
చైనా, జపాన్ కంపెనీలకూ చోటు
నూతన రాజధాని అమరావతిలో ఇప్పటికే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు పాగా వేయగా తాజాగా చైనా, జపాన్‌కు చెందిన కంపెనీలు రంగ ప్రవేశం చేయనున్నాయి.
- రాజధానిలో సింగపూర్ కంపెనీలకు ఇవి అదనం..
-12న సీఆర్‌సీసీ బృందంతో కేంద్ర మంత్రులు అశోక్, సుజన భేటీ
సాక్షి, హైదరాబాద్ : నూతన రాజధాని అమరావతిలో ఇప్పటికే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు పాగా వేయగా తాజాగా చైనా, జపాన్‌కు చెందిన కంపెనీలు రంగ ప్రవేశం చేయనున్నాయి. చైనా రైల్వే కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(సీఆర్‌సీసీ) అమరావతిలో ప్రవేశానికి ఆసక్తి చూపింది. ఇటీవల సీఎం చైనా పర్యటన సందర్భంగా రాజధానిలో అవసరమైన భూములతో పాటు పలు ఆర్థికపరమైన రాయితీలు ఇస్తామని, ప్రాజెక్టులను చేపట్టాలని కోరారు. ఇందులో భాగంగా సీఆర్‌సీసీ ఉన్నతస్థాయి బృందం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల కోసం ఈ నెల 12వ తేదీన ఢిల్లీ వస్తోంది.ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలను పాల్గొనాలంటూ సీఎంవో ప్రత్యేక నోట్ జారీ చేసింది. వారితో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్, మౌలిక వసతుల కల్పన, జలవనరుల శాఖల ఉన్నతాధికారులు, సీఆర్‌డీఏ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ రైల్వే సలహాదారు ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
సీసీడీఎంసీలో భాగస్వామిగా జపాన్ సంస్థ : కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ)లో భాగస్వామిగా జపాన్‌కు చెందిన జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ (జెబీఐసీ) చేరేందుకు ఉత్సాహం చూపుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏప్రిల్ 29న జపాన్ మంత్రితో సీఎం చంద్రబాబు మధ్య చర్చలు సాగాయి. జెబీఐసీ అమరావతిలో చేపట్టనున్న బిజినెస్ ప్రణాళికను సమర్పించిన తరువాత ఆ ప్రణాళికను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.