియో ద్వారా సమావేశాలకు అనుమతి ఇస్తున్నట్టు సౌతీస్ట్ రీజియన్ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) తెలిపింది. ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్, అకౌంట్స్, బోర్డ్ రిపోర్ట్స్, మెర్జింగ్స్, రీ–స్ట్రక్చరింగ్ వంటి బోర్డ్ ఆమోదానికి వీడియో కాన్ఫరెన్స్ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కేవలం బోర్డ్ మీటింగ్స్‌కు మాత్రమే వీడియో, ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహణకు అనుమతి ఉంది. మిగిలిన వాటికి కంపెనీ డైరెక్టర్లు సంబంధిత కార్యాలయాలను ఫిజికల్‌గా కలవాల్సిందే. ప్రయాణ ఆంక్షలున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆర్వోసీ, ఎన్సీఎల్టీ, ఆర్డీ పరిధిలోని కాంపౌండింగ్ అప్లికేషన్స్ విచారణలను హైదరాబాద్‌లోని ఆర్డీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అధికారిక ఈ–మెయిల్, ఫ్యాక్స్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు ఆర్వోసీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, విజయవాడ ఆర్వోసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 80 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 20 వేల కంపెనీలున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రయాణ, గ్రూప్ సమావేశాలు వంటి వాటిపై ఆంక్షలున్న నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్లు మౌఖికంగా ఆయా కార్యాలయాలను సందర్శించడం శ్రేయస్కరం కాదు. అంతేకాకుండా చాలా కంపెనీల్లో విదేశీ డైరెక్టర్లు, ఇన్వెస్టర్లు ఉంటారు. వీళ్లు ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో మౌఖికంగా బోర్డ్ సమావేశంలో పాల్గొనలేరు. అందుకే కంపెనీల రోజు వారి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ (ఐసీఎల్ఎస్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే సంబంధిత బోర్డ్ మీటింగ్స్ తాలూకు వీడియో, ఆడియో కాన్ఫరెన్స్ కాపీలను భద్ర పర్చుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక ఫలితాల ప్రకటనల నేపథ్యంలో ఎంసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించదగినది అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 27 వరకూ ఎన్సీఎల్టీ ఫైలింగ్స్ బంద్ దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్‌లలో ఈ నెల 27 వరకు ఫైలింగ్ కౌంటర్ మూసివేయాలని ఢిల్లీలోని ఎన్సీఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్ నిర్ణయించింది. అన్ని ఎన్సీఎల్టీ బెంచ్‌ల ఫైలింగ్ కౌంటర్ల వద్ద ఎక్కువ మంది సభ్యులు సంచరిస్తున్నారని.. ఇది కోవిడ్ వ్యాప్తికి కారణమవుతుందని∙భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్సీఎల్టీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అమరావతి, జైపూర్ బెంచ్‌లలో మాత్రం అత్యవసర మ్యాటర్స్ విషయంలో ఆన్లైన్ ద్వారా ఫైలింగ్ చేసుకునే వీలు కల్పించారు. -
ఆర్వోసీ విజయవాడలో శిక్షణ శిబిరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఆధ్వర్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఎంసీఏ) తీసుకొచ్చిన ప్రగతిశీల సంస్కరణల మీద విజయవాడ ఆర్వోసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. కంపెనీల చట్ట సవరణలు, కంపెనీస్ కొత్త రూల్స్, షేర్ క్యాపిటల్, డిబెంచర్స్ 2014 నిబంధనలు వంటి తదితర అంశాలలతో పాటూ వెబ్ ఆధారిత సర్వీస్ రన్, సీఆర్సీ వంటి సాంకేతికత అంశాల మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్వోసీ డెన్నింగ్ కె. బాబు, అసిస్టెంట్ ఆర్వోసీ ఎల్. సాయి శంకర్, ఐసీఎస్ఐ అమరావ తి చాప్టర్ ప్రతినిధులు పి. ప్రకాశ్ రెడ్డి, జేవీ రామారావు, కె. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. -
15 కోట్లతో ఐసీఎస్ఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ సెక్రటరీల ఉపాధికి విఘాతం కలిగించే విధంగా ఉన్న కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలకు త్వరలోనే సవరణలు జరగనున్నాయని, దీనికి ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఆర్.శ్రీధరన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త కంపెనీల చట్టంలోని దొర్లిన లోపాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్ అంగీకరించారని, వీటిని తప్పక సరిచేస్తానని హామీ ఇచ్చారన్నారు. కొత్త కంపెనీల చట్టంలో ప్రైవేటు కంపెనీలు, రూ.10 కోట్ల లోపు చెల్లింపు మూలధనం ఉన్న పబ్లిక్ కంపెనీలకు కీ మేనేజరియల్ పెర్సనల్ (కేఎంపీ) నుంచి మినహాయింపు ఇవ్వడంతో అనేకమంది కంపెనీ సెక్రటరీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనను సవరించనుండటంతో కంపెనీ సెక్రటరీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటీకి దేశం డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీ సెక్రటరీలు లేక కొరతను ఎదుర్కొంటోందని శ్రీధరన్ తెలిపారు. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రూ.15 కోట్లతో హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీఎస్ఐ ప్రకటించింది. నెల రోజుల్లో పనులు ప్రారంభించి రెండేళ్లలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీధరన్ తెలిపారు. ముంబై తర్వాత రెండో కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. -
సీఎస్ఆర్ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచి, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిబంధనలు కార్యరూపం దాల్చనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వీటిని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ(నోటిఫై) చేసింది. కొత్త కంపెనీల చట్టం-2013లో భాగంగా నిబంధనలను తీసుకొచ్చారు. దీని ప్రకారం కార్పొరేట్ కంపెనీలు ఇక నుంచి సామాజిక పురోభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులకు నిధులను తప్పనిసరిగా వెచ్చించడం, ఇతరత్రా కార్యకలాపాలను చేపట్టాల్సి ఉంటుంది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయసేకరణ, విసృ్తత చర్చల తర్వాతే ఈ నిబంధనలను ఖరారు చేశామని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సచిన్ పైలట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సీఎస్ఆర్ వ్యయంపై పన్ను రాయితీలు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇదివరకే కోరింది. అయితే, దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కంపెనీలకు ప్రశ్నార్థకంగా మారిన చాలా అంశాలకు ఈ నిబంధనలతో స్పష్టత లభించిందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇండియా టెక్నికల్ అడ్వయిజర్ సంతోష్ జయరామ్ అభిప్రాయపడ్డారు. నిబంధనల సారాంశమిదీ... సీఎస్ఆర్ నిబంధనల ప్రకారం సామాజిక సంక్షేమ కార్యకలాపాలకు కంపెనీలు తప్పకుండా తమ లాభాల్లో కొంత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. మూడేళ్ల సగటు వార్షిక లాభాల ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరం లాభాల్లో కనీసం 2 శాతాన్ని సీఎస్ఆర్కు ఖర్చుచేయాలి. కనీసం 500 కోట్ల నెట్‌వర్త్ లేదా రూ.1,000 కోట్ల టర్నోవర్ లేదా కనీసం రూ. 