న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా 2018–19లో కేంద్రం పెద్ద యెత్తున నిధులు సమీకరించనున్న నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ఐపీవోల జోరు కొనసాగనుంది. అన్నింటికన్నా ముందుగా రైట్స్, ఐఆర్‌ఎఫ్‌సీ పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది మేలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ఇదే కోవకి చెందిన మరో రెండు పీఎస్‌యూలు ఇర్కాన్, ఆర్‌వీఎన్‌ఎల్ ఐపీవోలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్నాయి.
2018–19లో పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీవోల జాబితాలో మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంస్థలు ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే వీటి పబ్లిక్ ఇష్యూలు ఉండొచ్చని అంచనా.
అలాగే, సాధారణ బీమా పీఎస్‌యూలు మూడింటిని (నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్) కలిపేసి ఒకే సంస్థగా లిస్ట్ చేసే యోచన కూడా ఉంది. 2017–18లో రికార్డు స్థాయిలో ఆరు పీఎస్‌యూలు ఐపీవోకి వచ్చాయి. రూ. 24,000 కోట్లు సమీకరించాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, కార్పొరేషన్, హెచ్‌ఏఎల్, భారత్ డైనమిక్స్, కొచిన్ షిప్‌యార్డ్, హడ్కో వీటిలో ఉన్నాయి.
అన్నింటికన్నా ముందుగా రైట్స్..
ఐఆర్‌ఎఫ్‌సీ, రైట్స్ ఐపీవోలు మే నెలాఖరులోగా ఉండొచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండింటిలో ముందుగా రైట్స్ ఐపీవో ఉండనుంది. ఈ సంస్థ ఇష్యూలో కేంద్రం 12 శాతం మేర వాటాలు విక్రయించే అవకాశం ఉంది. ఇక ఐఆర్‌ఎఫ్‌సీ సంగతి తీసుకుంటే 10 శాతం వాటాలు విక్రయించవచ్చని అంచనా. ఆర్‌వీఎన్‌ఎల్‌లో 25 శాతం డిజిన్వెస్ట్‌మెంట్ ఉండవచ్చు. వాస్తవానికి పన్ను సంబంధ వివాదం కారణంగా ఐఆర్‌ఎఫ్‌సీ లిస్టింగ్ ప్రతిపాదనలపై సందేహాలు నెలకొన్నాయి.
అయితే, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మినహాయింపు లభించడంతో ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవోకి మార్గం సుగమం చేసింది. రైట్స్ ఐపీవోకి ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, ఎలార సెక్యూరిటీస్ ఇండియా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ సంస్థలు అడ్వైజర్స్‌గా ఉండనున్నాయి. అటు ఐఆర్‌ఎఫ్‌సీ ఇష్యూకి ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాప్స్, ఐడీఎఫ్‌సీ, హెచ్‌ఎస్‌బీసీ .. అడ్వైజర్స్‌గా ఉండనున్నాయి.
ఐఆర్‌సీటీసీ ఇష్యూకి సర్వీస్ చార్జీల అడ్డంకి..
మిగతా పీఎస్‌యూల లిస్టింగ్ ప్రణాళికలు చకచకా ముందుకు సాగుతున్నప్పటికీ.. ఐఆర్‌సీటీసీ ఐపీవో ప్రతిపాదనను మాత్రం నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ కీలక ఆదాయ వనరైన సర్వీసు చార్జీలను రద్దు చేయడం వల్ల ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చని భావిస్తుండటమే ఇందుకు కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
టికెట్లు, ఇతరత్రా సర్వీసుల బుకింగ్‌పై విధించే సర్వీస్ చార్జీలే కంపెనీకి ప్రధాన ఆదాయ వనరైనప్పుడు.. ప్రభుత్వం దాన్నే తొలగించేస్తే, ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంటుందని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌సీటీసీ ద్వారా బుకింగ్స్‌పై సర్వీస్ చార్జీలను తొలగించింది. దీంతో ఐఆర్‌సీటీసీ వార్షికాదాయం రూ.500 కోట్ల మేర తగ్గింది. ఆర్థిక శాఖ దీన్ని భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ.. రూ. 80 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేసింది.
పవన్‌హన్స్‌లో పూర్తి వాటాల విక్రయం..
ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను ప్రైవేటీకరించే ప్రయత్నాలను వేగవంతం చేసిన కేంద్రం తాజాగా పవన్‌హన్స్‌లోనూ వాటాల విక్రయంపై సమాలోచనలు చేస్తోంది. పవన్‌హన్స్‌లో కేంద్రం పూర్తి వాటాలను విక్రయించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్ సర్వీసులు అందించే ఈ కంపెనీలో కేంద్రానికి, ఓఎన్‌జీసీకి చెరి 50 శాతం వాటాలు ఉన్నాయి.
ఐపీఓ పత్రాలు సమర్పించిన 4 పీఎస్‌యూలు
న్యూఢిల్లీ: మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు మరో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఐపీఓ పత్రాలను సెబీకి ఇటీవలే సమర్పించాయి.
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రైల్వే మౌలిక సదుపాయాల సంస్థ, ఇర్‌కాన్ ఇంటర్నేషనల్, యుద్ధ నౌకల తయారీ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్.. ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తాజాగా ఐపీఓ పత్రాలను సమర్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment