PSUs
-
మరో నాలుగు సంస్థలకు నవరత్న హోదా
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది. ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థలైన నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ), ఎస్‌జేవీఎన్ (సట్లజ్ జల విద్యుత్ నిగమ్)లకు నవరత్న హోదా దక్కింది. అలాగే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ), రైల్‌టెల్‌కు సైతం నవరత్న హోదా లభించింది.‘‘ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఆగస్ట్ 30న ఎన్‌హెచ్‌పీసీని నవరత్న కంపెనీగా ప్రకటించింది. ఇది నిర్వహణ, ఆర్థిక పరంగా స్వయంప్రతిపత్తిని తీసుకొస్తుంది’’అని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. కంపెనీకి ఇది చరిత్రాత్మకమని ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ ఆర్కే చౌదరి అభివర్ణించారు.కంపెనీ ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాలకు గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ హోదాతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఎన్‌హెచ్‌పీసీ మినీరత్న కేటగిరీ–1 కంపెనీగా ఉంది. ఎస్‌జేవీఎన్ సైతం మినీతర్న కేటగిరీ –1గా ఉండడం గమనార్హం. -
పథకాల టార్గెట్లు సాధించండి..బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచన
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, సామాజిక భద్రత పథకాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంపై మరింతగా దృష్టి పెట్టాలని బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ), ఆర్థిక సంస్థల చీఫ్‌లతో ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) తదితర పథకాలను సమీక్షించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చేందుకు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ఉద్దేశించిన స్కీములపై ప్రజల్లో అవగాన పెంచేందుకు బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యత క్యాంపులు నిర్వహించే అంశంపైనా చర్చ జరిగినట్లు పేర్కొంది. -
అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పీఎస్‌యూలు
నాగ్‌పూర్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) పెద్ద ఎత్తున పాలు పంచుకోనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం పీఎస్‌యూలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేలా న్యూక్లియర్ రంగ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్), ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జాయింట్ వెంచర్లకు వెసులుబాటు కల్పిస్తూ 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దాదాపు అన్ని అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించే ఎన్పీసీఐఎల్ మరింతగా కార్యకలాపాలు విస్తరించేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ, నాల్కో పవర్ కంపెనీ మొదలైన వాటితో జేవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 6,780 మెగావాట్లుగా ఉంది. మరో 21 యూనిట్ల ఏర్పాటుతో 2031 నాటికి దీన్ని 15,700 మెగావాట్లకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. (క్లిక్ చేయండి: ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు) -
లక్షల కోట్లలో.. లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూలు/పీఎస్ఈలు) నికర లాభం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 51 శాతం పెరిగి రూ.2.49 లక్షల కోట్లుగా ఉంది. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, సెయిల్ అత్యధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. 2020–21లో ప్రభుత్వరంగ సంస్థల నికర లాభం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. ఇక నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థల నష్టం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.23వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లకు తగ్గింది. అంటే నష్టాన్ని 38 శాతం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ ఇండియా అస్సెట్ హోల్డింగ్స్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ ఎక్కువ నష్టాలతో నడుస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల స్థూల ఆదాయం 2021–22లో రూ.31.95 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.24.08 లక్షల కోట్లుగా ఉండడం గమనించాలి. అంటే ఏడాదిలో 33 శాతం వృద్ధి చెందింది. ముఖ్యంగా పెట్రోలియం రిఫైనరీ మార్కెటింగ్, ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్, పవర్ జనరేషన్ కంపెనీలే ఆదాయంలో 69 శాతం వాటా సమకూరుస్తున్నాయి. ప్రభుత్వానికి భారీ ఆదాయం.. 2021–22 సంవత్సరానికి ప్రభుత్వరంగ సంస్థలు ప్రకటించిన డివిడెండ్ రూ.1.15 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ రూ.73వేల కోట్లుగానే ఉంది. ఇక ప్రభుత్వరంగ సంస్థలు ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, కేంద్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు, డివిడెండ్, ఇతర సుంకాల రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 2021–22లో రూ.5.07 లక్షల కోట్ల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4.97 లక్షల కోట్లుగా ఉంది. ఇలా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టిన టాప్–5 కంపెనీల్లో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ ఒమన్ రిఫైనరీస్, చెన్నై పెట్రోలియం ఉన్నాయి. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అర్హులైన కంపెనీలు చేసిన ఖర్చు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,600 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4,483 కోట్లు కావడం గమనార్హం. సామాజిక కార్యక్రమాలకు చేయూతలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్ఎండీసీ, పవర్‌గ్రిడ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. -
8 ఏళ్లలో రూ. 4 లక్షల కోట్లు.. డిజిన్వెస్ట్‌మెంట్‌తో కేంద్రం ఆదాయం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ 2014లో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా కేంద్రానికి రూ.4.04 లక్షల కోట్లు వచ్చాయి. 59 సంస్థల్లో ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో వాటాల విక్రయంతో అత్యధికంగా రూ.1.07 లక్షల కోట్లు ఖజానాకు సమకూరినట్లు ఆర్థిక శాఖ మంగళవారం వెల్లడించింది. ఎయిరిండియాతో పాటు 10 కంపెనీల్లో వాటాల విక్రయంతో గత 8 ఏళ్లలో ప్రభుత్వానికి రూ. 69,412 కోట్లు వచ్చాయి. 45 కేసుల్లో షేర్ల బైబ్యాక్ కింద రూ.45,104 కోట్లు లభించాయి. 2014–15 మధ్య 17 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లిస్టయ్యాయి. వీటితో కేంద్రానికి రూ.50,386 కోట్లు వచ్చాయి. వీటిలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా అత్యధికంగా రూ. 20,516 కోట్లు లభించాయి. అటు పారదీప్ ఫాస్ఫేట్, ఐపీసీఎల్, టాటా కమ్యూనికేషన్స్‌లో తనకు మిగిలి ఉన్న వాటాలను కేంద్రం మొత్తం రూ. 9,538 కోట్లకు విక్రయించింది. చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం..! ఆ కార్ల తయారీ నిలిపివేత? -
పీఎస్‌యూ వాటాల విక్రయంపై దృష్టి
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజాలలో కొద్దిపాటి వాటాల విక్రయంపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. ఇంధన దిగ్గజం కోల్ ఇండియా, హిందుస్తాన్ జింక్‌తోపాటు ఎరువుల కంపెనీ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్సీఎఫ్)లను ఇందుకు పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీ స్టాక్ మార్కెట్లు తాజాగా సరికొత్త గరిష్టాలకు చేరిన నేపథ్యంలో ఇందుకు తెరతీయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా జనవరి–మార్చి కాలంలో ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలియజేశాయి. రైల్వే రంగ పీఎస్‌యూసహా 5 కంపెనీలలో 5–10% వాటా విక్రయించే ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫర్ ఫర్ సేల్: పీఎస్‌యూలలో వాటాల విక్రయానికి ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం మార్కెట్లలో ఆశావహ పరిస్థితులు నెలకొన్న కారణంగా ప్రభుత్వానికి కనీసం రూ. 16,500 కోట్లవరకూ లభించవచ్చని అంచనా. ఆర్థిక వ్యవస్థ పటిష్టత, నిధుల సమీకరణ వంటి అంశాలు ప్రభుత్వానికి మద్దతివ్వగలవని నిపుణులు భావిస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో పెరుగుతున్న సబ్సిడీ బిల్లుకు తద్వారా కొంతమేర చెక్ పెట్టవచ్చని విశ్లేషిస్తున్నారు. కాగా.. పీఎస్‌యూ వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 65,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. షేర్లు జూమ్ గత ఏడాది కాలాన్ని పరిగణిస్తే కోల్ ఇండియా షేరు 46%, ఆర్సీఎఫ్ 58% దూసుకెళ్లాయి. ఇక తాజాగా ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా షేరు రూ. 232 వద్ద నిలవగా.. హింద్ జింక్ రూ. 297 వద్ద, ఆర్సీఎఫ్ రూ. 120 వద్ద ముగిశాయి. -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 10 లక్షల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: నిరుద్యోగితపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో పోస్టుల భర్తీపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఖాళీ పోస్టుల వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) సూచించింది. వాటిని సత్వరం భర్తీ చేసేందుకు మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించింది. ఎంట్రీ స్థాయితో పాటు సీనియర్ లెవెల్ ఖాళీల వివరాలను కూడా కేంద్రం అడిగినట్లు ఒక పీఎస్‌యూ సీనియర్ అధికారి తెలిపారు. డిసెంబర్ వరకు గుర్తించిన ఎంట్రీ–లెవెల్ ఖాళీలను వచ్చే ఏడాది ఆగస్టు–సెప్టెంబర్ కల్లా భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు వివరించారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! సాధారణంగా నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శక విధానంలో నియామకాలు చేపట్టాల్సి ఉండటం, దేశవ్యాప్తంగా అభ్యర్థులు పాల్గొనడం వంటి అంశాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో హైరింగ్ ప్రక్రియకు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 255 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ) ఉన్నాయి. వీటిలో 177 సంస్థలు లాభాల్లో ఉన్నాయి. ఇవి 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.89 లక్షల కోట్ల లాభాలు నమోదు చేశాయి. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో యుద్ధప్రాతిపదికన 10 లక్షల మంది ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ వివిధ శాఖలు, విభాగాలకు జూన్‌లో ఆదేశించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) ఖాళీల భర్తీ కోసం కేంద్ర ఆర్థిక శాఖ గత నెలలోనే ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో సమావేశమైంది. దీంతో బ్యాంకులు రిక్రూట్మెంట్ కోసం ప్రకటనలు జారీ చేయడం కూడా మొదలుపెట్టాయి. 2012–13లో పీఎస్బీల్లో 8.86 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2020–21 నాటికి ఇది 7.80 లక్షలకు తగ్గింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
ప్రభుత్వానికి పీఎస్‌యూల డివిడెండ్..తాజాగా రూ. 1,203 కోట్లు జమ
న్యూఢిల్లీ: పీఎస్‌యూల నుంచి డివిడెండ్ రూపేణా కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 1,203 కోట్లు అందుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్ రూపేణా కేంద్రానికి రూ. 14,778 కోట్లు లభించాయి. ప్రధానంగా సెయిల్ నుంచి రూ. 604 కోట్లు, హడ్కో నుంచి రూ. 450 కోట్లు, ఐఆర్ఈఎల్ రూ. 37 కోట్లు చొప్పున దశలవారీగా దక్కినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ఇతర సంస్థలలో ఐఆర్సీటీసీ రూ. 81 కోట్లు, భారతీయ రైల్ బిజిలీ రూ. 31 కోట్లు చొప్పున చెల్లించినట్లు వెల్లడించారు. -