5 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తున్న కంపెనీలన్నీ సీఎస్ఆర్కు కచ్చితంగా వ్యయం చేయాల్సి వస్తుంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు లెక్క. దేశంలోనే ఈ సీఎస్ఆర్ కార్యకలాపాలు చేపట్టాలి. భారత్‌లో రిజిస్టర్ అయిన విదేశీ కంపెనీలకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయి. కాగా, విదేశీ శాఖల నుంచి లభించే లాభాలు, దేశీయంగా ఉన్న ఇతర అనుబంధ కంపెనీల నుంచి వచ్చే డివిడెండ్లను సీఎస్ఆర్ విషయంలో ఒక కంపెనీ నికర లాభాలను లెక్కించేటప్పుడు పరిగణనలోకి తీసుకోకుండా వెసులుబాటు ఇచ్చారు. రిజిస్టర్డ్ ట్రస్ట్ లేదా సొసైటీ లేదా ప్రత్యేక కంపెనీ ద్వారా కూడా కంపెనీలు సీఎస్ఆర్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం ఇతర కంపెనీలతో భాగస్వామ్యాన్ని కూడా ఏర్పాటుచేసుకోవచ్చు. అయితే, ఇలాంటి ప్రాజెక్టుల్లో వ్యయాన్ని ప్రత్యేకంగా చూపించాల్సి ఉంటుంది. సీఆర్ఆర్ ప్రాజెక్టులు/కార్యకలాపాలు/ప్రోగ్రామ్స్‌కు కేటాయించిన నిధుల్లో మిగులును కంపెనీలు తిరిగి తమ వ్యాపార లాభాల్లోకి మళ్లించబోమని సీఎస్ఆర్ పాలసీల్లో హామీనివ్వాల్సి ఉంటుంది. సీఎస్ఆర్ పనుల కోసం కంపెనీలు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవచ్చు. అయితే, ఈవిధమైన సిబ్బందిపై వ్యయం ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం సీఎస్ఆర్ ఖర్చులో 5 శాతం వరకూ మాత్రమే అనుమతిస్తారు. తాజా నిబంధనల అమలులో పారదర్శకత కోసం కంపెనీలు సీఎస్ఆర్ కార్యకలాపాల ద్వారా చేపట్టిన పనులను తమ వెబ్సైట్లలో పొందుపరచాల్సి ఉంటుంది. అయితే, రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇచ్చే విరాళాలు, నిధులు; కంపెనీలోని సొంత సిబ్బంది(వారి కుటుంబ సభ్యులు సహా) ప్రయోజనాల కోసం వెచ్చించిన సొమ్ము ఈ సీఎస్ఆర్ వ్యయం కిందికి రాదు. ఈ విధానం పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక సీఎస్ఆర్ కమిటీని కంపెనీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సీఎస్ఆర్ కింద ఏ పనులు చేపట్టాలి... నిబంధనల అమలు వంటివన్నీ ఈ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆతర్వాత కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదించాకే ఖర్చు చేయాలి. ఏ పనులను చేపట్టొచ్చు... దేశ సంస్కృతి-సంప్రదాయాల(చరిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న పురాతన కట్టడాలు, ప్రాంతాలు, కళల సంరక్షణ, పునరుద్ధరణ వంటివి) పరిరక్షణ చర్యలు, ప్రజలకోసం గ్రంథాలయాల ఏర్పాటు, సంప్రదాయ కళలు, హస్తకళాకృతుల అభివృద్ధి-ప్రోత్సాహానికి పాటుపడే పనులు కంపెనీల సీఎస్ఆర్ కార్యకలాపాల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ధి, సోమాజికాభివృద్ధి ప్రాజెక్టులు; ఆరోగ్య సంరక్షణ, సురక్షితమైన తాగునీటి కల్పన, పారిశుధ్య పనులు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎదురవుతున్న అసమానతల తగ్గింపు లక్ష్యంగా చేపట్టే విభిన్న కార్యక్రమాలు. మాజీ సైనికోద్యోగులు, యుద్ధంలో భర్తను కోల్పోయిన వితంతువులు, వాళ్ల కుటుంబీకులకు చేదోడుగా నిలిచే చర్యలు. మహిళలు, అనాథలకు ఇళ్లు, హాస్టళ్ల ఏర్పాటు; వయసు మళ్లిన వారికోసం ప్రత్యేక వసతుల(ఓల్డేజ్ హోమ్స్, డే కేర్ సెంటర్లు వంటివి) కల్పన. ఆగ్రో-ఫారెస్ట్రీ, అడవుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, పశు సంవర్థకం, సహజ వనరుల సంరక్షణ; నీరు-గాలి-మట్టి నాణ్యతను కాపాడే చర్యలు. గ్రామీణ ఆటలు, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన క్రీడలు, పారాలింపిక్(అంగవైకల్యం ఉన్నవాళ్లకు) స్పోర్ట్స్, ఒలింపిక్ స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం, శిక్షణ కార్యక్రమాలు, ఇతరత్రా.