న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో ఎవ్వరూ క్లెయిమ్ చేయని రూ.48,461.44 కోట్లను 2023 మార్చి 31వ తేదీ నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏఎఫ్)కు బదలాయించినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. 16,79,32,112 కోట్లకు ఈ నిధులు సంబంధించినవని కూడా ఆయన తెలిపారు.
రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. కార్పొరేట్ వ్యవహారా శాఖ సహాయమంత్రి కూడా అయిన కరాద్ చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు...
►ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్) వద్ద ఉన్న నిధులు మొత్తం (31 మార్చి 2023 నాటికి) రూ.5,715 కోట్లు.
►2018లో దేశం నుంచి పారిపోయిన ఆర్థిక నేరస్తులపై చట్టం అమల్లోకి వచ్చింది. 2023 ఆగస్టు 2వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపిన సమాచారం ప్రకారం, ఎనిమిది మంది ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు దేశం నుంచి పారిపోయారు. ఆగస్టు 2 నాటికి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల నేరాలకు సంబంధించి రూ. 34,118.53 కోట్ల జప్తు జరిగింది. అందులో రూ. 15,838.91 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. జప్తయిన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిధిలో ఉంచడం జరిగింది.
►ఉద్దేశపూర్వక ఎగవేతదారులు రాజీ పరిష్కారాన్ని అమలు చేసిన తర్వాత 12 నెలల వరకు తాజా రుణాన్ని పొందలేరు.
►జూలై 1 నాటి ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి ఆర్‌బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, ఉద్దేశపూర్వక ఎగవేతదారు లేదా మోసం అని వర్గీకరణ కిందకు చేరినవారు రుణగ్రహీతలకు శిక్షార్హులు అవుతారు.
►రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ రుణ పరిమాణం కలిగిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు (ఎస్‌సీబీ), అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లు (యూసీబీ), రూ. 5 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తం రుణాలకు సంబంధించి రుణగ్రహీతల నిర్దిష్ట క్రెడిట్ సమాచారాన్ని సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్‌కు(సీఆర్‌ఐఎల్‌సీ) తెలియజేయాలి.
►ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎన్‌బీ) ఫిబ్రవరి 2023 నాటికి గడచిన 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆపరేట్ చేయని దాదాపు రూ.35,012 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కి బదిలీ చేశాయి. ఇవి దాదాపు రూ.10.24 కోట్ల అకౌంట్లకు సంబంధించినవి. సంబంధిత బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి.
చదవండి👉 బ్యాంకుల్లో 'అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్', అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్ చేసుకోండిలా!
Comments
Please login to add a commentAdd a comment