diginvest
-
ప్రైవేటీకరించే బ్యాంకుల జాబితా సిద్ధం
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించే ప్రభుత్వ రంగ బ్యాంకుల పేర్లను నీతి ఆయోగ్ ఖరారు చేసింది. ఈ జాబితాను డిజిన్వెస్ట్‌మెంట్‌పై కార్యదర్శులతో ఏర్పాటైన కీలక గ్రూప్ (సీజీఎస్డీ)కి సమర్పించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. క్యాబినెట్ కార్యదర్శి సారథ్యంలోని సీజీఎస్ నుంచి క్లియరెన్స్ లభించాక.. ఖరారైన పేర్లను ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం)కు పంపుతారు. అటుపైన తుది ఆమోదం కోసం ప్రధాని సారథ్యంలోని క్యాబినెట్‌కు పంపుతారు. క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాత ప్రైవేటీకరణకు వెసులుబాటు కల్పించేలా నియంత్రణపరమైన నిబంధనల్లో సవరణలు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించాలని 2021–22 కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. వాటిని ఎంపిక చేసే బాధ్యతను నీతి ఆయోగ్‌కి అప్పగించింది. -
డిజిన్వెస్ట్‌మెంట్ నిధులు.. ఇన్ఫ్రాకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే వినియోగిస్తామని.. ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై ఇది అనేక రకాలుగా సానుకూల ప్రభావం చూపగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ‘సమీకరించిన నిధులను ఏం చేయబోతున్నామన్నది స్పష్టంగా చెబుతున్నాం. మీ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలను తదనుగుణంగా రూపొందించుకోవడానికి దీనితో వెసులుబాటు లభిస్తుంది. ప్రైవేట్ రంగం ప్రభుత్వానికి తోడ్పడాలి. దానికి సమానంగా ప్రభుత్వం కూడా ప్రైవేట్ రంగానికి తోడ్పాటు అందిస్తుంది’ అని ఆమె చెప్పారు. ఉదాహరణకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై విధించే సుంకాల ద్వారా వచ్చే నిధులను.. మైరుగైన వైద్య సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు మంత్రి వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎకానమీకి ఊతమిచ్చేందుకు నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. రూ. 1.13 లక్షల కోట్ల మోసాలు.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బ్యాం కులు, ఆర్థిక సంస్థల్లో ఏకంగా రూ. 1,13,374 కోట్ల మోసాలు చోటు చేసుకున్నా యని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. ప్రభుత్వ బ్యాంకుల్లో భారీ మోసాలను సత్వరం గుర్తించేందుకు, నివారించేందుకు 2015లో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, సమస్యల గుర్తింపు, పరిష్కారం, అదనపు మూలధనం అందించడం, సంస్కరణలు వంటి చర్యలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల మొండిబాకీలు గతేడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.1.68 లక్షల కోట్ల మేర తగ్గి రూ.7.27 లక్షల కోట్లకు చేరాయని మంత్రి వివరించారు. ఎల్ఐసీ పాలసీదారుల ప్రయోజనాలు కాపాడతాం ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీలో వాటాల విక్రయ అంశంలో పాలసీదారుల ప్రయోజనాలను కచ్చితంగా పరిరక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. లిస్టింగ్ వల్ల ఎల్ఐసీలో పారదర్శకత మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. వాటాలు ఎంత మేర విక్రయించవచ్చన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఎల్ఐసీ చట్టాన్ని సవరించిన తర్వాత అన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. ఎల్ఐసీలో కేంద్రానికి 100% వాటా ఉంది. -
కొత్త ఏడాదీ... సర్కారీ ఐపీఓల జోరు!
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా 2018–19లో కేంద్రం పెద్ద యెత్తున నిధులు సమీకరించనున్న నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ఐపీవోల జోరు కొనసాగనుంది. అన్నింటికన్నా ముందుగా రైట్స్, ఐఆర్ఎఫ్సీ పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది మేలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ఇదే కోవకి చెందిన మరో రెండు పీఎస్‌యూలు ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్ ఐపీవోలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్నాయి. 2018–19లో పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీవోల జాబితాలో మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంస్థలు ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే వీటి పబ్లిక్ ఇష్యూలు ఉండొచ్చని అంచనా. అలాగే, సాధారణ బీమా పీఎస్‌యూలు మూడింటిని (నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్) కలిపేసి ఒకే సంస్థగా లిస్ట్ చేసే యోచన కూడా ఉంది. 2017–18లో రికార్డు స్థాయిలో ఆరు పీఎస్‌యూలు ఐపీవోకి వచ్చాయి. రూ. 24,000 కోట్లు సమీకరించాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, కార్పొరేషన్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, కొచిన్ షిప్‌యార్డ్, హడ్కో వీటిలో ఉన్నాయి. అన్నింటికన్నా ముందుగా రైట్స్.. ఐఆర్ఎఫ్సీ, రైట్స్ ఐపీవోలు మే నెలాఖరులోగా ఉండొచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండింటిలో ముందుగా రైట్స్ ఐపీవో ఉండనుంది. ఈ సంస్థ ఇష్యూలో కేంద్రం 12 శాతం మేర వాటాలు విక్రయించే అవకాశం ఉంది. ఇక ఐఆర్ఎఫ్సీ సంగతి తీసుకుంటే 10 శాతం వాటాలు విక్రయించవచ్చని అంచనా. ఆర్‌వీఎన్‌ఎల్‌లో 25 శాతం డిజిన్వెస్ట్‌మెంట్ ఉండవచ్చు. వాస్తవానికి పన్ను సంబంధ వివాదం కారణంగా ఐఆర్ఎఫ్సీ లిస్టింగ్ ప్రతిపాదనలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మినహాయింపు లభించడంతో ఐఆర్ఎఫ్సీ ఐపీవోకి మార్గం సుగమం చేసింది. రైట్స్ ఐపీవోకి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, ఎలార సెక్యూరిటీస్ ఇండియా, ఐడీఎఫ్సీ బ్యాంక్ సంస్థలు అడ్వైజర్స్‌గా ఉండనున్నాయి. అటు ఐఆర్ఎఫ్సీ ఇష్యూకి ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాప్స్, ఐడీఎఫ్సీ, హెచ్ఎస్బీసీ .. అడ్వైజర్స్‌గా ఉండనున్నాయి. ఐఆర్సీటీసీ ఇష్యూకి సర్వీస్ చార్జీల అడ్డంకి.. మిగతా పీఎస్‌యూల లిస్టింగ్ ప్రణాళికలు చకచకా ముందుకు సాగుతున్నప్పటికీ.. ఐఆర్సీటీసీ ఐపీవో ప్రతిపాదనను మాత్రం నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ కీలక ఆదాయ వనరైన సర్వీసు చార్జీలను రద్దు చేయడం వల్ల ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చని భావిస్తుండటమే ఇందుకు కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. టికెట్లు, ఇతరత్రా సర్వీసుల బుకింగ్‌పై విధించే సర్వీస్ చార్జీలే కంపెనీకి ప్రధాన ఆదాయ వనరైనప్పుడు.. ప్రభుత్వం దాన్నే తొలగించేస్తే, ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంటుందని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఐఆర్సీటీసీ ద్వారా బుకింగ్స్‌పై సర్వీస్ చార్జీలను తొలగించింది. దీంతో ఐఆర్సీటీసీ వార్షికాదాయం రూ.500 కోట్ల మేర తగ్గింది. ఆర్థిక శాఖ దీన్ని భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ.. రూ. 80 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేసింది. పవన్‌హన్స్‌లో పూర్తి వాటాల విక్రయం.. ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను ప్రైవేటీకరించే ప్రయత్నాలను వేగవంతం చేసిన కేంద్రం తాజాగా పవన్‌హన్స్‌లోనూ వాటాల విక్రయంపై సమాలోచనలు చేస్తోంది. పవన్‌హన్స్‌లో కేంద్రం పూర్తి వాటాలను విక్రయించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్ సర్వీసులు అందించే ఈ కంపెనీలో కేంద్రానికి, ఓఎన్జీసీకి చెరి 50 శాతం వాటాలు ఉన్నాయి. ఐపీఓ పత్రాలు సమర్పించిన 4 పీఎస్‌యూలు న్యూఢిల్లీ: మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు మరో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఐపీఓ పత్రాలను సెబీకి ఇటీవలే సమర్పించాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రైల్వే మౌలిక సదుపాయాల సంస్థ, ఇర్కాన్ ఇంటర్నేషనల్, యుద్ధ నౌకల తయారీ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్.. ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తాజాగా ఐపీఓ పత్రాలను సమర్పించాయి. -
ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్లను డిజిన్వెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ: భారీ ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియాలను డిజిన్వెస్ట్ చేయాలని, వీటి వాటాల విక్రయం ద్వారా లక్షల కోట్ల నిధుల్ని ఆకర్షించవచ్చని ప్రముఖ వాణిజ్యవేత్త దీపక్ పారిఖ్ ప్రభుత్వానికి సూచించారు. ఈ కంపెనీల షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయాలని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఇటువంటి భారీ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనలు గత యూపీఏ ప్రభుత్వ హయాం నుంచి వాయిదాపడుతూ వస్తున్నాయన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రజాకర్షక పథకాలకు ప్రాధాన్యత తగ్గించాలి... నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలకు ప్రాధాన్యత తగ్గించి, కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించేందుకు వీలుగా కంపెనీలకు ప్రోత్సాహకాలను ప్రకటించాలని పారిఖ్ విజ్ఞప్తిచేశారు. తద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతం లభిస్తుందన్నారు. సబ్సిడీల తగ్గింపు, వృధా వ్యయాల నియంత్రణ వంటి చర్యల్ని చేపట్టడానికి తగినరీతిలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు వుందని, మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ఇదే అనువైన సమయమని చెప్పారు. వ్యాపారాల్ని సులభంగా నిర్వహించడానికి మోది ప్రభుత్వం పలు నిర్ణయాల్ని తీసుకున్నదని, ఆ నిర్ణయాల అమలును వేగవంతం చేయాల్సిఉందని అభిప్రాయపడ్డారు.