ముంబై: గత రెండేళ్లుగా కంపెనీలు షేర్లను బైబ్యాక్ చేయడం గణనీయంగా పెరుగుతోంది. 2009 తర్వాత మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరం అత్యధిక స్థాయిలో బైబ్యాక్ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సారథ్యంలో దేశీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 52,350 కోట్ల నిధులు ఇందుకోసం వెచ్చించాయి. గత ఆర్థిక సంవత్సరంలో వెచ్చించిన రూ. 34,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 54 శాతం అధికం కావడం గమనార్హం.
2017–18లో మొత్తం 56 కంపెనీలు షేర్ల బైబ్యాక్ ప్రకటించాయి. ఈ జాబితాలో ఐటీ కంపెనీలే అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ. 16,000 కోట్లు వెచ్చించగా, మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 13,000 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. అటు విప్రో రూ. 11,000 కోట్లు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ. 3,500 కోట్లు.. షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు వెచ్చించాయి.
మరోవైపు, ప్రభుత్వ రంగ సంస్థలు సైతం విస్తరణ ప్రణాళికలకు కాకుండా కేంద్రం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాల సాధన కోసం షేర్ల బైబ్యాక్ చేపట్టాయి. 12 ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) గణాంకాల ప్రకారం.. ఆయిల్ ఇండియా, ఈఐఎల్, హెచ్‌ఏఎల్, ఎస్‌జేవీఎన్ తదితర సంస్థల్లో బైబ్యాక్ మార్గం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్లు సమీకరించింది.
విస్తరణ ప్రణాళికలు లేకపోవడం కారణం..
డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌కి అదనంగా డివిడెండ్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టడం, దీనికి తోడు మెరుగైన విస్తరణ ప్రణాళికలేమీ లేకపోవడం తదితర అంశాల కారణంగా కంపెనీలు ఈ విధంగా బైబ్యాక్‌లు జరిపి ఉంటాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. తమ బుక్ వ్యాల్యూను మెరుగుపర్చుకునే క్రమంలో నగదు నిల్వలను ఇందుకోసం వెచ్చించి ఉంటాయని తెలిపాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం అదనపు డివిడెండ్ ట్యాక్స్‌ను అమల్లోకి తెచ్చింది.
డివిడెండ్ రూ. 10 లక్షలకు మించిన పక్షంలో .. దాన్ని అందుకున్న వారు 10 శాతం మేర పన్ను కట్టాల్సి ఉంటుంది. కంపెనీ అప్పటికే చెల్లించే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)కి ఇది అదనం. వ్యాపార వృద్ధి అంతంత మాత్రంగా ఉంటున్న నేపథ్యంలో దేశీ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రధానంగా ఈ బైబ్యాక్స్ చేపట్టినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
డిమాండ్ మందగించడంతో గడిచిన కొన్నేళ్లుగా కంపెనీలు .. వ్యాపార వృద్ధికి ఉపయోగపడే పెట్టుబడుల వ్యయాలను తగ్గించాయి. సీఎంఈఐ డేటా ప్రకారం 2017వ సంవత్సరంలో కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు కేవలం రూ. 7.9 లక్షల కోట్లు మాత్రమే రావడం దీనికి నిదర్శనం. 2014లో రూ. 16.2 లక్షల కోట్లుగా ఉన్న కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు.. 2015లో రూ. 15.3 లక్షల కోట్లకు, 2016లో రూ. 14.5 లక్షల కోట్లకు తగ్గిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment