అరవింద్ పనగారియా కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన అరవింద్ పనగారియా కీలక వ్యాఖ్యలు చేశారు. నష్టాల్లో ఉన్న 18 నుంచి 20 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడమే మంచిదని అరవింద్ పనగారియా సూచించారు. నష్టాల్లో ఉన్న కంపెనీల లాభదాయకతను పరీక్షించాలని నీతి ఆయోగ్‌ను ప్రధానమంత్రి ఆఫీసు ఆదేశించింది. 18-20 నష్టాల్లో ఉన్న పీఎస్‌యూలను మూసివేయడమే చాలా మంచిదంటూ పనగారియా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు వాటిలో 17 పీఎస్‌యూ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయాలంటూ కేబినెట్ ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కూడా నెమ్మదిగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూలో వాటాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.72,500 కోట్లను పొందాలని చూస్తోంది.
వాటిలో మైనార్టీ వాటాల విక్రయం నుంచి రూ.46,500 కోట్లు, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.15వేల కోట్లు, పీఎస్‌యూ ఇన్సూరెన్స్ కంపెనీల లిస్టింగ్ నుంచి రూ.11వేల కోట్లను ఆర్జించనుంది. ఆర్థిక వృద్ధి విషయాన్ని తీసుకుంటే ఈ ఏడాది 7.5 శాతం వృద్ధిని ఆర్జించాల్సి ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో 8 శాతం వృద్ధిని తాకే అవకాశముందని తెలిపారు. ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్-మార్చి నుంచి జనవరి-డిసెంబర్‌కు మార్చడంతో ఏ మేర వ్యయాలను భరించాల్సి వస్తుందో చూడాల్సి ఉందన్నారు. అన్ని అంశాలకు తాము అంగీకారం తెలుపబోమని కానీ అంతిమంగా దేశప్రయోజనాలను తాము పరిగణలోకి తీసుకుంటామని పనగారియా చెప్పారు. కాగ, ఇటీవలే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పనగారియా, ఈ నెల 31 వరకు తన పదవిలో కొనసాగనున్నారు.