న్యూఢిల్లీ: ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త కంపెనీలు నమోదయ్యాయి. నవంబర్ చివరికి 1,96,028 కంపెనీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్‌లు (ఎల్‌ఎల్‌పీ) కొత్తగా ఏర్పాటైనట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రితం ఏడాది ఇలా ఏర్పాటైనవి 1.88 లక్షలుగా ఉన్నాయి. సులభతర నిబంధనల అమలు, సులభతర వ్యాపార నిర్వహణపై తమ దృష్టి కొనసాగుతుందని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది.
2023 మే నుంచి ‘సెంట్రల్ ప్రాసెసింగ్ ఫర్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్’ (సీ–పేస్) అమల్లోకి వచ్చినట్టు గుర్తు చేసింది. కాంపిటీషన్ చట్టానికి, కంపెనీల చట్టంలోని పలు నిబంధనలకు సవరణలు చేసినట్టు పేర్కొంది. కంపెనీల నిబంధనలకు చేసిన సవరణలతో కంపెనీల విలీనాలకు రీజినల్ డైరెక్టర్లు వేగంగా అనుమతులు ఇవ్వడం సాధ్యమవుతుందని తెలిపింది. చురుకైన, సమర్థవంతమైన, ప్రతిస్పందించే కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించడమే ఈ చర్యల ఉద్దేశ్యమని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment