ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌లను డిజిన్వెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ: భారీ ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్ ఇండియాలను డిజిన్వెస్ట్ చేయాలని, వీటి వాటాల విక్రయం ద్వారా లక్షల కోట్ల నిధుల్ని ఆకర్షించవచ్చని ప్రముఖ వాణిజ్యవేత్త దీపక్ పారిఖ్ ప్రభుత్వానికి సూచించారు. ఈ కంపెనీల షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయాలని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఇటువంటి భారీ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనలు గత యూపీఏ ప్రభుత్వ హయాం నుంచి వాయిదాపడుతూ వస్తున్నాయన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
ప్రజాకర్షక పథకాలకు ప్రాధాన్యత తగ్గించాలి...
నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలకు ప్రాధాన్యత తగ్గించి, కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించేందుకు వీలుగా కంపెనీలకు ప్రోత్సాహకాలను ప్రకటించాలని పారిఖ్ విజ్ఞప్తిచేశారు. తద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతం లభిస్తుందన్నారు. సబ్సిడీల తగ్గింపు, వృధా వ్యయాల నియంత్రణ వంటి చర్యల్ని చేపట్టడానికి తగినరీతిలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు వుందని, మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ఇదే అనువైన సమయమని చెప్పారు. వ్యాపారాల్ని సులభంగా నిర్వహించడానికి మోది ప్రభుత్వం పలు నిర్ణయాల్ని తీసుకున్నదని, ఆ నిర్ణయాల అమలును వేగవంతం చేయాల్సిఉందని అభిప్రాయపడ్డారు.