
ప్రయివేట్ డివిడెండ్లదే పైచేయి
డివిడెండ్లను పెంచడంలో ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేటు కంపెనీలే జోరుమీదున్నాయి.
ముంబై: డివిడెండ్లను పెంచడంలో ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేటు కంపెనీలే జోరుమీదున్నాయి. ప్రైవేటు కంపెనీలు చెల్లించిన డివిడెండ్ల పరిమాణం గత నాలుగేళ్లలో సగటున ఏటా 22.5 శాతం పెరిగింది. పీఎస్‌యూల విషయంలో ఇది 16.7 శాతమే. బీఎస్‌ఈ 200 కంపెనీల డివిడెండ్లను విశ్లేషించినపుడు వెల్లడైన అంశాలివీ...
- 2012-13లో పీఎస్‌యూలు రూ.46,198 కోట్ల డివిడెండ్ చెల్లించాయి. మొత్తం 36 పీఎస్‌యూల్లోని టాప్ 5 కంపెనీల డివిడెండే ఇందులో 60% అంటే రూ.27,325 కోట్లు.
- కోల్ ఇండియా ఇటీవలే రూ.18,371 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. గతంలోని రూ.8,843 కోట్లతో పోలిస్తే ఇది 207% అధికం. అంతేకాదు, ఓ భారతీయ కంపెనీ ఒకేసారి చెల్లించిన అత్యధిక డివిడెండ్ కూడా ఇదే.
- గత నాలుగేళ్లలో దేశీ కంపెనీల డివిడెండ్ల పరిమాణం ఏటా 20% చొప్పున పెరిగి రూ.1.02 లక్షల కోట్లకు చేరింది. 2008-09లో నికరలాభాల్లో 23%గా ఉన్న ఇవి 2012-13లో 29.8%కు ఎగశాయి.
- డివిడెండ్ చెల్లింపులతో మైనారిటీ షేర్‌హోల్డర్లకు పెద్దగా ప్రయోజనం ఉండడం లేదనీ, ఈ విధానంలో నిలకడను ప్రజలు గమనించాలనీ ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ సోనమ్ ఉదాసీ వ్యాఖ్యానించారు. ‘కంపెనీల డివిడెండ్ చరిత్రను ఇన్వెస్టర్లు పరిశీలించాలి. డివిడెండును ఏ రీతిన పెంచుతున్నాయో గమనించాలి. ఓ కంపెనీ తన భవిష్యత్తుపై ఎంత భరోసాతో ఉందనే అంశాన్ని డివిడెండ్ విధానం వెల్లడిస్తుంది. దేశీ కంపెనీలు సాధారణంగా అభివృద్ధి కోసం మూలధనం అవసరమంటూ లాభాల్లో అధిక మొత్తాన్ని ఉంచేసుకుంటాయని’ ఆయన తెలిపారు. డివిడెండ్ల విషయం ప్రోత్సాహకరంగానే ఉన్నప్పటికీ పెంపు అన్ని రంగాలకూ విస్తరించాల్సి ఉందని విశ్లేషకులంటున్నారు.