
మహిళలకు భద్రంగా పని ప్రదేశాలు..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్ కంపెనీలు తమ ప్రాంగణాల్లో జరిగే లైంగిక వేధింపులు కేసుల వివరాలను ఇకపై వార్షిక నివేదికల్లో పొందుపరచాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీల (అకౌంట్స్) నిబంధనలు, 2014ను సవరించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ వినతి మేరకు ఈ మార్పులు చేపట్టారు.
ప్రైవేట్ రంగంలో పని ప్రదేశాలను మహిళలకు సురక్షితంగా మలిచే క్రమంలో ఈ చర్య ఆహ్వానించదగినదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్వాగతించారు.
కార్యాలయాల్లో మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులపై ఫిర్యాదులు,కేసుల వివరాలు చేపట్టిన చర్యలను వార్షిక నివేదికల్లో పొందుపరచని కంపెనీలపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.