శతమానం భారతి:లక్ష్యం 2047.. పీఎస్‌యూలు
చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి స్వాతంత్య్రాన్ని ఇచ్చి వెళ్లింది బ్రిటిష్ ప్రభుత్వం! మరి నాలుగు డబ్బులెలా చేతిలో ఆడటం? పరిశ్రమలే మనకు ప్రాణాధారాలు అన్నారు జవహర్లాల్ నెహ్రూ. పరిశ్రమలు నెలకొల్పాలంటే ప్రభుత్వమే కానీ, ప్రైవేటు వ్యక్తుల వల్ల కాని పరిస్థితి ఆనాటిది. దాంతో ప్రభుత్వమే.. కూడబెట్టుకున్న డబ్బుతో కూడు, గుడ్డ, నీడతో పాటు.. ఆర్థికంగా అండనిచ్చే విధంగా.. ఉపాధి కల్పన, స్వావలంబన సాధించేలా పరిశ్రమల్ని నెలకొల్పింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెట్ వంటి భారీ కంపెనీలను స్థాపించింది. అవి కాస్త పుంజుకోగానే ప్రైవేటు వ్యక్తులూ ధైర్యం చేసి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. అలా వచ్చిన పరిశ్రమలే ‘పీఎస్‌యు’లు. అంటే.. పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కంపెనీలు. వచ్చే పాతికేళ్లలో పీఎస్‌యులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక పురోగతిని సాధించేందుకు ఈ అమృత మహోత్సవాల సందర్భంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రచిస్తోంది. 51 శాతం కన్నా ఎక్కువ ప్రభుత్వ వాటాలు ఉన్న సంస్థలను పీఎస్యూలనీ, 100 శాతం ప్రభుత్వ వాటాలుంటే పీఎస్ఈలనీ అంటారు. నీతి ఆయోగ్ రూపొందించిన జాతీయ ద్రవ్యీకరణ పథం కింద పీఎస్‌యు ఆస్తుల విక్రయం ద్వారా రానున్న ఏళ్లలో 2.5 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. అందుకే 2025 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ అధీనంలోని పీఎస్ఈ ఆస్తుల అమ్మకం ద్వారా మరో మూడు లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని కోరింది. -
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం వాటి మంచి కోసమేనట!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) కేంద్రం వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) అనేది ఆయా సంస్థలను మరింత సమర్థమంతంగా మార్చేందుకు ఉద్దేశించినదే తప్ప వాటి మూసివేతకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 1994–2004 మధ్య కాలంలో ప్రైవేటీకరించిన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుతం ప్రొఫెనల్స్ సారథ్యంలో విజయవంతంగా నడుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. దీపం సదస్సులో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. మరింత పెట్టుబడులు పెట్టి, ఉత్పత్తిని పెంచగలిగి, సమర్థంగా నడిపించగలిగే వారి చేతికి అప్పగించాలనేదే సంస్థల ప్రైవేటీకరణ వెనుక ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా వాటాల విక్రయం కోసం ఐడీబీఐ బ్యాంక్ షిప్పింగ్ కార్పొరేషన్, వైజాగ్ స్టీల్, ఎన్ఎండీసీ తదితర అరడజను సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఎయిరిండియాలో వాటాల విక్రయం సహా ప్రైవేటీకరణ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 13,500 కోట్లు సమీకరించింది. చదవండి: Crypto Currency: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’! -
ఎల్ఐసీ ఐపీవోకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి మార్గం సుగమమైంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌కు సెబీ తాజాగా ఓకే చెప్పింది. వెరసి దరఖాస్తు చేసిన నెల రోజుల్లోగా ఒక కంపెనీ ఐపీవోకు అనుమతించి రికార్డు సృష్టించింది. దీంతో బీమా దిగ్గజంలో 5 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వానికి వీలు చిక్కనుంది. ఎల్ఐసీ లిస్టింగ్ ద్వారా ప్రభుత్వం రూ. 63,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి(2021–22) నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించేందుకు అవకాశమేర్పడింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఐపీవో చేపట్టడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు అధికారిక వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి. పూర్తి వాటా... ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం(దాదాపు 632.5 కోట్ల షేర్లు) వాటా ఉంది. ఐపీవోలో భాగంగా 5 శాతం వాటా(31.6 కోట్ల షేర్లు)ను విక్రయానికి ఉంచనుంది. ఎల్ఐసీ ఉద్యోగులకు, పాలసీదారులకు ఐపీవో ధరలో డిస్కౌంటును ఆఫర్ చేయనుంది. గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ అంతర్గత విలువను మిల్లిమన్ అడ్వయిజర్స్ రూ. 5.4 లక్షల కోట్లుగా మదింపు చేసింది. దీంతో రూ. 16 లక్షల కోట్ల మార్కెట్ విలువను పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఎల్ఐసీ లిస్టయితే అతిపెద్ద ఐపీవోగా రికార్డు నెలకొల్పనుంది. 2021లో రూ. 18,300 కోట్ల సమీకరణకు వచ్చిన పేటీఎమ్ ప్రస్తుతం అతిపెద్ద ఇష్యూగా నమోదైన విషయం విదితమే. అంతక్రితం 2010లో కోల్ ఇండియా రూ. 15,500 కోట్లు, 2008లో రిలయన్స్ పవర్ రూ. 11,700 కోట్లు సమీకరించడం ద్వారా భారీ ఐపీవోలుగా నిలిచాయి. -
జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు త్వరలో తీపికబురు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ(పిఎస్‌యు) జనరల్ ఇన్స్యూరెన్స్ లో పనిచేసే ఉద్యోగులు చివరకు రాబోయే కొద్ది రోజుల్లో 15 శాతం వేతన సవరణ జరిగే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. 60 వేల మంది పిఎస్‌యు ఉద్యోగులకు వేతనాల సవరణలు 2021లో జరగనున్నాయి. అంటే రాబోయే రోజుల్లో వీరికి గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. వేతన సవరణ సాధారణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు చివరిసారిగా 2017లో వేతన సవరణ జరిగింది. అందువల్ల, వేలాది మంది ఉద్యోగులు తమ వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల, జీఐపీఎస్‌ఏ ఛైర్మన్, న్యూ ఇండియా అస్యూరెన్స్ సీఎండీ అతుల్ సహాయ్ మాట్లాడుతూ.. " వేతన సవరణ సమస్య త్వరలో పరిష్కరించబడుతుంది. డిసెంబర్లో ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. కానీ, ఉద్యోగులు బకాయిల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన ఉద్యోగుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారని నివేదిక తెలిపింది. ప్రస్తుతం సాధారణ బీమా రంగంలో నాలుగు పిఎస్‌యులు ఉన్నాయి. అని నేషనల్ ఇన్స్యూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్. 60,000 మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలలో పనిచేస్తున్నారు. నాలుగు సంస్థలలో న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, ఇది ఒకటి మాత్రమే మంచి ఆర్థిక స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. మార్కెట్ వాటా తగ్గడం, ప్రైవేట్ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా మిగిలిన బీమా కంపెనీలు ప్రస్తుతం ఆర్థికంగా నష్టపోతున్నాయి. (చదవండి: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా భారత్.. లక్షల కోట్ల బిజినెస్!) -
ఓఎన్జీసీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 772 శాతం దూసుకెళ్లి రూ. 4,335 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 497 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఈ క్యూ1లో ఉత్పత్తి తగ్గినప్పటికీ చమురు ధరలు రెట్టింపునకుపైగా పుంజుకోవడం ప్రభావం చూపింది. స్థూల ఆదాయం సైతం 77 శాతం జంప్‌చేసి రూ. 23,022 కోట్లకు చేరింది. కాగా.. ముడిచమురుపై ప్రతీ బ్యారల్‌కు 65.59 డాలర్ల చొప్పున ధర లభించినట్లు కంపెనీ పేర్కొంది. గత క్యూ1లో బ్యారల్‌కు 28.87 డాలర్ల ధర మాత్రమే సాధించింది. అయితే ధరలు తగ్గడంతో గ్యాస్‌పై ఒక్కో ఎంబీటీయూకి 1.79 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. ఉత్పత్తి తగ్గింది. క్యూ1లో ఓఎన్జీసీ 5 శాతం తక్కువగా 5.4 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 4 శాతంపైగా నీరసించి 5.3 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పరిమితమైంది. సొంత క్షేత్రాల నుంచి 4.6 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేయగా.. జేవీల ద్వారా 0.55 ఎంటీని వెలికితీసింది. ఇక సొంత క్షేత్రాల నుంచి 5.1 బీసీఎం గ్యాస్ ఉత్పత్తి నమోదుకాగా.. ఇతర ఫీల్డ్స్ నుంచి 0.2 బీసీఎం సాధించింది. -
బీఎస్ఎన్ఎల్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం దాదాపు 2 శాతం నీరసించి రూ. 18,595 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 18,907 కోట్ల ఆదాయం సాధించింది. మార్చికల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 59,140 కోట్ల నుంచి రూ. 51,687 కోట్లకు వెనకడుగు వేసింది. కంపెనీ నికర రుణ భారం రూ. 21,675 కోట్ల నుంచి రూ. 27,034 కోట్లకు పెరిగింది. -
ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష్యం దిశగా పెట్టుబడుల ఉపసంహరణ
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సోమవారం ఆన్లైన్ వేదికగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు బ్యాంకులు, ఒక బీమా కంపెనీతోసహా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా 2021–22లో రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ‘వరుసగా ఎనమిది నెలలుగా ప్రతి నెలా రూ.లక్ష కోట్లకుపైగా జీఎస్టీ వసూలవుతోంది. వినియోగం పెరుగుతోందనడానికి ఇదే ఉదాహరణ. వృద్ధికి ఇది సానుకూల సంకేతం. కోవిడ్–19 తొలి దశతో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉంది. ఈ సంవత్సరం లక్ష్యాలను సాధించడానికి చాలా ప్రాధాన్యత ఉంది. రూ.1.75 లక్షల కోట్లలో పెద్ద మొత్తం ఎల్ఐసీ ఐపీవోతోపాటు భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) ప్రైవేటీకరణ ద్వారా సమకూరనుంది. ప్రైవేటీకరణ కోసం 2021–22 గుర్తుండిపోయే సంవత్సరంగా భావిస్తున్నాను. మాకు ఇంకా తొమ్మిది నెలలు ఉన్నాయి. లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం ఉంది. ఉచితాల కోసం ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థకు కేవలం రూ.0.98 మాత్రమే సమకూరుస్తుంది.. అదే మూలధన వ్యయానికి ఉపయోగించినప్పుడు ఇది రూ.4.50లుగా ఉంది’ అని వివరించారు. చదవండి: బ్యాంకులకు కీలక సూచనలు చేసిన ఎస్బీఐ డిప్యూటీ ఎండీ -
బ్యాంక్ ఆఫ్ ఇండియా టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది(2020–21) చివరి క్వార్టర్లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 250 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 3,571 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. స్టాండెలోన్ ఫలితాలివి. అయితే మొత్తం ఆదాయం రూ. 12,216 కోట్ల నుంచి రూ. 11,380 కోట్లకు క్షీణించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 2,160 కోట్ల స్టాండెలోన్ లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 2,957 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 49,066 కోట్ల నుంచి రూ. 48,041 కోట్లకు వెనకడుగు వేసింది. క్యూ4లో తాజా స్లిప్పేజెస్ రూ. 7,368 కోట్లను తాకగా.. మొత్తం ప్రొవిజన్లు 70 శాతం తక్కువగా రూ. 1,844 కోట్లకు పరిమితమయ్యాయి. మార్జిన్లు డీలా మార్చికల్లా బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 14.78 శాతం నుంచి 13.77 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.88 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఏకే దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది స్థూల ఎన్పీఏలను 2.5 శాతంవరకూ తగ్గించుకోనున్నట్లు చెప్పారు. అయితే దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.18 శాతం నుంచి 2.16 శాతానికి నీరసించాయి. ఈ ఏడాది మార్జిన్లను 2.5 శాతానికి మెరుగుపరచుకోనున్నట్లు దాస్ తెలియజేశారు. కనీస మూలధన పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 13.1 శాతం నుంచి 14.93 శాతానికి బలపడింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 82.3 వద్ద ముగిసింది. ఈ కౌంటర్లో రెండు ఎక్సే్చంజీలలోనూ కలిపి దాదాపు 5 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! -
ఈ ఏడాదిలోనే ప్రైవేటీకరణ పూర్తి!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ పలు సవాళ్లు విసురుతున్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22)లోగా ఎంపిక చేసిన పీఎస్‌యూల ప్రైవేటీకరణను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ తదితరాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ దిగ్గజాలలో ఇప్పటికే వాటా విక్రయ(డిజిన్వెస్ట్‌మెంట్) సన్నాహాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుత ఏడాది ముగిసేలోగా ప్రయివేటైజేషన్‌ను పూర్తి చేయాలని కాంక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే మహమ్మారి కారణంగా ప్రయాణాలపై ఆంక్షలకు తెరలేచిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీల కొనుగోలుకి సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదికలను రూపొందించడం తదితర అంశాలకు విఘాతం కలుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే సెప్టెంబర్ నుంచీ పరిస్థితులు అనుకూలించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రయివేటైజేషన్ ప్రక్రియలో రెండో దశకు చేరిన కంపెనీల జాబితాలో ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్‌తోపాటు.. పవన్ హంస్, బీఈఎంఎల్, ఎన్ఐఎన్ఎల్ చోటు చేసుకున్నాయి. ఈ సీపీఎస్ఈలలో వాటా కొనుగోలుకి ఇప్పటికే పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం(ఈవోఐ) చేశాయి. ఈ ఏడాదిలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే రూ. 32,835 కోట్లు అధికంకాగా.. తాజా లక్ష్యంలో రూ. లక్ష కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో వాటా విక్రయం ద్వారానే సమీకరించాలని ఆశిస్తుండటం గమనార్హం! -
‘ప్రైవేటు’తో అంబేడ్కర్ ఆశయాలకు గండి
భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జన్మదినోత్సవం అంటే ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ చాలా ముఖ్యమైంది. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సాధించాల్సిన భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు వెన్నెముక వంటివి. వాటిని నాశనం చేయడానికి కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ విధానాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వాలు 1991 నుండి డిజిన్వెస్టుమెంటు పేరుతో కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రభుత్వ వాటాలను 24 శాతం, 49 శాతం, 74 శాతం చొప్పున ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకొంటూ వస్తున్నాయి. ఇప్పుడు 100 శాతం వాటాలను, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలనే స్వదేశీ విదేశీ మల్టీ నేషనల్ కంపెనీలకు అప్పనంగా అప్పగించడానికి మోదీ ప్రభుత్వం తెగబడింది. 2021–22 కేంద్ర బడ్జెట్‌ని సమర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 24న ఒక వెబినార్‌లో సందేశం యిస్తూ ‘ప్రభుత్వం బిజినెస్ చేయకూడదు, బిజి నెస్ సంస్థలను మోనిటర్ చేయడం, వాటికి అవసరమైన వసతులు, సదుపాయాలు సమకూర్చడం వరకే ప్రభుత్వం పరిమితం కావాలి’ అని చెప్పుకొచ్చారు. ప్రధాని వ్యాఖ్య భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన బీఆర్ అంబేడ్కర్ ఆశయానికి అశనిపాతం వంటిది. 1944 ఆగస్టు 24న కలకత్తాలో చేసిన ప్రసంగంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విద్య, పరిశ్రమలకు ప్రథమ ప్రాధాన్యత ఉండాలని అంబేడ్కర్ చెప్పారు. ప్రైవేట్ సంస్థల దోపిడీ నుంచి రక్షణ కోసం పరిశ్రమలు, వ్యవసాయం ప్రభుత్వరంగంలో ఉండాలని రాజ్యాంగ రచనా కమిటీలో అంబేడ్కర్ గట్టిగా వాదించారు. భారత సమాఖ్య తన రాజ్యాంగ సూత్రాల్లో క్రింది చట్టపరమైన అంశాలు ప్రకటించాలని ప్రతిపాదించారు. కీలక పరిశ్రమలు, కీలకంగా ప్రకటించబోయే పరిశ్రమలూ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ప్రభుత్వమే వాటిని నడపాలి. మౌలిక పరిశ్రమలైన వాటిని ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలి. అంబేడ్కర్ సూచనలకు అనుగుణంగా 1948లో బాంబే ప్లాన్ పేరుతో మొదటి పారిశ్రామిక తీర్మానం చేశారు. 1950లో ప్రణాళికా సంఘం ఏర్పర్చారు. 1951లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. 1969లో 14 పెద్ద ప్రైవేట్ బ్యాంకులను, 1980లో మరో 6 బ్యాంకులను జాతీయం చేశారు. 1951లో 5 ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉండగా 2019 మార్చి నాటికి 348కి పెరిగి, దాదాపు రూ. 16.41 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉండేవి. 2018–19లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే రూ. 25.43 లక్షల కోట్లు ఆదాయాన్ని సంపాదించాయి, రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థల్లో అత్యధికం 1990 వరకు లాభాలు గడించాయి. 1990–91 ప్రపంచ ఆర్థిక మాంద్యంలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా భారత ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ప్రభుత్వరంగ సంస్థలే ఆధారం. దేశ స్వావలంబనకు, ప్రజా సంక్షేమానికి పట్టుకొమ్మలుగా అలరారుతున్న సంస్థలను ‘ఆత్మ నిర్భర భారత్‘ పేరుతో అంతం చేయడానికి మోదీ ప్రభుత్వం పూనుకుంది. కష్టపడి సంపాదించి సంసారాన్ని పోషించుకుంటూ భవిష్యత్ తరాల కోసం ఆస్తులను పోగేయడం చేతగానివారు తాతలు కూడబెట్టిన సంపదను తెగనమ్ముకొంటూ బడాయిగా బతుకుతుం టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పని అదే. తొలి ప్రధాని జవహర్ లాల్ నుంచి దేవేగౌడ వరకు నడిచిన ప్రభుత్వాలన్ని ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు ప్రాధాన్యమిచ్చాయి. ఆ తర్వాతి ప్రధాన మంత్రుల ఏలుబడిలో ప్రభుత్వ సంస్థల్లోని పెట్టుబడుల వాటాలను అమ్ముకోవడం మొదలైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించక పోగా 338 సంస్థలను టోకుగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టడానికి చర్యలు చేపట్టింది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుదించుకుపోయి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి హరించుకు పోతుంది. రిజర్వేషన్లు డొల్లగా మారిపోతాయి. 30 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా 25 లక్షల మంది పనిచేసేవారు. నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో.. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడం, డిజిన్వెస్టుమెంటుతో పోస్టులు రద్దు కావడం వలన ఉద్యోగుల సంఖ్య 75% పైగా తగ్గిపోయింది. ఎల్ఐసీ, బ్యాంకులు, కోల్ మైన్స్, రక్షణ రంగ సంస్థలు, ఎయిర్ లైన్స్, హైవేస్, రైల్వేస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వంటి సంస్థల్లో లక్షల మంది ఉద్యోగులున్నారు. వారిలో రిజర్వేషన్ల అమలు వలన సగానికంటే ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతుల వారు వున్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వ నిర్వాకం వలన ప్రభుత్వ రంగ సంస్థలు ఎగిరిపోవడంతో అందరి ఉద్యోగాలతో పాటు బలహీన వర్గాల ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఫలితంగా.. సామాజిక న్యాయం సమసిపోతుంది, అంబేడ్కర్ ఆశయం అంతమవుతుంది. వ్యాసకర్త: నాగటి నారాయణ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు 94903 00577 -
సర్కారీ షేర్లు జిగేల్!
గత నాలుగేళ్లుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకోని ప్రభుత్వ రంగ దిగ్గజాలు కొద్ది రోజులుగా మార్కెట్లను మించుతూ పరుగందుకున్నాయి. తాజా బడ్జెట్లో పలు పీఎస్‌యూలను ప్రైవేటైజ్ చేయనున్నట్లు ప్రతిపాదించడంతో రీరేటింగ్‌కు అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వెరసి కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ పీఎస్‌యూల మార్కెట్ విలువ 28 శాతంపైగా ఎగసింది. వివరాలు చూద్దాం.. ముంబై: ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో కమోడిటీల ధరలు ఊపందుకున్నాయి. మరోవైపు 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పీఎస్‌యూలను ప్రైవేటైజ్ చేసేందుకు ప్రతిపాదించింది. దీనికితోడు గత నాలుగేళ్లుగా మార్కెట్ ర్యాలీని అందుకోకపోవడంతో పలు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు చౌకగా ట్రేడవుతున్నాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లాభదాయకత మెరుగుపడనున్న అంచనాలు, ప్రైవేటైజ్ కారణంగా రీరేటింగ్‌కు పెరిగిన అవకాశాలు కొద్ది రోజులుగా పీఎస్‌యూ కౌంటర్లకు డిమాండును పెంచినట్లు తెలియజేశారు. ప్రభుత్వ రంగంలోని పలు కంపెనీలు కమోడిటీ ఆధారితంకావడం, కొద్ది రోజులుగా కమోడిటీల సైకిల్ అప్టర్న్ తీసుకోవడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్‌నిస్తున్నట్లు వివరించారు. జోరు తీరిలా పలు సానుకూలతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో పీఎస్‌యూ షేర్లు ఇటీవల మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. వెరసి 2021 జనవరి నుంచి చూస్తే పీఎస్‌యూ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 3.84 లక్షల కోట్లమేర జత కలసింది. అంటే గత వారాంతానికల్లా ఈ విలువ 28 శాతం ఎగసి రూ. 19.45 లక్షల కోట్లకు చేరింది. 2017 తదుపరి ఇది అత్యధికంకాగా.. గత రెండు నెలల్లో ప్రామాణిక ఇండెక్స్ ఎన్ఎస్ఈ నిఫ్టీ 6 శాతమే ర్యాలీ చేయడం గమనార్హం! హింద్ కాపర్ స్పీడ్ కొత్త ఏడాదిలో దూకుడు చూపుతున్న ప్రభుత్వ రంగ దిగ్గజాలలో హిందుస్తాన్ కాపర్ ముందుంది. జనవరి– ఫిబ్రవరి మధ్య ఈ షేరు 152 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ఎంఎస్టీసీ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(ఫ్యాక్ట్), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్సీఎఫ్), నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్), ఎన్బీసీసీ ఇండియా, ఇండియన్ బ్యాంక్ 90–60 శాతం మధ్య జంప్‌చేశాయి. -
ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రకటించిన నాలుగు వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై మంత్రుల కమిటీ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్ రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సహా మంత్రులతో ఏర్పాటుకానున్న కమిటీ ఈ నాలుగు రంగాలలో ఎన్ని పీఎస్‌యూలను కొనసాగించేదీ నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ నాలుగు వ్యూహాత్మక రంగాలుగా ఆటమిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సర్వీసులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ రంగాలలో సాధ్యమైనంత తక్కువగానే ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించనున్నట్లు ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఈ అంశంపై నీతి ఆయోగ్ ప్రాథమిక జాబితాను రూపొందిస్తోంది. తద్వారా ప్రభుత్వం వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టనుంది. ఇతర రంగాలను ప్రయివేటైజ్ చేయనుంది. తద్వారా ప్రయివేటైజ్ చేయనున్న కంపెనీలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఐఎన్ఎల్కు కేబినెట్ ఓకే..: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(ఆర్ఐఎన్ఎల్)ను ప్రయివేటైజ్ చేసేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా అనుమతించినట్లు పాండే తాజాగా ట్వీట్ చేశారు. కంపెనీలో 100 శాతం వాటాను విక్రయించేందుకు గత నెల 27న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రయివేటైజేషన్‌లో భాగంగా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నట్లు వివరించారు. ప్రైవేటీకరణ లేదా విలీనం జాతీయ భద్రత, కీలక మౌలికసదుపాయాలు, ఇంధనం, మినరల్స్, ఫైనాన్షియల్ సర్వీసులను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా తాజా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఎంపిక చేశారు. వీటిలో అతి తక్కువగా పీఎస్‌యూలను కొనసాగించే వీలున్నట్లు పాండే తెలియజేశారు. మిగిలిన కంపెనీలను ప్రైవేటీకరించడం, విలీనం, ఇతర సీపీఎస్ఈలకు అనుబంధ సంస్థలుగా మార్చడం లేదా మూసివేయడం వంటివి చేపట్టనున్నట్లు వివరించారు. వెరసి ప్రభుత్వ రంగ కంపెనీలలో భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలియజేశారు. ప్రయివేట్ రంగం నుంచి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021–22)లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయిన్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హంస్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌లో డిజన్వెస్ట్మెంట్ను వేగవంతం చేయనున్నట్లు వివరించారు. -
ధరల మంట- పెట్రోల్ @ఆల్‌టైమ్ హై
న్యూఢిల్లీ, సాక్షి: దాదాపు నెల రోజుల తదుపరి బుధవారం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా మరోసారి బలపడ్డాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఇంధన రంగ పీఎస్‌యూలు ధరలను వరుసగా రెండో రోజు పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై తాజాగా 23 పైసలు, డీజిల్‌పై 26 పైసలు చొప్పున పెంచాయి. బుధవారం సైతం లీటర్ పెట్రోల్ ధరను 26 పైసలు, డీజిల్ ధరను 25 పైసలు చొప్పున పెంచాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20ను తాకింది. డీజిల్ రూ. 74.38కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. ఇది ఆల్‌టైమ్ గరిష్టం కాగా.. ప్రస్తుతం ఈ స్థాయిని ధరలు అధిగమించడం గమనార్హం. ఇక డీజిల్ ధరలైతే 2018 అక్టోబర్ 4న లీటర్‌కు రూ. 75.45 వరకూ ఎగసింది. కాగా.. 2020 మే నెల నుంచి చూస్తే.. పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ. 14.51 పుంజుకోగా.. డీజిల్ ధర రూ. 12.09 ఎగసింది. ఇదే విధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు పెట్రోలియం వర్గాలు ప్రస్తావించాయి. (కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!) ముంబైలో మరింత దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల సంగతి చూస్తే.. ముంబైలో తాజాగా లీటర్ పెట్రోల్ రూ. 90.83ను తాకగా.. డీజిల్ రూ. 81.07కు చేరింది. చెన్పైలో పెట్రోల్ రూ. 86.96కు, డీజిల్ రూ. 79.72కు చేరాయి. కోల్‌కతాలో పెట్రోల్ రూ. 85.68 వద్ద, డీజిల్ రూ. 77.97 వద్ద విక్రయమవుతోంది. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) విదేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లో గత రెండు రోజుల్లో దాదాపు 6 శాతం జంప్‌చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 0.85 శాతం పుంజుకుని 51 డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.7 శాతం ఎగసి 54.67 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించిన టాటా సన్స్
న్యూఢిల్లీ, సాక్షి: గత కేలండర్ ఏడాది(2020)లో దేశీయంగా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రీత్యా అతిపెద్ద ప్రమోటర్‌గా టాటా సన్స్ ఆవిర్భవించింది. తద్వారా పలు పీఎస్‌యూలలో మెజారిటీ వాటాలు కలిగిన కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించింది. 2020 డిసెంబర్ చివరికల్లా టాటా సన్స్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 9.28 లక్షల కోట్లను తాకింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పీఎస్‌యూల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 9.24 లక్షల కోట్లకు పరిమితమైంది. ఏడాది కాలంలో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 34 శాతానికిపైగా బలపడటం విశేషంకాగా. పీఎస్‌యూల విలువ దాదాపు 20 శాతం క్షీణించడం గమనార్హం! వెరసి రెండు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం నిలుపుకుంటూ వస్తున్న టాప్ ర్యాంకును టాటా సన్స్ చేజిక్కించుకున్నట్లు ఆంగ్ల పత్రిక బిజినెస్ స్టాండర్ట్ నివేదిక పేర్కొంది. (జేవీకి.. ఫోర్డ్, మహీంద్రాల ‘టాటా’) ఏడాది కాలంలో.. నిజానికి 2019 డిసెంబర్‌కల్లా ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ రూ. 18.6 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో టాటా సన్స్ గ్రూప్ లిస్టెండ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 11.6 లక్షల కోట్లుగా మాత్రమే నమోదైంది. ఈ సమయంలో టాటా సన్స్ గ్రూప్ కంపెనీల విలువతో పోలిస్తే ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వ కంపెనీల విలువ 67 శాతం అధికంకావడం గమనార్హం! కాగా.. 2020 డిసెంబర్‌కల్లా మొత్తం టాటా సన్స్ గ్రూప్ కంపెనీల విలువ రూ. 15.6 లక్షల కోట్లకు చేరగా.. పీఎస్‌యూలలో కేంద్ర వాటాల విలువ రూ. 15.3 లక్షల కోట్లుగా నమోదైనట్లు నివేదిక పేర్కొంది. -
నష్టాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: స్టాక్ మార్కెట్‌కు నష్టాలు ఒకరోజుకే పరిమితం అయ్యాయి. సూచీలు మళ్లీ రికార్డుల బాట పట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడంతో పాటు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఎఫ్ఎంజీసీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 139 పాయింట్లను ఆర్జించి 46 వేలపైన 46,099 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లను ఆర్జించి 13,514 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీ, ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,310 వద్ద గరిష్టాన్ని, 45,706 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,579–13,403 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,359 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1019 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 255 పాయింట్లను ఆర్జించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 604 పాయింట్ల రేంజ్లో, నిఫ్టీ 176 పాయింట్ల పరిధిలో కదలాడాయి. ప్రభుత్వ రంగ కంపెనీ కౌంటర్లలో సందడి..: కొన్ని రోజులుగా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్న ప్రభుత్వరంగ కంపెనీల కౌంటర్లో శుక్రవారం సందడి నెలకొంది. ఫలితంగా ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గెయిల్, కోల్ ఇండియా షేర్లు 5 శాతం నుంచి 3 శాతం దాకా లాభపడ్డాయి. ఆరుశాతం పెరిగి స్పైస్‌జెట్... స్పైస్‌జెట్ కంపెనీ షేరు బీఎస్ఈలో ఆరుశాతం లాభపడింది. కోవిడ్–19 వ్యాక్సిన్ల సరఫరాకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో ఎనిమిది శాతం ర్యాలీ రూ.108 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 6.52 శాతం లాభంతో రూ. వద్ద స్థిరపడింది. బర్గర్ కింగ్ లిస్టింగ్ సోమవారం: గతవారంలో పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న బర్గర్ కింగ్ షేర్లు సోమవారం స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
ప్రభుత్వరంగ షేర్లలో అనూహ్య ర్యాలీ ఎందుకంటే..?
బీపీసీఎల్‌తో సహా సుమారు 12 ప్రభుత్వరంగ షేర్లు శుక్రవారం 5శాతం నుంచి 13శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ ఆయిల్ దిగ్గజ కంపెనీలు బీపీసీఎల్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇది అండర్వాల్యూ వేయబడిన పీఎస్‌యూ స్టాక్స్‌ల రీ-రేటింగ్‌కు దారీతీయవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు పీఎస్‌యూ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా నిన్న మార్కెట్ ముగిసేసరికి బీపీఎసీఎల్ 12.50శాతం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ 12శాతం, భారత్ డైనమిక్స్, చెన్నై పెట్రోలియం, హెచ్‌పీసీఎల్, హిందూస్థాన్ కాపర్, ఎన్బీసీసీ షేర్లు 10శాతం నుంచి 5శాతం లాభడపడ్డాయి. ఈ అంశాలూ సహకరించాయ్: వ్యూహాత్మక వాటాల ఉపసంహరణతో పాటు, మెరుగైన వాల్యుయేషన్ లిక్విడిటీ కూడా పీఎస్‌యు స్టాక్స్‌ల ర్యాలీని నడిపించాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. హెచ్‌పీసీఎల్, ఇక్రాన్ ఇంటర్నేషనల్, బీఈఎంఎల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, ఎన్ఎండీసీ షేర్లు ప్రస్తుతం వాటి బుక్ వాల్యూ వద్ద లేదా బుక్‌వాల్యూ దిగువునన ట్రేడ్ అవుతున్నాయి. అన్ని ఓఎంసీలకు కలిసొస్తుంది: రిలయన్స్ సెక్యూరిటీస్ పెట్రోల్, డీజిల్‌పై అధిక నికర మార్కెటింగ్ మార్జిన్ల ద్వారా పటిష్టమైన ఫైనాన్సియల్ కొనసాగిస్తూ బీపీసీఎల్‌లో అధిక వ్యాల్యూను పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అధిక నికర మార్కెటింగ్ మార్జిన్లు కేవలం బీపీసీఎల్‌కు మాత్రమే లాభాన్ని చేకూర్చడమే కాకుండా, హెచ్‌పీసీఎల్, ఆయిల్ కార్పోరేషన్ ఇండియాతో పాటు అన్ని అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సానుకూలమే అవుతుందని రియలన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. బిడ్ల దాఖలకు చివరి తేది పొడగింపు: బీపీసీఎల్‌లో 51శాతం నియంత్రణ వాటాను దక్కించుకునేందుకు గ్లోబల్ ఇంధన సంస్థలైన సౌదీ అరేబియాకు చెందిన ఆర్కామ్కో, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్,, ఎగ్జాన్ మొబిల్, అబుధబీ నేషనల్ ఆయిల్ తదితరాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల బీపీసీఎల్ వాటా కోసం ముగింపు బిడ్ల తేదీని జూలై 31కు పొడిగించింది. బీపీసీఎల్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .96,000 కోట్లుగా ఉంది. వాటాను చేజిక్కుంచుకునేందుకు కంపెనీలు సమర్పించిన బిడ్ విలువ రూ.1.2లక్షల కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
విదేశీ ఆసక్తి: చమురు షేర్లకు డిమాండ్
ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో వాటా కొనుగోలుకి గ్లోబల్ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్న వార్తలతో పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్ కంపెనీ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు తొలుత 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 39 ఎగసి రూ. 433 ఎగువన ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. ఉదయం 11.40 కల్లా ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 1.6 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీలో భాగంకావడంతో బీపీసీఎల్ కౌంటర్.. తదుపరి సర్క్యూట్ నుంచి రిలీజ్అయ్యింది. ప్రస్తుతం 11 శాతం ఎగసి రూ. 437 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 442ను తాకింది. 2 రోజులుగా.. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో గత రెండు రోజుల్లో బీపీసీఎల్ షేరు 14 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఈ బాటలో ప్రస్తుతం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 224 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) సైతం 3 శాతం లాభపడి రూ. 87 వద్ద కదులుతోంది. ఇతర వివరాలు చూద్దాం.. సౌదీ అరామ్కో.. ఇంధన రంగ పీఎస్‌యూ.. బీపీసీఎల్‌లో వాటా విక్రయానికి ప్రభుత్వం ఇటీవల ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలుకి ఆసక్తి ఉన్న కంపెనీలకు ఆహ్వానం(ఈవోఐ) పలికింది. ఇందుకు ఈవోఐలను దాఖలు చేసేందుకు ఈ నెల(జులై) 31వరకూ గడువు ఇచ్చింది. బీపీసీఎల్ కొనుగోలుకి విదేశీ ఇంధన దిగ్గజాలు సౌదీ అరామ్కో, రాస్‌నెఫ్ట్, ఎగ్జాన్ మొబిల్, అబుధబీ నేషనల్ ఆయిల్ తదితరాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం బీపీసీఎల్‌లో ఉన్న 114.9 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. వెరసి 52.98 శాతం వాటా విక్రయం ద్వారా కొనుగోలుదారుకు యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనుంది. అయితే నుమాలిగఢ్ రిఫైనరీలో బీపీసీఎల్‌కున్న 61.65 శాతం వాటాను మరో ఆయిల్ పీఎస్యూకు ప్రభుత్వం బదిలీ చేయనుంది. -
ఎప్పట్లోగా కడతారో చెప్పండి..
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలకు సంబంధించిన (ఏజీఆర్) బకాయీలను ఎప్పట్లోగా, ఎలా చెల్లిస్తారో స్పష్టమైన ప్రణాళిక సమర్పించాలంటూ టెలికం సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే పూచీకత్తులు కూడా ఇవ్వాలని సూచించింది. టెల్కోలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. బాకీలు కట్టేందుకు టెల్కోలకు 20 ఏళ్ల గడువు ఇచ్చే అంశంపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. 1999 నుంచి కేసు నలుగుతోందని.. ఈ 20 ఏళ్లలో బాకీలు కట్టనప్పుడు మరో 20 ఏళ్లలో కట్టేస్తారనడానికి గ్యారంటీ ఏమిటని టెల్కోలను ప్రశ్నించింది. వాయిదాల పద్ధతిలో కట్టుకోవడానికి కోర్టు అనుమతించే పరిస్థితి లేదని.. బ్యాంక్ గ్యారంటీలివ్వడానికి టెల్కోలు, వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడానికి ఆయా సంస్థల డైరెక్టర్లు గానీ సిద్ధంగా ఉన్నారేమో తెలియజేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. సవరించిన ఆదాయాల ఫార్ములా ప్రకారం టెల్కోలు బాకీలు కట్టేలా సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. టెలికం శాఖ లెక్కల ప్రకారం భారతి ఎయిర్టెల్ రూ. 43,980 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్ రూ. 16,798 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, టెల్కోలు తమ బాకీలు ఆ స్థాయిలో లేవని చెబుతున్నాయి. స్వీయ మదింపు ప్రకారం ఇప్పటికే కొంత కట్టాయి. ఇది పోగా మిగతా రూ. 93,520 కోట్ల ఏజీఆర్ బాకీలను టెల్కోలు కట్టేందుకు 20 ఏళ్ల దాకా వ్యవధినిచ్చేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. స్పెక్ట్రమే గ్యారంటీ..: వొడాఫోన్ ఐడియా తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు కనీసం జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని విచారణ సందర్భంగా ఆ సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు తెలిపారు. టెలికం సంస్థలు వేల కోట్ల రూపాయలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రం, లైసెన్సులనే ప్రభుత్వం గ్యారంటీగా పరిగణించవచ్చని ఆయన చెప్పారు. ఒకవేళ టెల్కోలు బాకీలు కట్టకపోతే వీటిని రద్దు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, స్వీయ మదింపు ప్రకారం ఇప్పటికే 70% కట్టేశామని, ప్రభుత్వంతో సంప్రతించాకా మిగతాది కూడా కట్టేస్తామని భారతి ఎయిర్టెల్ తెలియజేసింది. పీఎస్యూలపై ఆ బాదుడేంటి.. ఇక ఏజీఆర్ బాకీలపై గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) నుంచి రూ. 4 లక్షల కోట్ల బాకీలు రాబట్టేందుకు టెలికం శాఖ చర్యలు తీసుకోవడాన్ని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పీఎస్‌యూలనుంచి బాకీలు రాబట్టేందుకు తమ ఉత్తర్వును ప్రాతిపదికగా తీసుకోవడానికి లేదని పేర్కొంది. ‘ఈ డిమాండ్ నోటీసులను వెనక్కి తీసుకోండి. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది‘ అని స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో ఏజీఆర్ బాకీలపై సుప్రీం ఆదేశాల ప్రకారం.. స్పెక్ట్రం, లైసెన్సులున్న గెయిల్, పవర్‌గ్రిడ్, ఆయిల్ ఇండియా మొదలైన పీఎస్‌యూలు రూ. 4 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికం శాఖ లెక్కేసింది. దీనిపై ఆయా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. -
కరోనా కాలంలో ఎఫ్‌పీఐలు, డీఐఐలు మెచ్చిన రంగమిదే..!
సముద్రాన్ని తుఫాను తాకినపుడు, భూమి సురక్షితమైన ప్రదేశంగా కనిపిస్తుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్‌ను కోవిడ్-19 తాకినపుడు ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ సంస్థలకు ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు సురక్షితమైనవి భావించాయి. ముఖ్యంగా పీఎస్‌యూ కంపెనీలు భారీ స్థాయిలో చెల్లించే డివెడెండ్ చెల్లింపులు వారిని ఆకర్షించాయి. ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్‌ల ఫోర్ట్‌ఫోలియోలో ... ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐఓసీ, బీఈఎల్, హెచ్‌సీఎల్, గెయిల్ ఇండియా, పీఎఫ్సీలు కంపెనీల షేర్లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న ఈ టాప్- 10 పీఎస్‌యూ కంపెనీలు ఫండమెంటల్స్ ఆకర్షణీయంగా ఉండటంతో పాటు జనవరి నుంచి కరెక్షన్కు లోనయ్యాయి. ఈ కంపెనీల్లో ప్రధాన వాటాను ప్రభుత్వం కలిగి ఉండటంతో ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ ఈ కంపెనీల్లో భారీ ఎత్తున వాటాను కొనుగోలు చేశాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొంతశాతం పీఎస్‌యూ స్టాక్స్‌కు కేటాయించడం ఉత్తమం. ఒకవేళ మనం నిఫ్టీ పీఎస్ఈ ఇండెక్స్‌ను పరిశీలిస్తే.., మొత్తం ఇండెక్స్ వెయిటేజీలో 40శాతం ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలున్నాయి. తర్వాత 31శాతం వెయిటేజీ పవర్ కంపెనీలకు, 15శాతం మెటల్ కంపెనీలు కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఈ రంగాలు కీలకం.’’ అని గౌరవ్ తెలిపారు. ఎఫ్ఐపీ మార్చి త్రైమాసిక ఫోర్ట్‌ఫోలియో పరిశీలిస్తే పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీ, కంటైనర్ కార్ప్, హెచ్‌పీసీఎల్, ఆర్ఈసీలు టాప్ షేర్లుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీల మార్చి త్రైమాసిక ఫోర్ట్‌ఫోలియో చూస్తే కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఎన్ఎండీసీ, గెయిల్ ఇండియా, న్యూ అస్యూరెన్స్, జీఐసీలు టాప్ షేర్లుగా ఉన్నాయి. ‘‘ఎఫ్‌పీఐ, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్లు ఎంచుకున్న ఈ కంపెనీలు ఫండమెంటల్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం డిమాండ్ మందగమనంతో ఈ కంపెనీలు కూడా తమ వ్యాపారాలలో గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇటీవల, ప్రభుత్వం ప్రైవేటు రంగ భాగస్వామ్యం, ప్రైవేటీకరణ ద్వారా ఈ సంస్థలలో అధిక సామర్థ్యానికి సహాయపడే ప్రభుత్వ రంగ విధానాన్ని రూపొందించింది. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలకు ఇది సానుకూలంగా ఉన్నప్పటికీ, సమీపకాలంలో ఆర్థిక మందగమనం కారణంగా ప్రభావానికి లోనుకాగలవు.’’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. -
అన్ని రంగాల్లో ప్రైవేటు సంస్థలకు ఎంట్రీ
న్యూఢిల్లీ: కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) గరిష్టంగా నాలుగింటికే పరిమితం చేయనుంది. మిగతావాటన్నింటినీ విలీనం చేయడమో లేదా విక్రయించడమో చేయనుంది. వ్యూహాత్మకయేతర రంగాల్లో పీఎస్‌యూలన్నింటినీ ప్రైవేటీకరించనుంది. ఈ మేరకు కొత్తగా పీఎస్‌యూ విధానాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు ఉద్దేశించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తుది విడత చర్యల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వెల్లడించారు. (జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి) ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పీఎస్‌యూలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరమున్న వ్యూహాత్మక రంగాల వివరాలను త్వరలో నోటిఫై చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ రంగాల్లోనూ ప్రైవేట్ సంస్థలను అనుమతించినప్పటికీ కనీసం ఒక్క పీఎస్‌యూనైనా కొనసాగిస్తారు. ఇక వ్యూహాత్మకయేతర రంగాల్లో పీఎస్‌యూలను సాధ్యాసాధ్యాలను బట్టి తగు సమయంలో ప్రైవేటీకరిస్తామని మంత్రి చెప్పారు. ‘స్వయం సమృద్ధిని సాధించే క్రమంలో దేశానికి సమగ్రమైన విధానం అవసరం. ఇది దృష్టిలో ఉంచుకునే కొత్త పీఎస్‌యూ విధానంలో అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పీఎస్‌యూలు అర్థవంతమైన పాత్ర పోషిస్తున్న వ్యూహాత్మక రంగాల్లో వాటిని కొనసాగిస్తూనే.. అనవసర నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే దిశగా సంఖ్యను మాత్రం కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా నాలుగింటికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా వాటన్నింటినీ హోల్డింగ్ కంపెనీల్లోకి చేర్చడం, విలీనం చేయడం లేదా ప్రైవేటీకరించడం జరుగుతుంది’ అని ఆమె వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా 2020–21లో రూ. 2.10 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యాన్ని సాధించేందుకూ ఇది తోడ్పడనుంది. చిన్న సంస్థలకు ఊరట.. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో వ్యాపారాలు దెబ్బతిని, రుణాలు కట్టలేకపోయిన చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊరట దక్కనుంది. దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి సంబంధించి కనీస బాకీల పరిమాణాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 1 కోటికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే, ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రత్యేకంగా దివాలా పరిష్కార మార్గదర్శకాలను కూడా దివాలా కోడ్‌లోని (ఐబీసీ) సెక్షన్ 240ఎ కింద త్వరలో నోటిఫై చేయనున్నట్లు వివరించారు. ఇక, మహమ్మారి వ్యాప్తి పరిస్థితులను బట్టి కొత్త దివాలా పిటిషన్ల దాఖలును ఏడాది పాటు నిలిపివేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనాపరమైన రుణాల ఎగవేతలను దివాలా కోడ్‌లో (ఐబీసీ) డిఫాల్ట్ పరిధి నుంచి తప్పిస్తూ తగు సవరణలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు, కంపెనీల చట్టం ప్రకారం సాంకేతికంగాను, ప్రక్రియపరంగాను తప్పనిసరైన నిబంధనల పాటింపు విషయంలో స్వల్ప ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల పరిధి నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసు కుంది. కార్పొరేట్ సామాజిక కార్యకలాపాల (సీఎస్ఆర్) వివరాల వెల్లడి లోపాలు, బోర్డు నివేదికల్లో లోటుపాట్లు, ఏజీఎంల నిర్వహణలో జాప్యం వంటి స్వల్ప ఉల్లంఘనలను డిక్రిమినలైజ్ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. విదేశాల్లో నేరుగా లిస్టింగ్.. లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు తమ షేర్లను నేరుగా నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్ చేసుకునేందుకు అనుమతించనున్నట్లు చెప్పారు. దేశీ కంపెనీలకు ఇది భారీ ముందడుగని ఆర్థిక మంత్రి అన్నారు. -
అక్టోబర్ 15 నాటికి బకాయిల చెల్లింపు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్ధల(పీఎస్‌యూ)కు సంబంధించి చేపట్టాల్సిన బకాయిలన్నింటినీ అక్టోబర్ 15 నాటికి పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పీఎస్‌యూ అధిపతులతో జరిగిన భేటీ అనంతరం ఆమె ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ ఏజెన్సీలు, పీఎస్‌యూలకు అందించిన సేవలు, వస్తువుల సరఫరా మరే ఇతర పనులకు సంబంధించి పెండింగ్ బకాయిలను అక్టోబర్ 15లోగా క్లియర్ చేస్తామని మంత్రి వెల్లడించారు. కాగా ఈ సమావేశంలో ఆయిల్ ఇండియా, ఎన్హెచ్ఏఐ, హాల్, ఎన్‌హెచ్‌పీసీ, ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్, హెచ్‌పీసీఎల్, హిందుస్తాన్ పెట్రోలియం తదితర పీఎస్‌యూల అధిపతులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
‘లాభాల్లో కంపెనీలు..ఉద్యోగులకు జీతాల్లేవు’
-
‘లాభాల్లో కంపెనీలు..ఉద్యోగులకు జీతాల్లేవు’
సాక్షి, న్యూఢిల్లీ : పలు ప్రభుత్వ రంగ సంస్ధలు (పీఎస్‌యూ) లాభాలు ఆర్జిస్తున్నా ఆయా సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిమంది పారిశ్రామికవేత్తల లాభాల కోసం ఉద్యోగులను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. హిందుస్ధాన్ ఏరోనాటికల్స్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి పీఎస్‌యూల్లో పరిస్థితి బహిరంగ రహస్యమేనని చెప్పుకొచ్చారు. రాయ్‌బరేలిలోని మోడరన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. లోక్‌సభలో సోనియా మంగళవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ఉటంకించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పండిట్ నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా అభివర్ణిస్తే ఇప్పుడు వాటిలో చాలా దేవాలయాలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఇతర పీఎస్‌యూలను కాపాడాలని, ఉద్యోగులు, వారి కుటుంబాలను గౌరవించాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో కలపాలనే ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయం పట్ల కూడా సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారు. -
పీఎస్‌యూల విక్రయంపై పీఎంఓ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్ధల (పీఎస్‌యూ) వ్యూహాత్మక విక్రయ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. నీతి ఆయోగ్ సూచించిన పీఎస్‌యూల విక్రయంలో సత్వరమే ముందుకెళ్లే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించారు. ఎయిర్ ఇండియా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, బీఈఎంఎల్, స్కూటర్క్ ఇండియా వంటి 35 పీఎస్‌యూలను విక్రయించాల్సిన జాబితాలో నీతి ఆయోగ్ పొందుపరిచింది. నిర్ధిష్ట పీఎస్‌యూ విక్రయాల్లో కొన్ని సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న క్రమంలో వీటిని ఎదుర్కొంటూ అవరోధాలను అధిగమించి, మొత్త విక్రయ ప్రక్రియను వేగిరపరిచేందుకు పీఎంఓ ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మలిదశలో బాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు హిందుస్ధాన్ ఫ్లోరోకార్బన్, హిందుస్ధాన్ న్యూస్‌ప్రింట్, హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్, సెంట్రల్ ఎలక్ర్టానిక్స్ వంటి పలు పీఎస్‌యూల విక్రయ ప్రకియను చేపట్టనున్నారు. -
బ్యాంకు సీఈవోలతో శక్తికాంత దాస్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశమయ్యారు. బ్యాంకింగ్ రంగం నుంచి ప్రభుత్వం ఏమి ఆశిస్తోందో తెలియజెప్పే ఉద్దేశంతో పలు బ్యాంకుల సీఈవోలతో భేటీ అయినట్టు ఆయన వివరించారు. దీంతోపాటు ప్రస్తుత, భవిష్యత్తు అంశాలపై చర్చంచామని సమావేశం అనంతరం శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 2018-19 సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక మానిటరీ పాలసి రివ్యూ ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత ఆధ్వర్యంలో ఇది మొదటి పరపతి విధాన సమీక్ష. మరోవైపు ఈ పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐసీఐసీఐ -వీడియోకాన్ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్‌పై కేసు నమోదు, దాదాపు సగానికిపైగా బ్యాంకులు ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) నిబంధనల కిందికి రావడం తదితర అంశాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ప్రభుత్వ బ్యాంకుల్లో లక్షకు పైగా ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లక్షలాదిమందిని నియమించుకోనున్నాయని తాజా రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా వెల్త్ మేనేజ్మెంట్, ఎనలిటిక్స్, స్ట్రాటజీ, డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్స్ సర్వీసెస్ విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని సమాచారం. టీమ్ లీజ్ అంచనాల ప్రకారం గత రెండేళ్లో చేపట్టిన నియమాకాల కంటే రెట్టింపు కన్నా ఎక్కువే. గత రెండు సంవత్సరాలలో బ్యాంకులు గుమస్తా, మేనేజ్మెంట్ ట్రైనీలు, ప్రొబేషనరీ ఆఫీసర్ల కేటగిరీలో దాదాపు 95వేల మందిని నియమించుకున్నాయి. మొండి బకాయిలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇపుడు అభివృద్ధిలో పోటీపడుతున్నాయి. ఆర్థిక సేవల నిర్వహణా తీరును, కల్చర్‌ను మార్చుకుంటున్నాయనీ, డిజిటల్ మార్కెటింగ్, మొండి బకాయిల వసూళ్లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు ప్రైవేటు/ బహుళజాతి బ్యాంకులకు ధీటుగా వీరికి వేతనాలను ఆఫర్ చేయనున్నాయని సిండికేట్ బ్యాంక్ సీఈవో మృత్యుంజయ్ మహాపాత్ర వ్యాఖ్యలను ఉటింకిస్తూ మీడియా రిపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో సిండికేట్ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరంలో 500మందిని నియమించుకోనుంది. -
పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యామ్నాయాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో (పీఎస్‌యూలు) పెట్టుబడుల ఉపసంహరణ (వాటాల విక్రయం) ద్వారా రూ.80,000 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్రం... మార్కెట్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థల మధ్యే విలీనాలు, కొనుగోళ్లు, షేర్ల బైబ్యాక్ మార్గాలను కేంద్ర ఆర్థిక శాఖ తెరపైకి తీసుకొస్తోంది. 2018–19లో తొలి ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం మూడు పీఎస్‌యూల ఐపీవోలు, భారత్–22 ఈటీఎఫ్ ద్వారా రూ.9,600 కోట్లను సమీకరించింది. తన లక్ష్యంలో భారీ మొత్తాన్ని మిగిలిన ఆరు నెలల కాలంలో చేరుకోవాలి. మార్కెట్లో గడిచిన మూడు, నాలుగు నెలలుగా లిక్విడిటీ పరమైన సమస్య నెలకొందని, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఉన్నంత వరకు, చము రు ధరల మంటలు చల్లారనంత వరకు లిక్విడిటీ పరమైన ఇబ్బందులు కొనసాగొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘‘పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఒకే తరహా వ్యాపారాల్లో ఉన్న పీఎఫ్సీ, ఆర్ఈసీ తరహా ప్రభుత్వరంగ సంస్థల మధ్య కొనుగోళ్లను పరిశీలిస్తున్నాం’’ అని ఆ అధికారి చెప్పారు. జాబితాలోని కంపెనీలు విలీనం, కొనుగోళ్లను వెంటనే ప్రారంభించేందుకు పెట్టుబడుల ఉపసంహరణ విభాగం (దీపం) త్వరలోనే మర్చంట్ బ్యాంకర్ల కోసం బిడ్లను ఆహ్వానించనుంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)లో తనకున్న 65.61 శాతం వాటాను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)కి విక్రయించడం ద్వారా కేంద్ర ఖజానాకు రూ.14,000 కోట్లు సమకూరతాయని అంచనా. ఇక షేర్ల బైబ్యాక్ కోసం కోల్ ఇండియా, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్ఎండీసీ తదితర కంపెనీలతో కేంద్ర ఆర్థిక శాఖ ఓ జాబితా రూపొందించింది. ఈ జాబితాలో బీహెచ్ఈఎల్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్బీసీసీ, ఎస్‌జేవీఎన్, కేఐఓసీఎల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఉన్నాయి. ఇప్పటికే నాల్కో, ఎన్ఎల్సీ, కొచ్చిన్ షిప్‌యార్డ్ కలిపి రూ.2,000 కోట్లతో షేర్ల బైబ్యాక్‌కు నిర్ణయించిన విషయం గమనార్హం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఐపీవోలు, ఆఫర్ ఫర్ సేల్‌ను పరిశీలించడం లేదని ఆ అధికారి స్పష్టం చేశారు. -
కొత్త ఏడాదీ... సర్కారీ ఐపీఓల జోరు!
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా 2018–19లో కేంద్రం పెద్ద యెత్తున నిధులు సమీకరించనున్న నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ఐపీవోల జోరు కొనసాగనుంది. అన్నింటికన్నా ముందుగా రైట్స్, ఐఆర్ఎఫ్సీ పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది మేలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ఇదే కోవకి చెందిన మరో రెండు పీఎస్‌యూలు ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్ ఐపీవోలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్నాయి. 2018–19లో పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీవోల జాబితాలో మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంస్థలు ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే వీటి పబ్లిక్ ఇష్యూలు ఉండొచ్చని అంచనా. అలాగే, సాధారణ బీమా పీఎస్‌యూలు మూడింటిని (నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్) కలిపేసి ఒకే సంస్థగా లిస్ట్ చేసే యోచన కూడా ఉంది. 2017–18లో రికార్డు స్థాయిలో ఆరు పీఎస్‌యూలు ఐపీవోకి వచ్చాయి. రూ. 24,000 కోట్లు సమీకరించాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, కార్పొరేషన్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, కొచిన్ షిప్‌యార్డ్, హడ్కో వీటిలో ఉన్నాయి. అన్నింటికన్నా ముందుగా రైట్స్.. ఐఆర్ఎఫ్సీ, రైట్స్ ఐపీవోలు మే నెలాఖరులోగా ఉండొచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండింటిలో ముందుగా రైట్స్ ఐపీవో ఉండనుంది. ఈ సంస్థ ఇష్యూలో కేంద్రం 12 శాతం మేర వాటాలు విక్రయించే అవకాశం ఉంది. ఇక ఐఆర్ఎఫ్సీ సంగతి తీసుకుంటే 10 శాతం వాటాలు విక్రయించవచ్చని అంచనా. ఆర్‌వీఎన్‌ఎల్‌లో 25 శాతం డిజిన్వెస్ట్‌మెంట్ ఉండవచ్చు. వాస్తవానికి పన్ను సంబంధ వివాదం కారణంగా ఐఆర్ఎఫ్సీ లిస్టింగ్ ప్రతిపాదనలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మినహాయింపు లభించడంతో ఐఆర్ఎఫ్సీ ఐపీవోకి మార్గం సుగమం చేసింది. రైట్స్ ఐపీవోకి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, ఎలార సెక్యూరిటీస్ ఇండియా, ఐడీఎఫ్సీ బ్యాంక్ సంస్థలు అడ్వైజర్స్‌గా ఉండనున్నాయి. అటు ఐఆర్ఎఫ్సీ ఇష్యూకి ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాప్స్, ఐడీఎఫ్సీ, హెచ్ఎస్బీసీ .. అడ్వైజర్స్‌గా ఉండనున్నాయి. ఐఆర్సీటీసీ ఇష్యూకి సర్వీస్ చార్జీల అడ్డంకి.. మిగతా పీఎస్‌యూల లిస్టింగ్ ప్రణాళికలు చకచకా ముందుకు సాగుతున్నప్పటికీ.. ఐఆర్సీటీసీ ఐపీవో ప్రతిపాదనను మాత్రం నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ కీలక ఆదాయ వనరైన సర్వీసు చార్జీలను రద్దు చేయడం వల్ల ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చని భావిస్తుండటమే ఇందుకు కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. టికెట్లు, ఇతరత్రా సర్వీసుల బుకింగ్‌పై విధించే సర్వీస్ చార్జీలే కంపెనీకి ప్రధాన ఆదాయ వనరైనప్పుడు.. ప్రభుత్వం దాన్నే తొలగించేస్తే, ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంటుందని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఐఆర్సీటీసీ ద్వారా బుకింగ్స్‌పై సర్వీస్ చార్జీలను తొలగించింది. దీంతో ఐఆర్సీటీసీ వార్షికాదాయం రూ.500 కోట్ల మేర తగ్గింది. ఆర్థిక శాఖ దీన్ని భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ.. రూ. 80 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేసింది. పవన్‌హన్స్‌లో పూర్తి వాటాల విక్రయం.. ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను ప్రైవేటీకరించే ప్రయత్నాలను వేగవంతం చేసిన కేంద్రం తాజాగా పవన్‌హన్స్‌లోనూ వాటాల విక్రయంపై సమాలోచనలు చేస్తోంది. పవన్‌హన్స్‌లో కేంద్రం పూర్తి వాటాలను విక్రయించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్ సర్వీసులు అందించే ఈ కంపెనీలో కేంద్రానికి, ఓఎన్జీసీకి చెరి 50 శాతం వాటాలు ఉన్నాయి. ఐపీఓ పత్రాలు సమర్పించిన 4 పీఎస్‌యూలు న్యూఢిల్లీ: మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు మరో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఐపీఓ పత్రాలను సెబీకి ఇటీవలే సమర్పించాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రైల్వే మౌలిక సదుపాయాల సంస్థ, ఇర్కాన్ ఇంటర్నేషనల్, యుద్ధ నౌకల తయారీ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్.. ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తాజాగా ఐపీఓ పత్రాలను సమర్పించాయి. -
జోరుగా షేర్ల బైబ్యాక్..!!
ముంబై: గత రెండేళ్లుగా కంపెనీలు షేర్లను బైబ్యాక్ చేయడం గణనీయంగా పెరుగుతోంది. 2009 తర్వాత మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరం అత్యధిక స్థాయిలో బైబ్యాక్ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సారథ్యంలో దేశీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 52,350 కోట్ల నిధులు ఇందుకోసం వెచ్చించాయి. గత ఆర్థిక సంవత్సరంలో వెచ్చించిన రూ. 34,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 54 శాతం అధికం కావడం గమనార్హం. 2017–18లో మొత్తం 56 కంపెనీలు షేర్ల బైబ్యాక్ ప్రకటించాయి. ఈ జాబితాలో ఐటీ కంపెనీలే అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ. 16,000 కోట్లు వెచ్చించగా, మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 13,000 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. అటు విప్రో రూ. 11,000 కోట్లు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ. 3,500 కోట్లు.. షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు వెచ్చించాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ సంస్థలు సైతం విస్తరణ ప్రణాళికలకు కాకుండా కేంద్రం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాల సాధన కోసం షేర్ల బైబ్యాక్ చేపట్టాయి. 12 ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) గణాంకాల ప్రకారం.. ఆయిల్ ఇండియా, ఈఐఎల్, హెచ్ఏఎల్, ఎస్‌జేవీఎన్ తదితర సంస్థల్లో బైబ్యాక్ మార్గం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్లు సమీకరించింది. విస్తరణ ప్రణాళికలు లేకపోవడం కారణం.. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌కి అదనంగా డివిడెండ్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టడం, దీనికి తోడు మెరుగైన విస్తరణ ప్రణాళికలేమీ లేకపోవడం తదితర అంశాల కారణంగా కంపెనీలు ఈ విధంగా బైబ్యాక్‌లు జరిపి ఉంటాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. తమ బుక్ వ్యాల్యూను మెరుగుపర్చుకునే క్రమంలో నగదు నిల్వలను ఇందుకోసం వెచ్చించి ఉంటాయని తెలిపాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం అదనపు డివిడెండ్ ట్యాక్స్‌ను అమల్లోకి తెచ్చింది. డివిడెండ్ రూ. 10 లక్షలకు మించిన పక్షంలో .. దాన్ని అందుకున్న వారు 10 శాతం మేర పన్ను కట్టాల్సి ఉంటుంది. కంపెనీ అప్పటికే చెల్లించే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)కి ఇది అదనం. వ్యాపార వృద్ధి అంతంత మాత్రంగా ఉంటున్న నేపథ్యంలో దేశీ సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రధానంగా ఈ బైబ్యాక్స్ చేపట్టినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. డిమాండ్ మందగించడంతో గడిచిన కొన్నేళ్లుగా కంపెనీలు .. వ్యాపార వృద్ధికి ఉపయోగపడే పెట్టుబడుల వ్యయాలను తగ్గించాయి. సీఎంఈఐ డేటా ప్రకారం 2017వ సంవత్సరంలో కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు కేవలం రూ. 7.9 లక్షల కోట్లు మాత్రమే రావడం దీనికి నిదర్శనం. 2014లో రూ. 16.2 లక్షల కోట్లుగా ఉన్న కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు.. 2015లో రూ. 15.3 లక్షల కోట్లకు, 2016లో రూ. 14.5 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. -
అరవింద్ పనగారియా కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన అరవింద్ పనగారియా కీలక వ్యాఖ్యలు చేశారు. నష్టాల్లో ఉన్న 18 నుంచి 20 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడమే మంచిదని అరవింద్ పనగారియా సూచించారు. నష్టాల్లో ఉన్న కంపెనీల లాభదాయకతను పరీక్షించాలని నీతి ఆయోగ్‌ను ప్రధానమంత్రి ఆఫీసు ఆదేశించింది. 18-20 నష్టాల్లో ఉన్న పీఎస్‌యూలను మూసివేయడమే చాలా మంచిదంటూ పనగారియా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు వాటిలో 17 పీఎస్‌యూ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయాలంటూ కేబినెట్ ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కూడా నెమ్మదిగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూలో వాటాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.72,500 కోట్లను పొందాలని చూస్తోంది. వాటిలో మైనార్టీ వాటాల విక్రయం నుంచి రూ.46,500 కోట్లు, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.15వేల కోట్లు, పీఎస్‌యూ ఇన్సూరెన్స్ కంపెనీల లిస్టింగ్ నుంచి రూ.11వేల కోట్లను ఆర్జించనుంది. ఆర్థిక వృద్ధి విషయాన్ని తీసుకుంటే ఈ ఏడాది 7.5 శాతం వృద్ధిని ఆర్జించాల్సి ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో 8 శాతం వృద్ధిని తాకే అవకాశముందని తెలిపారు. ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్-మార్చి నుంచి జనవరి-డిసెంబర్‌కు మార్చడంతో ఏ మేర వ్యయాలను భరించాల్సి వస్తుందో చూడాల్సి ఉందన్నారు. అన్ని అంశాలకు తాము అంగీకారం తెలుపబోమని కానీ అంతిమంగా దేశప్రయోజనాలను తాము పరిగణలోకి తీసుకుంటామని పనగారియా చెప్పారు. కాగ, ఇటీవలే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పనగారియా, ఈ నెల 31 వరకు తన పదవిలో కొనసాగనున్నారు. -
15 పీఎస్‌యూల మూసివేతకు ప్రభుత్వం సిద్ధం!
భారత్ పంప్స్‌లో మెజారిటీ వాటాల విక్రయం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర నష్టాల్లో నడుస్తున్న 15 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చిందని సమాచారం. మొత్తం 74 ఖాయిలా పడిన, నష్టాల్లో ఉన్న పీఎస్‌యూల భవితవ్యంపై నీతి ఆయోగ్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ఈ మేరకు నిర ్ణయం తీసుకుందని ఉన్నతాధికారొకరు చెప్పారు. ప్రధాన మంత్రి ప్రధాన సలహాదారు నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో వివిధ దఫాలుగా జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం జరిగిందని ఆ అధికారి వివరించారు. కనీసం ఐదు పీఎస్‌యూలను మూసేయాలని, మూడు పీఎస్‌యూల పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. మరో ఆరు ఖాయిలా పీఎస్‌యూలను నీతి ఆయోగ్ గుర్తించిందని, అయితే వీటిని మూసేయకుండా మంత్రులు లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్ మూసివేతను పెట్రోలియమ్ మంత్రిత్వ శాఖ వ్యతిరేకిస్తోంది. ఇక బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్, ఎల్జిన్ మిల్స్‌లను మూసేయడాన్ని టెక్స్టైల్స్ శాఖ వ్యతిరేకిస్తోంది. హెచ్ఎంటీ విభాగాలను మూసేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లోనే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. హెచ్ఎంటీ వాచెస్ సంస్థలోని ఉద్యోగులకు 2007 నాటి స్కేళ్ల ప్రకారం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్)ను ఆఫర్ చేస్తున్నారు. కాగా సెంట్రల్ ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌ను మూసేయించాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ఫలించాయి. సెంట్రల్ ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌ను మూసేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మూడు ఫార్మా పీఎస్‌యూలను మూసివేయాలని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ మూడు ఫార్మా పీఎస్యూలపై నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల సంఘానికి నివేదించారు. మూసేయాల్సిన ఖాయిలా పడ్డ పీఎస్‌యూల్లో హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ కూడా ఉంది. పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీకి ముంబై, ఢిల్లీల్లో వందల ఎకరాల భూములున్నాయి. ఖాయిలా పడిన, నష్టాల్లో ఉన్న 74 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విషయమై ప్రభుత్వం ఎలాంటి విధానాలను అనుసరించాలో సూచిస్తూ నీతి ఆయోగ్ ఒక నివేదికను ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాన మంత్రి ప్రధాన సలహాదారు నృపేంద్ర మిశ్రాకు సమర్పించింది. ఆస్తుల విక్రయం ద్వారా పీఎస్‌యూలను మూసేయడం, వీటి యాజమాన్యాన్ని రాష్ట్రప్రభుత్వాలకు బదిలీ చేయడం, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే సంస్థలను పునరుద్ధరించడం ఈ పాలసీలోని కొన్ని అం శాలు.రెండింటిపై యథాతథ స్థితిని కొనసాగిం చాలని, పది పీఎస్‌యూల్లో వ్యూహాత్మకంగా వాటా విక్రయించాలని. 22 పీఎస్‌యూలను పునరుద్ధరించాలని, ఆరు పీఎస్‌యూల్లో యాజమాన్యాన్ని బదిలీ, మూడింటిని విలీనం చేయాలని, ఐదింటిని దీర్ఘకాలం పాటు లీజ్‌కు ఇవ్వాలని, 26 పీఎస్‌యూలను మూసేయాలని.. నీతి ఆయోగ్ సూచించింది. న్యూఢిల్లీ: భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్లో మెజారిటీ వాటా (వ్యూహాత్మక)ల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం సూత్రప్రాయ ఆమోదముద్ర వేసింది. అలహాబాద్ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ (సీపీఎస్ఈ)లో 50% వరకూ లేదా ఆ పైన వాటాల విక్రయమే వ్యూహాత్మక వాటాల విక్రయంగా పరిగణిస్తారు. ఈ అమ్మకంలో యాజమాన్య నియంత్రణ కూడా బదిలీ అవుతుంది. భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్ లిమిటెడ్‌కు రూ.111.59 కోట్ల రుణ ప్రణాళికేతర ఆర్థిక సహాయాన్నీ అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. తద్వారా రిటైర్డ్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీసహా సీఐఎస్ఎఫ్ బకాయిల చెల్లింపులే ఈ ప్రణాళిక లక్ష్యం. రష్యా చమురు క్షేత్రాల్లో వాటాల కొనుగోలు కాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), ఆయిల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ల కన్సార్షియం రెండు రష్యన్ చమురు క్షేత్రాల్లో వాటాల కొనుగోలుకూ క్యాబినెట్ ఓకే చెప్పింది. ఈ విలువ మొత్తం 3.14 బిలియన్ డాలర్లు. దీనిప్రకారం ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్‌లు తూర్పు టాస్-యూరియాక్ చమురు క్షేత్రాల్లో 29.9 శాతం వాటాలను కొనుగోలు చేస్తాయి. ఈ వాటాల విలువ 1.12 బిలియన్ డాలర్లు. 2.02 బిలియన్ డాలర్లతో వాకోర్ చమురు క్షేత్రాల్లో 23.9 శాతం వాటాలను కొంటాయి. హిందుస్తాన్ కేబుల్స్ క్లోజర్ ప్యాకేజీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వ రంగ హిందుస్తాన్ కేబుల్స్ మూసివేతకు సంబంధించిన నిర్ణయం ఒకటి. ఇందుకు సంబంధించి 4,777.05 కోట్ల ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. వేతనాల చెల్లింపు, ముందస్తు రిటైర్ స్కీమ్‌లు, ప్రభుత్వ రుణాన్ని ఈక్విటీగా మార్పు వంటి అవసరాలకు ఈ ప్యాకేజీని వినియోగిస్తారు. దివాళా వ్యవహారాల కోసం కార్పొరేషన్! ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరర్ల దివాళా వ్యవహారాలను శీఘ్రంగా పరిష్కరించేందుకు వీలుగా ఓ ‘రిజల్యూషన్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ నియమించిన కమిటీ సూచించింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ సంస్థపైనే ఉండాలని పేర్కొంది. -
ఖాయిలా పీఎస్‌యూలకు చికిత్స
న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) కంపెనీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చికిత్స మొదలుపెట్టింది. మహారత్న, నవరత్న దిగ్గజాలతో పాటు ఇతర పీఎస్‌యూల వద్ద భారీ మొత్తంలో ఉన్న మిగులు నిధులను పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నట్లు భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అనంత్ గీతే చెప్పారు. శుక్రవారమిక్కడ జరిగిన భారత వాహన తయారీదారుల సంఘం(సియామ్) వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను అధ్యయనం చేసేందుకు ఎన్టీపీసీ చైర్మన్ అరూప్ రాయ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించామని.. రెండు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించనుందని కూడా గీతే పేర్కొన్నారు. నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు ప్రారంభ(సీడ్) ఈక్విటీ నిధులను సమకూర్చడం ద్వారా ఒక జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేయడం.. తద్వారా నష్టజాతక పీఎస్‌యూల నిర్వహణ, పునరుద్ధరణకు గల అవకాశాలను కమిటీ పరిశీలించనుంది. ‘మహారత్న, నవరత్న హోదా ఉన్న సీపీఎస్ఈలకు చెందిన రూ.2 లక్షల కోట్ల మేర మిగులు నిధులు బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్నట్లు అంచనా. ఈ కంపెనీలన్నింటికీ సమాన ఈక్విటీ వాటా ఉండేవిధంగా ఒక జేవీ ఏర్పాటు ప్రతిపాదనను మేం రూపొందించాం. దీనిద్వారా ఇప్పుడున్న 70 ఖాయిలా పీఎస్‌యూల్లో 43 కంపెనీలను పునరుద్ధరించేందుకు వీలవుతుంది’ అని గీతే వివరించారు. ఏ ఖాయిలా కంపెనీని పునరుద్ధరించాలనేది కొత్తగా నెలకొల్పే జేవీ సమీక్షించి, నిర్ణయించనుందని.. దీనికి సంబంధించి పూర్తి భాధ్యతను జేవీకే ఇవ్వాలనేది తమ ప్రతిపాదనగా ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం నిధుల కల్పన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టనున్నామని కూడా గీతే తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులపై త్వరలో నిర్ణయం... కాగా, నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్ఈఎంఎంపీ)ను అమలు చేసే ప్రతిపాదనపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా బ్యాటరీతో నిడిచే ఎలక్ట్రిక్ వాహనాలను(బస్సులు) ప్రజా రవాణాకోసం వినియోగించాలనేది ఈ మిషన్ ప్రధానోద్దేశమని చెప్పారు. దేశంలోనే అత్యంత కాలుష్యభరితమైన నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉందని.. జాబితా నుంచి దీన్ని తొలగించడం కోసం ఈ నగరం నుంచే ఎన్ఈఎంఎంపీని ప్రారంభించనున్నట్లు గీతే పేర్కొన్నారు. 2020కల్లా 60-70 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని మిషన్ అంచనా వేస్తోంది. -
ప్రయివేట్ డివిడెండ్లదే పైచేయి
ముంబై: డివిడెండ్లను పెంచడంలో ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేటు కంపెనీలే జోరుమీదున్నాయి. ప్రైవేటు కంపెనీలు చెల్లించిన డివిడెండ్ల పరిమాణం గత నాలుగేళ్లలో సగటున ఏటా 22.5 శాతం పెరిగింది. పీఎస్‌యూల విషయంలో ఇది 16.7 శాతమే. బీఎస్ఈ 200 కంపెనీల డివిడెండ్లను విశ్లేషించినపుడు వెల్లడైన అంశాలివీ... 2012-13లో పీఎస్‌యూలు రూ.46,198 కోట్ల డివిడెండ్ చెల్లించాయి. మొత్తం 36 పీఎస్‌యూల్లోని టాప్ 5 కంపెనీల డివిడెండే ఇందులో 60% అంటే రూ.27,325 కోట్లు. కోల్ ఇండియా ఇటీవలే రూ.18,371 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. గతంలోని రూ.8,843 కోట్లతో పోలిస్తే ఇది 207% అధికం. అంతేకాదు, ఓ భారతీయ కంపెనీ ఒకేసారి చెల్లించిన అత్యధిక డివిడెండ్ కూడా ఇదే. గత నాలుగేళ్లలో దేశీ కంపెనీల డివిడెండ్ల పరిమాణం ఏటా 20% చొప్పున పెరిగి రూ.1.02 లక్షల కోట్లకు చేరింది. 2008-09లో నికరలాభాల్లో 23%గా ఉన్న ఇవి 2012-13లో 29.8%కు ఎగశాయి. డివిడెండ్ చెల్లింపులతో మైనారిటీ షేర్హోల్డర్లకు పెద్దగా ప్రయోజనం ఉండడం లేదనీ, ఈ విధానంలో నిలకడను ప్రజలు గమనించాలనీ ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ సోనమ్ ఉదాసీ వ్యాఖ్యానించారు. ‘కంపెనీల డివిడెండ్ చరిత్రను ఇన్వెస్టర్లు పరిశీలించాలి. డివిడెండును ఏ రీతిన పెంచుతున్నాయో గమనించాలి. ఓ కంపెనీ తన భవిష్యత్తుపై ఎంత భరోసాతో ఉందనే అంశాన్ని డివిడెండ్ విధానం వెల్లడిస్తుంది. దేశీ కంపెనీలు సాధారణంగా అభివృద్ధి కోసం మూలధనం అవసరమంటూ లాభాల్లో అధిక మొత్తాన్ని ఉంచేసుకుంటాయని’ ఆయన తెలిపారు. డివిడెండ్ల విషయం ప్రోత్సాహకరంగానే ఉన్నప్పటికీ పెంపు అన్ని రంగాలకూ విస్తరించాల్సి ఉందని విశ్లేషకులంటున్నారు. -
సర్కారీ షేర్లు వస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యం సాధించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలే మిగిలి ఉండటంతో... కేంద్రం త్వరపడుతోంది. ఈ నెల్లోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ), ఇంజినీర్స్ ఇండియాల్లో వాటా విక్రయాలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ ప్రకటించారు. ఫిబ్రవరిలో బీహెచ్ఈఎల్(భెల్), మార్చిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లు క్యూలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తంమీద ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం లక్ష్యించిన రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్మెంట్కు దరిదాపుల్లోకి రాగలమని భావిస్తున్నట్లు మాయారామ్ ధీమా వ్యక్తం చేశారు. చిత్రమేంటంటే లక్ష్యం 40వేల కోట్లయితే ఇప్పటిదాకా ఏడు పీఎస్‌యూల్లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం కేవలం రూ.3వేల కోట్లు మాత్రమే సమీకరించింది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ చేసిన కంపెనీల్లో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ కాపర్, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎంఎంటీసీలున్నాయి. దిగ్గజాల వరుస... తాజా రోడ్‌మ్యాప్ ప్రకారం ఐఓసీ, ఇంజినీర్స్ ఇండియా, హెచ్ఏఎల్లో 10 శాతం చొప్పున వాటా విక్రయించే అవకాశముంది. దీన్లో ఐఓసీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇంజినీర్స్ ఇండియా ద్వారా రూ.500 కోట్లు రావచ్చు. హెచ్ఏఎల్ ద్వారా రూ.3,000 కోట్లు సమకూరే అవకాశముంది. భెల్‌లో 5 శాతం వాటా విక్రయంతో రూ.2,000 కోట్లు ఖజానాకు జమ కావచ్చు. కోల్ ఇండియా, ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్) వంటి దిగ్గజ సంస్థల ఇష్యూలు కూడా చాన్నాళ్లుగా జాప్యమవుతూ వస్తున్నాయి. కాగా, ఐఓసీలో డిజిన్వెస్ట్‌మెంట్‌పై సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) గురువారం చర్చించనుంది. ఆర్థిక మంత్రి చిదంబరం అధ్యక్షతన ఈజీఓఎం ఈ వాటా (19.16 కోట్ల షేర్ల)విక్రయంపై చర్చిస్తుందని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే చెప్పారు. ఐఓసీలో కేంద్ర ప్రభుత్వానికి 78.92 శాతం వాటా ఉంది. కొన్ని పీఎస్‌యూల్లో షేర్లను సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్(సీపీఎస్ఈ) ఈటీఎఫ్ యంత్రాంగం ద్వారా విక్రయించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.3,000 కోట్ల మూలనిధి(కార్పస్)తో దీన్ని ఏర్పాటు చేయొచ్చని అంచనా. ప్రతిపాదిత ఈపీఎఫ్‌లో ఇప్పటికే లిస్టయిన సీపీఎస్ఈల షేర్లు(2-3%)ఉంటాయి. పసిడిపై నియంత్రణలు కొనసాగుతాయ్... బంగారం దిగుమతులపై ప్రభుత్వ నియంత్రణలను ఇప్పుడప్పుడే తొలగించే అవకాశాల్లేవని మాయారామ్ చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) మెరుగుపడుతున్నప్పటికీ.. కనీసం మార్చి చివరివరకూ ఈ నియంత్రణలు కొనసాగవచ్చన్నారు. క్యాడ్ రికార్డు స్థాయికి చేరడం, రూపాయి పతనం కావటంతో పుత్తడిపై దిగుమతి సంకాన్ని అంచెలంచెలుగా కేంద్రం 10%కి పెంచడం తెలిసిందే. దీంతో మే నెలలో 162 టన్నుల స్థాయి నుంచి నవంబర్‌లో 19.3 టన్నులకు పడిపోయాయి. క్యాడ్ కూడా జూలై క్వార్టర్లో 4.8% నుంచి సెప్టెంబర్ క్వార్టర్లో 1.2%కి దిగొచ్చింది. నియంత్రణల కారణంగా బంగారం స్మగ్లింగ్ పెరిగేందుకు దారితీస్తోందా అన్న ప్రశ్నకు.. అలాంటి వాదనలకు తగిన ఆధారాల్లేవని మాయారామ్ తేల్చిచెప్పారు.