
సాక్షి, న్యూఢిల్లీ : పలు ప్రభుత్వ రంగ సంస్ధలు (పీఎస్‌యూ) లాభాలు ఆర్జిస్తున్నా ఆయా సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిమంది పారిశ్రామికవేత్తల లాభాల కోసం ఉద్యోగులను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు.
హిందుస్ధాన్ ఏరోనాటికల్స్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ వంటి పీఎస్‌యూల్లో పరిస్థితి బహిరంగ రహస్యమేనని చెప్పుకొచ్చారు. రాయ్‌బరేలిలోని మోడరన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. లోక్‌సభలో సోనియా మంగళవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ఉటంకించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను పండిట్ నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా అభివర్ణిస్తే ఇప్పుడు వాటిలో చాలా దేవాలయాలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఇతర పీఎస్‌యూలను కాపాడాలని, ఉద్యోగులు, వారి కుటుంబాలను గౌరవించాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలపాలనే ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయం పట్ల కూడా సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment